చైనావారి కాళికా ఆలయం

 

 

చైనా! ఇండియా అంటే ఎప్పుడూ మండిపడే దేశం. ఎలాగైనా సరే మనమీద ఆధిపత్యం సాగించేందుకు ఎత్తులు వేస్తుండే రాజ్యం. కానీ అమ్మవారికి ఫలానా వారు చైనావారనీ, ఫలానావారు భారతీయులనీ పక్షపాతం ఉండదు కదా! అందుకనే, తన ఆలయాన్ని దర్శించే చైనీయులని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటోందా కలకత్తా కాళిక! కలకత్తాలోని టాంగ్రా అనే ఓ ప్రాంతం ఉండేది. ఎన్నాళ్ల నుంచో ఇక్కడ స్థిరపడిన చైనీయులు తోలు వ్యాపారం చేస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఆ టాంగ్రా ప్రాంతంలో ఎక్కడ చూసినా చైనీయుల సంస్కృతి సంప్రదాయాలే పలకరిస్తూ ఉంటాయి. కానీ ఒక్క చోట మాత్రం ఓ హిందూ ఆలయం కనిపిస్తుంది. దాని మీద ‘chinese kali mandir’ అని రాసి ఉంటుంది.

 

 

చైనీయులు నిర్మించుకున్న ఈ కాళికా మందిరం వెనక 60 ఏళ్ల చరిత్రం ఉంది. ఇక్కడ ఆలయం ఉన్న చోట ఓ రెండు రాళ్లు ఉండేవట. వాటిని కాళికా అమ్మవారిగా భావించి, బెంగాలీలు పూజలు చేసేవారు. అప్పట్లో అక్కడ నివసించే ఓ చైనా పిల్లవాడికి బాగా జబ్బు చేసింది. ఎన్ని మందులు వాడినా కూడా అతనికి ఎలాంటి సాంత్వనా లభించలేదు. ఇక ఆఖరి ఆస్త్రంగా ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, తమ బిడ్డను కాపాడమంటూ ఆ కాళికా అమ్మవారికి మొక్కుకున్నారు. ఆశ్చర్యం! వైద్యులు కూడా వల్ల కాదన్న ఆ పిల్లవాడు కోలుకున్నాడు. అప్పటి నుంచీ టాంగ్రాలో నివసించే చైనీయులంతా అక్కడి అమ్మవారిని కొల్చుకోవడం మొదలుపెట్టారు. గ్రానైట్ రాళ్లతో ఆలయాన్ని నిర్మించి, అమ్మవారి నూతన విగ్రహన్ని ప్రతిష్టించారు.

 

 

చైనా కాళికా ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం చైనీయులు బారులు తీరతారు. వారిలో బౌద్ధులు, క్రైస్తవులు అన్న బేధం ఉండదు. ఇక దీపావళి, దసరా వంటి సందర్భాలలో అయితే ఇక్కడ జరిగే పూజలలో దాదాపు రెండువేలమంది చైనీయులు పాల్గొంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి హిందువుల సంప్రదాయం ప్రకారమే మంత్రాలు చదువుతారు. కానీ ప్రసాదం మాత్రం చైనీయుల సంప్రదాయంలో ఉంటుంది. నూడుల్స్, చోప్సే వంటి చైనా సంప్రదాయ వంటకాలని అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారు. ఇక చైనీయుల సంప్రదాయం ప్రకారం కొవ్వుత్తులు వెలిగించడం, కాగితాలు కాల్చడం లాంటి సంప్రదాయాలను కూడా ఇక్కడ చూడవచ్చు.

చైనీయులు ఎక్కడ ఉన్నా మిగతావారితో పెద్దగా కలవరు. తమ పద్ధతులను కూడా పెద్దగా మార్చుకోరు. ఏ దేశంలో అడుగుపెట్టినా కూడా తమ జాతివారితో కలిసి ‘చైనా టౌన్’ అంటూ ఓ చిన్నపాటి బస్తీని ఏర్పాటు చేసుకుంటారు. టాంగ్రాలో కూడా చైనీయులు బెంగాలీలతో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తారు. కానీ ఈ ‘chinese kali mandir’ కనిపించగానే పాదరక్షలు విడిచి, అమ్మవారికి వినమ్రంగా నమస్కరించి కానీ ముందుకు కదలరు.

- నిర్జర.


More Punya Kshetralu