సఫల ఏకాదశి రోజు ఈ పనులు చేయకండి..!

మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశికి సఫల ఏకాదశి అని పేరు.  సాధారణంగానే ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక సఫల ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. విద్యలో వెనుకబడిన విద్యార్థులకు, భ్రష్టు పట్టి పోయిన పిల్లలు బాగు పడటం కోసం ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి,  విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలా గొప్ప ఫలితాలు ఉంటాయి. అయితే సఫల ఏకాదశి రోజు కొన్ని పనులు చేయకూడదు.  అలా చెయ్యకూడని పనులు చేస్తే ఏకాదశి ఫలితం ఉండకపోగా విష్ణుమూర్తి ఆగ్రహానికి  గురవుతారని చెబుతారు.  ఇంతకీ సఫల ఏకాదశి రోజు చెయ్యకూడని పనులేంటో తెలుసుకుంటే..

సఫల ఏకాదశి ఉపవాసం చేసేవారు  ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  ఈరోజున ఎట్టి పరిస్థితిలోనూ అన్నం తినకూడదు. ఏకాదశి ఉపవాసం చేసేవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు.  ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు అంటే ఆరోగ్యం పరంగా ఆహారం తప్పనిసరిగా తీసుకోవాల్సిన వారు ఉంటారు. అలాంటి వారు సాత్వికంగా ఉండే అల్పాహారాలు తీసుకోవచ్చు. అంతేకానీ అన్నం ఎట్టి పరిస్థితిలో తినకూడదు.

ఆహారంలో తామసిక పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో మాంసం, మద్యం,  మసాలా ఆహారాలు,  గుడ్డు, ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైనవి ప్రధానమైనవి. ఇలాంటి ఆహారాలను సఫల ఏకాదశి ఉపవాసం రోజు అస్సలు తీసుకోకూడదు. ఉపవాసం లేని వారైనా సరే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండి విష్ణు మూర్తిని ఆరాధించినా,  ధ్యానించినా ఆయన అనుగ్రహం కలుగుతుంది.

తులసి దళాలతో చేసే పూజ అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి.  అయితే తులసిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఈ కారణంగా ఏకాదశి,  శుక్రవారం,  మంగళవారం, సూర్యాస్తమయం తర్వాత  వంటి  తులసి ఆకులను కోయడం నిషేధం.  ఈ సమయాలలో తులసిని కోయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది, మహా విష్ణువు కూడా ఆగ్రహిస్తాడు.

సాధారణ రోజులలో అబద్దాలు,  సాకులు చాలా చెబుతూ ఉంటారు. కానీ ఉపవాసాలు ఉన్న రోజులు,  ఏకాదశి వంటి తిథులు,  దైవారాధనలో ఉన్న సందర్భాలలో అబద్దం చెప్పడం చాలా పాపం.  ఒకవేళ అబద్దాలు చెబితే దేవతలు ఆగ్రహిస్తారని చెబుతారు. అంతేకాదు.. ఉపవాసాలు ఉండే రోజుల్లో అబద్దాలు  చెప్పడం,  ఇతరులను హింసించడం వంటివి చేస్తే  ఉపవాస ఫలితం ఉండకపోగా,  పాపం చుట్టుకుంటుంది.

ఏకాదశి,  పండుగ తిథులు,  సోమవారాలు, మంగళవారం,  శుక్రవారం.. వంటి రోజులలో జుట్టు కత్తిరించడం,  గోళ్లు కత్తిరించడం, గడ్డం గీయడం మొదలైనవి చాలా పాపపు పనులుగా పరిగణిస్తారు.  ఒకవేళ అలా చేస్తే.. మానసిక అశాంతి,  ఒత్తిడి,  జీవితంలో దురదృష్టం రావడం వంటివి జరుగుతాయట.  కాబట్టి సఫల ఏకాదశి రోజు పైన పేర్కొన్న పనులు చేయకుండా ఉండటం మంచిది.

                            *రూపశ్రీ.


More Vaikuntha Ekadashi