భాగవత పురాణం పారాయణం చేయడం వల్ల జరిగే అద్భుతాలు..!

శ్రీమద్భాగవత పురాణం హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా, వేదాల సార రూపంగా భావించబడుతుంది. వేదవ్యాస మహర్షి సకల వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం రచించిన తర్వాత కూడా మనశ్శాంతి లభించకపోతే, నారద మహర్షి ఉపదేశం మేరకు భాగవతాన్ని రచించారట. ఈ పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేయడం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఫలితాలే కాకుండా మానసిక, శారీరకంగానే కాకుండా చేపట్టిన రంగాలలో కూడా అనేక అద్భుతమైన మార్పులు సంభవిస్తాయట. భాగవత పారాయణం వల్ల కలిగే ప్రభావాలు, జరిగే అద్భుతాలు క్షుణ్ణంగా తెలుసుకుంటే..
పాప పరిహారం , పూర్వ జన్మ కర్మల క్షయం..
భాగవత పురాణాన్ని శ్రద్ధతో పారాయణం చేయడం లేదా వినడం వల్ల మనిషి తెలిసీ తెలియక చేసిన సకల పాపాలు నశిస్తాయట. ఎన్నో జన్మల నుంచి వస్తున్న కర్మ బంధాలు తెగిపోతాయట. శ్రీకృష్ణుని లీలలు, భక్తుల కథలు వినడం వల్ల మనస్సులో ఉండే మలినాలు తొలిగిపోయి ఆత్మ శుద్ధి జరుగుతుందని చెబుతారు.
భయాలు తొలగిపోవడం , అభయం లభించడం..
భాగవతాన్ని స్వయంగా శుకమహర్షి, పరీక్షిత్తు మహారాజుకు ఆయన జీవిత చరమదశలో ఏడు రోజుల పాటు ఉపదేశించారు. మరణ భయంతో ఉన్న పరీక్షిత్తు భాగవత శ్రవణం వల్ల అభయాన్ని పొందాడు. ఈ పురాణ పారాయణం వల్ల మనుషుల్లో ఉండే సమస్త భయాలు, ముఖ్యంగా మరణ భయం, కాల భయం , శత్రు భయాలు పూర్తిగా తొలగిపోతాయి.
మానసిక ప్రశాంతత , ఏకాగ్రత..
నేటి ఆధునిక యుగంలో మానసిక ఒత్తిడి, ఆందోళన, అశాంతి ఎక్కువగా కనిపిస్తున్నాయి. భాగవత పారాయణం మానసిక ప్రశాంతతను ఇచ్చేదివ్యౌషధంగా పనిచేస్తుంది. భాగవతంలోని కృష్ణుని గుణం, భక్తి యోగం మనస్సును ప్రశాంతపరుస్తాయి. దీనివల్ల సద్బుద్ధి, సరైన నిర్ణయాలు తీసుకునే విచక్షణ జ్ఞానం పెరుగుతాయి.
ఇంటి వాతావరణంలో పవిత్రత , లక్ష్మీ కటాక్షం..
ఏ ఇంట్లో భాగవత పారాయణం జరుగుతుందో లేదా భాగవత గ్రంథం పూజించబడుతుందో, ఆ ఇంట్లో లక్ష్మీదేవి, శ్రీమహావిష్ణువు నిత్యం నివాసం ఉంటారని నమ్ముతారు. ఆ ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి, అనుకూల తరంగాలు వ్యాపిస్తాయట. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలిగిపోయి అన్యోన్యత, శాంతి, ఐశ్వర్యం లభిస్తాయట.
ఆధ్యాత్మిక పురోగతి ,
భక్తి పెరుగుదల..భాగవతం కేవలం కథల సమాహారం మాత్రమే కాదు, అది జ్ఞాన గంగ అని చెబుతారు . ధ్రువుడు, ప్రహ్లాదుడు, అంబరీషుడు వంటి పరమ భాగవతుల జీవిత చరిత్రలు చదవడం వల్ల మానవుడిలో శరణాగతి భావం, నిశ్చలమైన భక్తి అలవడతాయి. దేవుని పట్ల ప్రేమ పెరిగి, జీవితంపై సరైన దృష్టి ఏర్పడుతుంది.
పితృదేవతల రుణం , పితృదోష నివారణ..
పితృదోషాలు, వంశ పారంపర్యంగా వస్తున్న సమస్యలు భాగవత సప్తాహం లేదా నిత్య పారాయణంతో నివారించబడతాయి. పారాయణం వల్ల వచ్చే పుణ్యఫలాన్ని పితృదేవతలకు ధారపోస్తే వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. దీనివల్ల వంశాభివృద్ధి, సంతాన ప్రాప్తి లభిస్తాయి.
మోక్ష సాధన , జన్మరాహిత్యం..
సకల పురాణాలలో భాగవతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది జీవుడికి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రసాదించి, చివరికి భగవంతుని దివ్య చరణాలలో స్థానం కల్పిస్తుంది.
ఈ విధంగా భాగవత పురాణ పారాయణం చేయడం వల్ల లభించే ఫలితాలు అపారమైనవి. నిత్యం కనీసం ఒక్క అధ్యాయం లేదా కొన్ని శ్లోకాలైనా పారాయణం చేయడం వల్ల జీవితంలో ఊహించని శుభ పరిణామాలు, అద్భుతాలు జరుగుతాయి.
*రూపశ్రీ.






