• Prev
  • Next
  • నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

    Listen Audio File :

    నేనూ - ఇంపోర్టెడ్ కెమేరా

     

     

    - మల్లిక్

    పార్ట్ -1



    నేను ఏర్ పోర్టుకి బయలుదేరా. ఏర్ పోర్టుకి ఎందుకు బయలుదేరానంటే - వారం క్రితం అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న నా స్నేహితుడు చిదంబరం ఉత్తరం రాశాడు. తనతోబాటే పనిచేస్తున్న  విలియమ్ జేమ్స్ అనే అతను ఇండియా చూడడానికి వస్తున్నాడనీ, రెండు మూడు రోజులు బాంబేలో గడిపి హైదరాబాదు వస్తున్నాడనీ. నన్ను ఏర్ పోర్టుకెళ్ళి ఆయనని రిసీవ్ చేసుకుని ఊరంతా చూపెట్టమనీ. ఉత్తరంతో బాటు నేను గుర్తు పట్టడానికిగాను జేమ్స్ ఫోటో జతపరిచి పంపించాడు చిదంబరం.

        ఆ రోజే జేమ్స్ హైదరాబాదు వచ్చే రోజు.

        నేను ఏర్ పోర్టుకి వెళ్ళి జేమ్స్ ని రిసీవ్ చేసుకుని నన్ను అతనికి పరిచయం చేసుకున్నాను.

        "ఏదేని మంచి హోటల్ కి తీస్కెళ్ళండి" అన్నాడు జేమ్స్ బుజాలు ఎగరేస్తూ.

        మీరు హోటల్లో ఉండడానికి వీల్లేదు. నా అతిథ్యం స్వీకరించండి... నా గదికిపోదాం పదండి" అన్నాను.
    జేమ్స్ - "వద్దు, బుష్షిబాబుగారూ! మీకు షాల ఇబ్బంది " అంటూ అడ్డు చెప్పబోయాడు గానీ, నేను అతనిని నా గదిలో ఉండడానికి ఒప్పించాను.

        ఇద్దరం ఆటో ఎక్కి ఇంటి ముందు దిగాం. జేమ్స్ తను ఇస్తానన్నా వినకుండా మీటరు నేనే పే చేశాను.

        "ఏంది సార్... మీటర్ మీద రెండ్రూపాయల్ ఎక్స్ ట్రా ఇవ్వాలి" అన్నాడు ఆటోవాడు.

        నువ్వు ముందు చెప్పలేదుగా?" అన్నాను నేను.

        "అట్లెట్లియ్యర్?.. వారెవ్వా... ఏర్ పోర్టు, రైలు స్టేషన్లలో ఆటో ఎక్కితే ఎక్స్ ట్రా ఇవ్వాలని తెలీదూ?..."

        "నేనివ్వ" అన్నాను మొండిగా.

        "గిట్ల చేస్తే జబర్దస్తీగా గుంజు కోవాల్సుంటుంది" అన్నాడు వాడు నా కాలరు పట్టుకుంటూ.

        "ఏంషీ గొడవ.. హేయ్ వడులు వడులు" అంటూ మా ఇద్దర్నీ విడదీశాడు జేమ్స్.

        "వాడు మాట్లాడేది కూడా తెలుగే.హైదరాబాదులో తెలుగు అలానే మాట్లాడతారు. వాడికి మీటరుమీద రెండు రూపాయలు ఎక్స్ ట్రా కావాలట" చెప్పాను.

        జేమ్స్ నా వంక ఆశ్చర్యంగానూ, తరువాత ఆటోవాడి వంక మెచ్చికోలుగానూ చూశాడు.

        "శానా మంచివాడు. శానా మంచివాడు" అని జేబులోంచి చటుక్కున పది రూపాయలు తీసి ఆటోవాడికి ఇచ్చాడు.

                                         

           ఆటోవాడు జేమ్స్ కి సలాం చేసి వెళ్ళిపోయాడు.

        "వాడు శానా మంచివాడు. అందుకే కాలర్ పట్టుకున్నాడు. అదే అమెరికాలో అయితే టాక్సీ వాళ్ళకి టిప్పు ఇవ్వకపోతే షూట్ చేసేస్తార్..." అన్నాడు జేమ్స్ బుజాలు ఎగరేస్తూ.

        నేను రెండు రోజులు ఆఫీసుకు శలవు పెట్టి జేమ్స్ ని హైదరాబాద్ అంతా తిప్పాను. వెళ్ళినచోటల్లా జేమ్స్ తన కెమెరాతో ఫోటోలు తీశాడు.  
     
        "నేను రేపు ఆండ్ర వెళ్ళి అక్కడి విలేజీలు తిరుగుతాను. అక్కడి సీనరీ బాగుంటుందని షిద్దంబర్రం షెప్పాడు... వారం తరువాత హైదరాబాద్ వచ్చి బాంబే పోయి అక్కడినుండి అమెరికా పోతాను" అన్నాడు జేమ్స్.
                          
         నేను అలాగే అన్నట్టు తల ఊపాను.

        జేమ్స్ నా ఫోటో ఒకటి తీస్తానన్నాడు. నేను చేతులు కట్టుకుని కెమెరాకి ఫోజు ఇచ్చాను.
     "రెడీ... కాష్ట నవ్వండి"అన్నాడు కెమెరా లెన్సుని అడ్జస్టు చేస్తూ.
                                                                

         నేను నవ్వాను.

        "ఇదే మా అమెరికాలో అయితే షూట్ చేస్తారు. అటుల శబ్దం వచ్చులాగ నవ్వకండి" అన్నాడు.

        నేను మూతి బిగించేశాను.

        రెండు మూడు యాంగిల్స్ లో నా పోటోలు తీశాడు జేమ్స్. కెమెరాలోంచి రీలు తీసి "అమెరికాలో ప్రింట్ చేసి పంపిష్టాన్ అన్నాడు.

        "మీ కెమెరా చాల బాగుంది" అన్నాను అతనితో.
    "మీకు నష్షిందా... అయితే తీస్కోండి" అన్నాడు జేమ్స్ కెమెరాని ముందుకు చాపుతూ.

        "అబ్బే ఎందుకండీ... ఆంధ్రాలో సీసరీలని తియ్యడానికి మీకు కావాలిగా" అన్నాను నేను.

        "నా దగ్గర ఇంకోటి ఉంది... ఇది మీరు తీస్కోండి."

        "అబ్బే... ఎందుకు లెండి." నేను మెలికలు తిరిగాను.

        "అదే మా అమెరికాలో అయితే ప్రెజెంటేషను ఇస్తే వద్దని అంటే షూట్ సేస్తారు.తీస్కోండి" అన్నాడు కరకుగా.

        నేను ఎంతో సంబరపడిపోతూ కెమెరాని అందుకున్నాను.

        మర్నాడు జేమ్స్ ఆంధ్రవైపు వూళ్ళు తిరగడానికి వెళ్ళిపోయాడు.

  • Prev
  • Next