బలరామకృష్ణుల గురించి గర్గుడు ఏమి చెప్పాడు!

ఒక రోజు యాదవ పురోహితుడైన గర్గుడు నందుడి ఇంటికి వచ్చాడు. నంద యశోదలు, రోహిణి భక్తిపూర్వకంగా ఆయనకు అతిథి పూజలు చేశారు. పరిచర్యలన్నీ ఆయ్యాక 'మహాత్మా! మీరు పండితులు. మాకు పెద్దలు. మీరే ఈ చిన్నబిడ్డలిద్దరికీ సంస్కారాలు జరిపించాలని మా కోరిక' అన్నాడు నందుడు బలరామకృష్ణులిద్దర్నీ చూపించి.

నందుని ప్రార్థన అంగీకరించి గర్గుడు రోహిణీ కుమారుడికి బలరాముడనీ యశోదాపుత్రుడికి కృష్ణుడనీ పేర్లు పెట్టాడు. రోహిణీ కుమారుడు తన గుణాలద్వారా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకని ఇతనికి నేను 'రాముడు' అని నామకరణ చేసాను. కాలక్రమాన ఈ చిరంజీవి అత్యధిక బలసంపన్నుడవుతాడు. వీరుడు, ధీరుడు అవుతాడు. ఆ కారణాన ఇతన్ని 'బలుడు' అని కూడా పిలుస్తారు. యాదవులందర్నీ సమభావంతో చూస్తూ ఒకేవిధంగా ఆదరిస్తూ వుంటాడు. కాబట్టి ఇతనికి 'సంకర్షణుడు' అన్న పేరు కూడా వ్యాప్తిలోకి వస్తుంది.

ఇక యశోదాతనయుని విషయానికొస్తే ఈ చిన్నారి గడచిన మూడు యుగాల్లోనూ మూడు రంగులు - శ్వేత, రక్త, పీత వర్ణాలు ధరించి అవతరించాడు. ఇప్పుడు నల్లవాడై పుట్టాడు. అందుకని ఇతనికి 'కృష్ణుడు' అని నామకరణం చేస్తున్నాను. ఇతను మొదట వసుదేవుని ఇంట పుట్టాడు. ఆ రహస్యం తెలిసిన ప్రాజ్ఞులు ఇతనిని 'వాసుదేవుడు' అని కూడా పిలుస్తారు. ఈ కృష్ణయ్య ముందు ముందు అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. అనేక వింతలు ప్రదర్శిస్తాడు. దాని కారణంగా ఇతనిని ఇంకా అనేక పేర్లతో పిలుస్తారు. ఇతను దుర్జనులను శిక్షిస్తాడు. సజ్జనులను రక్షిస్తాడు. ఇతనివల్ల ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇతనివల్ల మీరూ, గోపకులూ, గోకులం ఎన్ని కష్టాలెదురైనా అవలీలగా అధిగమించగలుగుతారు. ఇతనిని పెంచి పెద్ద చేయడమే మహాఅదృష్టం. ఆ అదృష్టం మీకు దక్కింది. అది మీ పూర్వజన్మ సుకృతం.

పూర్వం అరాచకం ప్రబలిన ఒక సమయంలో ఈ మహానుభావుడ్ని ఆశ్రయించి అనుగ్రహం పొందిన ఎందరో మహర్షులూ, సాధువులూ దుర్మార్గుల దురాగతాలను అవలీలగా ఎదుర్కొన్నారు. ఇతనిపట్ల భక్తి భావంగల వారినీ, ప్రేమించే వారినీ, ఇతనిని కొలిచేవారినీ యెటువంటి శత్రువులైనా, ఎంతటి బలవంతులైనా ఏమీ చేయలేరు.

'నందా! మరొక విషయం. ఈ చిన్నారి సామాన్యుడు కాడు. విశేష ప్రతిభ గలవాడు. గుణగణాల్లోనూ, అధికార ఐశ్వర్యాలలోనూ, కీర్తిప్రతిష్టలలోనూ, భోగానుభవంలోనూ ఇతను సాక్షాత్తూ శ్రీహరికి సముడనిపించుకుంటాడు. ఇతని చర్యలన్నీ చూపరులకు వింతగా వుంటాయి. ఈ బిడ్డవల్ల మీ జీవితాలు తరిస్తాయి. మీ బతుకులకు ధన్యత కలుగుతుంది. ఇతనిని మీరు కంటికిరెప్ప మాదిరి కాపాడుకోవాలి' అని చెప్పి గర్గుడు వెళ్ళిపోయాడు.

