రైతు ఈరోజే పొలం పనులు ఎందుకు మొదలుపెడతాడో తెలుసా..?

 

భారత దేశము వ్యవసాయ ఆధారిత దేశము.  లోకములో ఎన్నో రకాల ఉద్యోగాలున్నా, ఎన్ని సదుపాయాలు ఉన్నా అన్నీ "అన్నదాత" ముందు చిన్నవే. ఎంత డబ్బు ఉన్నా సమయానికి ఆహరం అందకపోతే అల్లాడిపోతాము. అటువంటప్పుడు ఆ ఆహారాన్ని కష్టపడి పండించే అన్నదాత, రైతు పట్ల ఎంత మర్యాద ఉన్నా తక్కువే కదా.

 

ఆ రైతులు క్రొత్తగా వ్యవసాయ పనులు మొదలు పెట్టే రోజు జ్యేష్ఠ మాసములో వచ్చే పౌర్ణమి. దీనినే ఏరువాక పౌర్ణమి అంటారు. వానలు పడే సమయము అవ్వడముతో భూమిని చక్కగా దుక్కి, దున్ని సిద్ధంగా పెట్టుకుని భగవంతుని దయతో వానలు సకాలములో, సమృద్ధిగా  కురవాలని, చక్కని పంటలతో లోకమంతా సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని కోరుకునే రోజు.

 

లోకానికి అన్నం పెట్టే రైతులు తమ జీవనాధారమైన వ్యవసాయములో తమకు సాయము చేసే పశువులను, ఉపకరణములను అంటే అరక వంటి వాటికీ పూజ చేసి, ముహూర్తం పెట్టించి, భూమి పూజ చేసి, నేలను చక్కగా దుక్కి,దున్ని వర్షపు నీటిని గ్రహించేలా సిద్ధం చేసుకుని విత్తనాలు చల్లుతారు.

 

సాయం చేసిన ప్రతివారికీ కృతజ్ఞతలు ఆవిష్కరించడం అనేది మన భారతీయుల ఔన్నత్యాన్ని లోకానికి చాటింది. అందుకే చెట్టును, పుట్టను ప్రతి ఒక్కదాన్ని గౌరవించి, దైవంగా పూజించడం, రక్షించడం అనేది మన జీవన విధానములో ప్రధాన పాత్ర పోషిస్తూ వచ్చింది. అందుకే చలన చిత్రాలలో సైతం..

 

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న
నీ కష్టమంతా తీరునురో  రన్నో చిన్నన్న

అంటూ దీవించారు...

మనము ఈ రోజు మన అన్న దాతలతో పాటు దైవాన్ని ప్రార్ధించి లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుందాము. దళారీల పాలిట పడకుండా అన్నదాతలంతా హాయిగా ఉండాలని మనసారా వేడుకుందాము. స్వస్తి..


More Others