ఇవాళే అపర ఏకాదశి! ఇలా చేస్తే విశేష ఫలితం 

 

ఏకాదశి హైందవ సంప్రదాయంలోని ఓ విశిష్టమైన తిథి. కాలం ఎంత మారినా… అప్పటి పరిస్థితులను బట్టి అందరూ జీవితంలో పరుగులు పెట్టక తప్పదు. ఇలాంటి ఒత్తిడి మధ్య… పక్షానికి ఒక రోజు పూర్తిగా దైవధ్యానానికి కేటాయించే సందర్భంగా ఏకాదశి మారుతుంది. అంతేకాదు! ప్రతి పదిహేను రోజులకు ఓసారి ఉపవాసం ఉండటం మంచిదంటూ వైద్యులు చెబుతూ ఉంటారు. అలా చూసుకుంటే, ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేసే విధానం. ఇక ఈ రోజు జాగరణతో రాత్రంతా మేలుకుని భగవన్నమా స్మరణలో మునిగితేలడం మరో విశేషం! ఇలా జపం, ఉపవాసం, జాగరణలతో సాగే అద్భుతమైన తిథి ఇది! 

ప్రతి పదిహేను రోజులకు ఓసారి వచ్చే ఏకాదశి తిథికి మరింత ప్రత్యేకతను కల్పిస్తూ… ఏడాది పొడవునా ఉండే ఒకో ఏకాదశికీ ఒకో పేరు పెట్టారు పెద్దలు. అలా వైశాఖ బహుళ ఏకాదశిని ‘అపర ఏకాదశి’ అని పిలుస్తారు. ఈ రోజును కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ‘భద్రకాళి జయంతి’గా జరుపుతారు. దక్షయజ్ఞ సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక, అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు, తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్టసంహారం చేసే ఈ భద్రకాళి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తలపించినా… భక్తులకు మాత్రం శాంతమూర్తే! ఆ తల్లి ఈ రోజునే అవతరించిందని ఓ నమ్మకం. అందుకే ఈ రోజు భద్రకాళి పూజ జరుగుతుంది. 

ఒడిషాలో జలకృద ఏకాదశి పేరిట జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక మిగతా చోట్ల అపర ఏకాదశి పేరుతో విష్ణుమూర్తి ఆరాధన జరుగుతుంది. అపర అంటే చాలా అర్థాలే వినిపిస్తాయి. వేదాంతంలో పరం అంటే ఆధ్యాత్మికం అనీ, అపర అంటే లౌకికమైన అని అర్థం. ఈ అపర ఏకాదశితో సాంసారిక కష్టాలు కూడా నెరవేరిపోతాయని ఈ అర్థానికి సూచన కావచ్చు. 

అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని కూడా అర్థం వస్తుంది. అపర ఏకాదశి రోజు భగవదారాధనలో మునిగితే… మన మనసుని కమ్ముకుని ఉన్న మాయ కూడా తొలగిపోతుందనే సూచనేమో! అపర ఏకాదశి గురించి సాక్షాత్తు విష్ణుమూర్తి, ధర్మరాజుతో చెప్పిన మాటలే పై అర్థాలకు బలం చేకూరుస్తాయి. ‘అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే… గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటి చీల్చిపారేసినట్టుగా మన పాపాలన్నీ నశించిపోతాయని’ చెబుతారు. 

ఇతర ఏకాదశి రోజుల్లాగానే అపర ఏకాదశి నాడు కూడా దశమి నాటి సాయంకాలం నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజు తలార స్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి ఆ రోజంతా ఉపవాసాన్ని ఆచరించాలి. వండిన పదార్థాలను, బియ్యంతో చేసిన ఆహారాన్ని త్యజించాలి. రాత్రి వేళ జాగరణ ఉంది, ద్వాదశ ఘడియల్లో పాలు తాగి ఉపవాసాన్ని విరమించాలి. ఈ ప్రక్రియ అంతా కుదరకపోయినా, ఏకాదశి ఉన్న రోజు మాత్రం పాలు, పండ్లతో గడుపుతూ ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. 

- మణి

 


More Others