నందుడు పరమానందభరితుడయ్యాడు. బలరామకృష్ణులు ఆటపాటలతో వ్రేపల్లెకు కొత్త వెలుగు తెచ్చారు. కృష్ణుడి అల్లరి మరీ ఎక్కువైంది. ఆవుదూడల తోకలు పట్టుకుని అటూ ఇటూ లాగి వాటిని వేధించడం, ఇరుగుపొరుగు ఇళ్ళలో దూరి గోపికలు దాచుకున్న పాలూ పెరుగూ తను తిన్నంత తిని మిగిలింది తన స్నేహితులకు పంచిపెట్టటం, కట్టివున్న దూడలను వాటి తల్లుల దగ్గరకు వదలడం, ఆడపిల్లల్ని ఏడిపించడంవంటి అల్లరి పనులు చేయటం మొదలు పెట్టాడు.

కృష్ణయ్య అల్లరి కోపం తెప్పించినా అతనిని తలచుకోకుండా, అతనిని చూడకుండా వ్రేపల్లె వాసులు ఒక్కక్షణం కూడా వుండలేకపోయేవారు. గోపికలకు అతని ఆటపాటలు మహదానందంగా వుండేవి. కృష్ణయ్య చేష్టలు వాళ్ళకు గిలిగింతలు పెట్టేవి. ఆలుమగలు నిద్రిస్తుంటే వాళ్ళకు తెలియకుండా.. ఆమె జడను అతని కొప్పుకు కట్టేసేవాడు. రాత్రిళ్ళు ఇళ్ళల్లో జొరబడి ఉట్టిమీద వున్న పాలు, పెరుగు తాగేవాడు. అతనిచుట్టూ ఎప్పుడూ ఓ పదిమంది సహవాసగాళ్ళుండేవాళ్ళు. అందరూ అల్లరివాళ్ళే. వాళ్ళందరికీ నాయకుడు కృష్ణయ్య. కన్నెపిల్లలు కవ్వాలేసుకుని మజ్జిగ చిలికి వెన్న తీస్తుంటే వెనకగా వెళ్ళి బానలో వున్న వెన్నంతా ఆరగించేవాడు. ఎంతకీ బాన నిండటం లేదేమిటని గోపకన్యలు బుగ్గలు నొక్కుకునేసరికి బాన చాటున కృష్ణయ్య నక్కేవాడు.

ఒకసారి చిన్నికృష్ణయ్య ఇలాగే దొరికిపోయాడు. గోపెమ్మ తెడ్డుతీసి కొట్టబోయింది. తటాలున కృష్ణయ్య ఎడమచేత్తో ఇంత వెన్న తీసి ఆమె ముఖాన కొట్టి పారిపోయాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఊరి అమ్మలక్కలంతా యశోద ఇంటికి వచ్చి కృష్ణయ్య అల్లరి మితిమీరుతోందని దీనంగా మొరపెట్టుకున్నారు. బాలకృష్ణుని దుడుకుతనం గురించి గోపస్త్రీలు కథలు కథలుగా చెబుతుంటే యశోదకు నమ్మబుద్ధి కాలేదు. ఇంతలో కొందరు గోపికలు చిన్నికృష్ణుడ్ని బంధించి తీసుకువచ్చారు.

ఆ సమయాన కృష్ణయ్య యశోద ఒడిలో పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. గోపికలు తల్లి ఒడిలో బాలకృష్ణుడు నిద్రపోతుండడం చూసి, తాము బంధించి తీసుకువచ్చిన కృష్ణయ్య కనపడకపోవడం గ్రహించి ఆశ్చర్యపోయారు. యశోదకు కూడా ఇదంతా మాయలా వుంది.

ఒడిలోని దివ్యమంగళరూపుడ్ని, లీలామానుషస్వరూపుడ్ని ఒళ్ళంతా నిమిరి గుండెలకు హత్తుకుంది. 'దొంగపిల్లడు' అని బుగ్గగిల్లి గోపకన్యలు వెళ్ళిపోయారు. ఇలా బాల కృష్ణుడి అల్లరి గోకులాన్ని  ఎప్పుడూ కనువిందు చేస్తుండేది..

                                    ◆నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories