Home » Shiva » శివుడికి జిల్లేడు పువ్వులంటే ఎందుకంత ఇష్టం..!

శివుడికి జిల్లేడు పువ్వులంటే ఎందుకంత ఇష్టం..!


 

పరమశివుడి పూజలో పత్రాలు, పుష్పాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. శివుడు చాలా భోళ  మనసు కలవాడు. కొండంత ఆడంబరాల కంటే స్వచ్ఛమైన భక్తితో సమర్పించే చిన్న పూవునైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తారు. అందుకే శివుడిని బోళాశంకరుడు అని పిలుస్తారు. పరమేశ్వరుడికి సమర్పించే రకరకాల పువ్వులలో జిల్లేడు పువ్వులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పల్లెల నుంచి పట్టణాల వరకు పొలాల గట్ల మీద, తోటల్లో సులభంగా దొరికే జిల్లేడు పువ్వులంటే ముక్కంటికి ఎంతో ఇష్టం. శివారాధనలో ఈ పువ్వులను ఉపయోగించడం వెనుక ఎంతో ఆధ్యాత్మిక అంతరార్థం, గొప్ప విశిష్టత ఉన్నాయి. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే..

శైవ పురాణాల ప్రకారం పరమశివుడికి జిల్లేడు పువ్వులంటే ప్రత్యేకమైన ప్రీతి ఉండటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. క్షీరసాగర మథనం జరిగిన సమయంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు మొదటగా హాలాహలం అనే  విషం వెలువడింది. ఆ విష అగ్నికీలలకు సమస్త లోకాలు దహించుకుపోతుంటే, శివుడు లోకరక్షణ కోసం ఆ విషాన్ని తాను తాగేశాడు. అలా విషాన్ని మింగి నీలకంఠుడిగా మారిన శివుడి శరీరంలో అమితమైన వేడి ఉత్పన్నమైంది. జిల్లేడు మొక్కకు విష స్వభావాన్ని , శీతల గుణాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది. శివుడి ఉగ్రరూపాన్ని, శరీరంలోని వేడిని చల్లబరచడానికి, ఆయనలోని సృష్టి రక్షణ తత్వాన్ని గుర్తుచేసుకోవడానికి జిల్లేడు పూలతో పూజించడం ఆనవాయితీగా మారింది.

మరొక ఆధ్యాత్మిక కోణం ఏమిటంటే జిల్లేడు పువ్వులకు ఎలాంటి సువాసన ఉండదు. అందమైన రంగులు, తావి ఉండే పువ్వులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఈ లోకంలో, ఎవరూ పట్టించుకోని సువాసన లేని జిల్లేడు పువ్వులను శివుడు ఇష్టంగా స్వీకరిస్తాడు. ఇది మనకు ఒక గొప్ప జీవన సత్యాన్ని తెలుపుతుంది. బాహ్య సౌందర్యం, ఆడంబరాలు ముఖ్య కాదని, హృదయపూర్వకమైన స్వచ్ఛమైన భక్తి మాత్రమే ప్రధానమని పరమేశ్వరుడు ఈ రూపంలో సందేశమిస్తాడు. అందరూ వదిలేసిన వాటిని కూడా తాను స్వీకరిస్తాననేది శివుడి తత్వానికి నిదర్శనం.

జిల్లేడు పువ్వులలో తెల్ల జిల్లేడు , నీల జిల్లేడు అని రెండు రకాలు ఉంటాయి. వీటిలో తెల్ల జిల్లేడు పువ్వులు శివుడి పూజకు అత్యంత శ్రేష్ఠమైనవిగా భావిస్తారు. శివరాత్రి, సోమవారం , శ్రావణ మాసంలో శివుడికి తెల్ల జిల్లేడు పూలమాల సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

జిల్లేడు పువ్వులతో శివుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జిల్లేడు పువ్వులతో అర్చించడం వల్ల మనస్సులోని ప్రతికూల ఆలోచనలు, భయాలు తొలగిపోతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. శరీరంలో , చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రతికూల శక్తి నశించి, సానుకూల  శక్తి పెరుగుతుంది.

జాతకంలో గ్రహ దోషాలు, ముఖ్యంగా శని , రాహు-కేతు దోషాలతో బాధపడేవారు సోమవారాల్లో శివుడికి జిల్లేడు పువ్వులు సమర్పిస్తే ఆయా గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. శని దేవుడి ఆగ్రహం  నుంచి ఉపశమనం లభిస్తుంది.

సంతాన లేమితో బాధపడేవారు , కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవారు శివుడికి తెల్ల జిల్లేడు పూలతో అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

జిల్లేడును ఆర్క వృక్షం అని కూడా అంటారు. సూర్యభగవానుడి శక్తి ఈ చెట్టులో ఉంటుందని నమ్ముతారు. కాబట్టి జిల్లేడు పువ్వులతో శివుడిని పూజించడం వల్ల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం లభించి ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి.

జీవితంలో తరచూ ఎదురయ్యే ఆటంకాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఒత్తిళ్లు ఉన్నవారు శ్రావణ మాసంలో లేదా సాధారణ సోమవారాల్లో శివలింగానికి జిల్లేడు పూలమాల వేసి నమస్కరిస్తే పనుల్లో విజయం లభిస్తుంది.

శివారాధనలో జిల్లేడు పూలను ఉపయోగించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. పువ్వులు పరిశుభ్రంగా, తెగిపోకుండా ఉండాలి.  మనస్సులోని అహంకారాన్ని, చెడు గుణాలను వదిలేసి, జిల్లేడు పువ్వులాంటి అమాయకమైన, స్వచ్ఛమైన భక్తితో శివుడిని ఆరాధిస్తే ఆ బోళాశంకరుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

                                                                                                                                                *రూపశ్రీ.

google-ad-img