ఇదే బతుకమ్మ ప్రత్యేకత!
ఆశ్వయుజమాసం రాగానే దేశమంతా దసరాతో సందడిగా మారిపోతుంది. బెంగాల్, ఒడిషా వంటి రాష్ట్రాలలో దుర్గాపూజ పేరుతో వీధివీధీ పందిళ్లు వెలుస్తాయి. తెలంగాణకు ఈ ఆశ్వయుజం మరింత ప్రత్యేకం. ఈ మాసంలో దసరాతో పాటుగా బతుకమ్మ కూడా రావడమే ఇందుకు కారణం! ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తర్వాత బతుకమ్మ గురించి ప్రపంచానికి మరింత ఎక్కువగా తెలియడం మొదలుపెట్టింది. కానీ ఈ పండుగకు శతాబ్దాల చరిత్ర ఉంది!
భాద్రపదమాసంలో చివరిరోజైన ‘మహలయ అమావాస్య’ రోజున, అంటే దసరాకి ఓ రోజు ముందుగానే బతుకమ్మ పండుగ మొదలవుతుంది. ఈ బతుకమ్మ మొదలయ్యే సమయానికి వర్షాలు నిదానిస్తాయి; చెరువులన్నీ నిండి ఉంటాయి; చెట్లన్నీ విరబూసి ఉంటాయి; కొన్ని రకాల పంటలు కోతకు సిద్ధంగా ఉంటాయి; చలికాలమూ ఇంకా మొదలవదు... అలా ప్రకృతి యావత్తు సజీవంగా కనిపిస్తుంది. ‘బతుకమ్మ’ను తల్చుకునేందుకు ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది!
బతుకమ్మ వేడుక వెనుక చాలా కథలే వినిపిస్తాయి. భూస్వాముల అకృత్యాలకు బలైపోయిన ఒక బాలికను నిండు నూరేళ్లు ‘బతుకమ్మా’ అని దీవించిన సందర్భమే ఇదని చెబుతారు. ధర్మాంగుడే రాజుకి నూరుగురు యోధులు జన్మించి మరణించగా, కట్టకడకు పుట్టిన బిడ్డకు ‘బతుకమ్మ’ అన్న పేరు పెట్టారని మరో గాథ ఉంది. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అనీ, ఆమెని వివాహం చేసుకునేందుకు ఆ విష్ణుమూర్తి చక్రాంకుడనే అవతారం ధరించాడనీ అంటారు. మరో కథ ప్రకారం బతుకమ్మ ఏడుగురు అన్నదమ్ముల ముద్దులచెల్లి. తన వదినల సూటిపోటి మాటలకి కలత చెంది ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయిన తర్వాత ఆమె ఓ అందమైన తామరపూవుగా జన్మించింది.
బతుకమ్మ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని కథలు ఇవీ. అసలు బతుకే ఒక దేవతగా ఆరాధించే సంప్రదాయమే బతుకమ్మ అని భావించేవారూ లేకపోలేదు. కథ ఏదైనా, కారణం ఏమున్నా శతాబ్దాల తరబడి ఈ పండుగను చేసుకుంటున్నారన్నది మాత్రం నిర్వివాదం. పాలనాపరంగా ఆటుపోట్లను ఎదుర్కొంటూ, కరువుకాటకాలను భరిస్తూ వచ్చిన తెలంగాణ జనజీవనానికి బతుకమ్మ ఓ ఉపశమనం.
విగ్రహాన్ని అర్చించే పూలే, బతుకమ్మలో విగ్రహంగా మారిపోవడం ఓ విశేషం. తంగేడు పూలతో పాటుగా బంతి, చామంతి, గన్నేరు, గునుగు వంటి పూలని వరుసలుగా పేరుస్తూ ఈ బతుకమ్మను రూపొందిస్తారు. ఇలా పేర్చిన పూల మీద పసుపుతో చేసిన గౌరీదేవిని పెడతారు. అలా రూపొందిన బతుకమ్మలని కూడలిలో ఉంచి, ఆడవారంతా ఆడుతూ పాడుతూ సాయంవేళని గడుపుతారు. ఆటపాటలు ముగిసిన తర్వాత బతుకమ్మని నీటిలో విడిచి, తాము తెచ్చుకున్న ప్రసాదాల్ని పరస్పరం పంచుకుంటారు.
బతుకమ్మలో ఒకో రోజుకీ ఒకో ప్రత్యేకత ఉంది. దాని ప్రకారం ఎంగిలిపూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ... అంటూ తొమ్మిది రకాల పేర్లతో పిలుస్తారు. చివరి రోజు దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో అన్నంతో చేసిన రకరకాల సద్దులను బతుకమ్మకు నివేదిస్తారు. ఆ రోజు జరిగే నిమజ్జనంతో బతుకమ్మతో ఈ పండుగ ముగుస్తుంది.
బతుకమ్మని రూపొందించేందుకు ఖర్చు కానీ, బతుకమ్మ కోసం ఖరీదైన ప్రసాదాలు చేయడం కానీ, బతుకమ్మను పూజించేందుకు విధివిధానాలు కానీ లేవుకదా! కంటి ముందు కనిపించే పూలే విగ్రహం, ఇంటింటా కనిపించే ఆహారమే నైవేద్యం, ఆటపాటలే ఆచారాలు. నవరాత్రులలో అమ్మవారికి కలశం పెట్టి పూజించినట్లే... ప్రకృతి అనే దేవతకి పూల కలశాన్ని పెట్టి, మనసు పరవశించేలా ఆడిపాడటమే ఈ బతుకమ్మలోని అంతరార్థంగా కనిపిస్తుంది.
- నిర్జర.