ప్రదోష వ్రతం.. పూజలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

జ్యేష్ఠ మాసంలోని శని ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జ్యేష్ఠ మాసంలో ప్రదోష వ్రతం జూన్ 27వ తేదీన వచ్చింది. . ఈ రోజున శివునితో పాటు పార్వతీ దేవిని కూడా పూజిస్తారు. ప్రదోష కాలంలో మనఃపూర్వకంగా ఉపవాసం ఉండి, శివుడిని పూజించడం ద్వారా జీవితంలోని ఆటంకాలు క్రమంగా తొలగిపోయి, సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. 2026వ సంవత్సరంలో, జూన్ మాసంలోని రెండవ ప్రదోష వ్రతం జూన్ 27వ తేదీ, శనివారం నాడు వస్తోంది, అందుకే దీనిని శని ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు చేసే ముందు, కొన్ని ముఖ్యమైన నియమాలు , జాగ్రత్తలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా ప్రదోష పూజలో చేయకూడని తప్పులేంటో తెలుసుకుంటే..
శని ప్రదోష సమయం..
ప్రతి నెలా శుక్ల పక్షం , కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఈ నెలలో, త్రయోదశి తిథి జూన్ 27వ తేదీ ఉదయం 10:22 గంటలకు ప్రారంభమై, జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12:43 గంటలకు ముగుస్తుంది. ప్రదోష కాలం ప్రకారం, ఈ వ్రతాన్ని జూన్ 27వ తేదీన పాటిస్తారు. పూజకు శుభ సమయం సాయంత్రం 7:04 నుండి రాత్రి 9:06 వరకు.
శని ప్రదోష పూజా విధానం..
శని ప్రదోష వ్రతానికి సంబంధించిన ఆచారం చాలా సరళమైనది , సులభమైనది. ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించాలి. ఆ తర్వాత, ఉపవాసం ఉంటానని సంకల్పం తీసుకోవాలి. ఇంటిలోని పూజా మందిరంలో శివుని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించి, దీపం , అగరబత్తి వెలిగించండి. అనంతరం, భక్తిశ్రద్ధలతో శివలింగాన్ని పూజించాలి.
శివలింగానికి సమర్పించాల్సినవి..
పూజ సమయంలో మొదట శివలింగానికి స్వచ్ఛమైన నీటితో , గంగాజలంతో అభిషేకం చేయాలి. దీని తరువాత, పంచామృతం సమర్పించాలి. శివునికి బిల్వపత్రం, ఉమ్మెత్త కాయలు, జిల్లేడు పువ్వులు, తెల్ల చందనం సమర్పించాలి. చివరగా, దీపం , అగరబత్తి వెలిగించి "ఓం నమః శివాయ" మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తిశ్రద్ధలతో పైవన్నీ సమర్పిస్తే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంకా చెరకు రసం, తేనె , వీలైతే పచ్చి ఆవు పాలతో కూడా అభిషేకం చేయవచ్చు. పూజలో ఉపయోగించే అన్ని పదార్థాలు స్వచ్ఛమైనవిగా , తాజాగా ఉండేలా చూసుకోవాలి.
ప్రదోష పూజలో ఇవి గుర్తుంచుకోవాలి..
శివలింగానికి తులసి ఆకులను సమర్పించకూడదు. బిల్వపత్రం ఎల్లప్పుడూ తాజాగా , శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
పూజ సమయంలో కోపం తెచ్చుకోవడం లేదా దూషణలు చేయడం మానుకోవాలి. ప్రదోష కాలంలో పూజను తొందరగా, హడావిడిగా చేయకూడదు, పూర్తి మనసుతో చేయాలి.
ప్రదోష వ్రతం రోజున తామసిక ఆహారం, మద్యం , మాంసాహారానికి దూరంగా ఉండాలి.
*రూపశ్రీ.



