మంత్రజపం, ముఖ స్తుతిగా మారుతోందా??

ఒక సారి ఒక మహా భక్తుడు (దత్తాత్రేయ భక్తుడు) అరణ్యంలో ఒంటరిగా దత్త మంత్రం జపం చేస్తూ వెళుతున్నాడు. తన మీదకు ఒక పెద్దపులి దూకి రాబోతోంది. అది ఇంక ఏ క్షణంలో అయినా అతని మెడ కొరికి చంపి తినేయగలదు. అప్పుడు సామాన్య మనుషులు అయితే భయం, అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలా అనే ఆలోచన, అసలు దానికి దొరకకుండా ఉండటానికి ఏమి చేయాలి అని దిక్కులు చూడటం చేస్తారు.  తరువాత అక్కడి నుండి పారిపోవడం చేస్తారు. దేవుడా దేవుడా అనే మాట తప్ప మంత్రం జ్ఞాపకం రాదు. కానీ, ఈ భక్తుడు ఏమన్నాడు అంటే , ఓ వ్యాఘ్రరాజమా! నీకు నా శరీర భక్షణకు ఏ జ్మనలోనైనా ఋణమై ఉంటే , అదే నా దత్తుని యొక్క ఇష్టం అయితే, ఈ శరీరం తో ఇప్పుడు నాకు పనిలేదు. నీవు తినవచ్చు అని ముందుకు వెళ్ళాడు. 

అప్పుడు ఆ పులి దత్తాత్రేయ రూపంలోకి మారిపోయి అతడి ముందు నిలబడింది. వత్సా ! నీ అచంచల భక్తి విశ్వాసాలకు నేను మెచ్చాను. ప్రాణం పోయే ప్రమాదం లో ఉండి కూడా గురువునే జ్ఞాపకం చేసుకున్నావు. గురువు ఇచ్చిన మంత్రాన్నే జ్ఞాపకం చేసుకున్నావు. నీ శరీరం లెక్కలేదని నిలబడ్డావు. ఇప్పుడు నీకు నేను అన్ని విద్యలు నేర్పుతాను అని స్వయంగా దత్తుల వారు అన్నట్లు ఒక కథ ఉంది. 

దీని వలన మనం నేర్చుకున్న ధర్మం ఏమిటి అని ఎవరిని వారు ప్రశ్నించుకోవాలి. 

ఇక ఇందులో అంతరార్థం ఏమిటంటే "విశ్వాసం లేని వెగటుపని వ్యర్థ కార్యం" భక్తి అయినా, మంత్రజపం అయినా , తంత్రం అయినా ఏదైనా విశ్వాసంతో చేయాలి.  విశ్వాసాన్ని పెంచుకోవడానికి మనసును నమ్మవద్దు. గురుకృపని, జగన్మాత కృపనీ మాత్రమే నమ్మండి. అంటే ఇక్కడ కావలసింది ఆ గురువుకు, భగవంతుడికి భక్తిడికి, శిష్యుడికి మధ్య నమ్మకమనేది ఎంతో ముఖ్యమైనది. 

ఇతరులు చెప్పే అనుభవాలు, ఇతరుల మాటలు, నిరుత్సాహ పరిచే విషయాలు ఇవన్నీ ఎవరూ పరిగణనలోకి తీసుకోకూడదు. ఆకలి వేసింది నీకైతే నువ్వే అన్నం తింటావు కానీ ఎదుటి వాడిని అడిగి తినవు, జబ్బు చేస్తే నువ్వే మందు వేసుకుంటావు కానీ ఎదుటి వాడు వేసుకుంటే నీకు తగ్గదు. అట్లాగే ఇది కూడానూ. 

దేవుడి పట్ల, గురువు పట్ల ఉన్న నమ్మకాలు ఎంతో గొప్పవి. ఆ రెండూ మనసును విశ్వాసరూపంగా మారుస్తాయి. ఆ మూడు కలిపి ఒకటే విశ్వాసం అవుతాయి. అప్పుడు జన్మ ధన్యం అవుతుంది. అలా కాకుండా ఇందులో ఏ ఒక్కటి భిన్నత్వాన్ని తెచ్చుకున్నా మనం ఆశ్రయించిన ధర్మమే మనకు బరువు అవుతుంది. ప్రయోజనం లేకుండా పోతుంది. ఇన్ని విద్యలు, ఇన్ని మంత్రాలు , వీటన్నింటినీ మనం నేర్చుకునేది భయం లో నుండి, ద్వందత్వం లో నుండి లయం అవడానికి, మౌనంలోకి మౌనంలో నుంచి ధ్యానానికి వెళ్ళడానికి, సమాధి స్థితిని చేరడానికి అంతే కానీ మన స్వార్థ పూరీత అవసరాల కోసం కాదు. ఈ ప్రయోజనం నెరవేరక పోయినప్పుడు మంత్రం ఉండి ఏంటి ప్రయోజనం? సాధకులు ఇవి అన్ని ఆత్మ శోధన చేసుకోవాలి. మన అడ్డమైన కోరికలు తీర్చుకోవడం కోసం ఈ మంత్రాలను జపం చేయకండి. మనసు మాయలో పడి భ్రష్టులు  అవకండి. గొప్ప గొప్ప మంత్రాలను ఉపదేశం పొందాం అని నాకు శ్రీవిద్య ఉంది అని, నాకు భగళాముఖి ఉంది అని, నాకు రాజరాజేశ్వరీ ఉంది అని, నేను కాఫాలికుడిని, నేను కాళీ ఉపాసన చేస్తాను నాతో జాగ్రత్తగా ఉండాలి అని ఊరంతా దండోరా వేయడానికి కాదు ఈ విద్యలు అన్ని ఉన్నవి! ఆత్మజ్ఞానం పొంది మనల్ని మనం సంపూర్ణంగా ఆత్మ సమర్పణ చేసి జీవితం ధన్యం చేసుకోవడానికి కానీ ఆర్భారాలను చూపించడం కోసం కాదు. అంటే మీరు చేసేది మీలో మార్పు కోసం, మిమ్మల్ని మీరు సంపూర్ణం వైపు నడిపించుకోవడం కోసం అంతే కానీ నలుగురికి దాన్ని గొప్పగా చెప్పడానికి కాదు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories