అక్షయ తృతీయ నాడు ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు

 

అక్షయ తృతీయను శుభసూచకంగా భావించడానికి చాలా కారణాలే ఉన్నాయి. బలరాములు, పరశురాములు జన్మించిన రోజు ఇది. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి నేడు. శ్రీకృష్ణుడు కుచేలునికి సంపదలనూ, ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో చీరలనూ, అరణ్యవాసంలో పాండవులకు అక్షయపాత్రనూ అనుగ్రహించిన రోజు. శివుని జటాజూటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం. మహాభారత ఇతిహాసాన్ని రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెబుతారు. ఒకటా రెండా… చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు కనిపిస్తాయి.

అక్షయ తృతీయ రోజు ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో, ఈ రోజు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. చలికాలం అంతా మూసి ఉంచిన గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్‌ క్షేత్రాలను అక్షయ తృతీయ తిథికి చేరువలోనే తెరుస్తారు. పూరీ రథనిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంతకీ ఈ అక్షయ తృతీయ రోజున మనం ఏం చేయాలో చూద్దాం!

అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం ఉంటుందని చెబుతారు. ఈ రోజున విష్ణుమూర్తిని బియ్యంతో ఆరాధిస్తే విశేషమైన పుణ్యం లభిస్తుంది. లక్ష్మీదేవి ఈ రోజే కుబేరునికి సంపదలు అనుగ్రహించిందనే సంప్రదాయం కూడా ఉంది. అందుకని వ్యాపారస్తులు, ఆర్థిక కష్టాలలో ఉన్నవారు ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అభివృద్ధి కనిపిస్తుంది. ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించిన కనకధారాస్తోత్రం, శ్రీసూక్తం, మహాలక్ష్మీ అష్టకం వంటివి చదివితే ఆమె అనుగ్రహం తప్పక కలుగుతుంది.

మత్స్య పురాణం, నారద పురాణాలు ఈ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ… అందుకు సంబంధించిన అనేక కథలను పేర్కొన్నాయి. ఈ రోజున అర్హులైనవారికి స్వయం పాకం- అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యం, కందిపప్పు, కూరలు, చింతపండు, నెయ్యి, మిరపకాయలు, పెరుగు వంటివి అందించడం మంచిది. అలాగే వస్త్రదానం, నీటితో ఉన్న కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం. అదీఇదీ అని కాదు… ఈ రోజు మన స్తోమతను బట్టి, ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే!

అక్షయ తృతీయ పితృదేవతలను ఆరాధించుకునే రోజు కూడా. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా… ఈ రోజు వారిని స్మరించుకోవడం వల్ల వారిని శాంతింపచేసుకోవచ్చు. పితృదేవతల పేరున దానం చేయడం ఇందుకో మార్గం. అలాగే అన్నం, నెయ్యి, పప్పు కలిపిన ముద్దలను ఎండుకొబ్బరిలో ఉంచి ఆహుతి చేయడం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెబుతారు.

గృహ నిర్మాణం, వివాహం చేసుకోవడం లాంటి శుభకార్యాలకు కూడా ఈ రోజు అనువైనది. ధ్యానం, ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయనాడు భగవంతుని ఆరాధించుకునేందుకు, పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు, దానం చేసేందుకు, ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్క పనికీ అసాధారణమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం!

- మణి

 


More Akshaya Tritiya