ప్రేమించండి ప్లీజ్


    ఆ సమయంలో తన అన్నయ్యను చూసి అతను మొదట  ఆశ్చర్యపోయినా ఆ తరువాత వూరట చెందాడు.
    దెబ్బతిన్న కాళ్ళు మెలిపెట్టేస్తున్నాయి. బాధ శరీరాన్ని కోస్తోంది.
    చుట్టూ జనం మూగారు.
    "హాస్పిటల్ కు తీసుకుపోండి"
    "నడవగలడా?"
    "చాలా ఎత్తు నుంచి పడ్డాడు"
    "కాళ్ళు బాగా దెబ్బతిన్నాయి"
    "వెంటనే డాక్టర్ కి చూపించాలి"
    ఇప్పుడు తను చేయాల్సిన పనేమిటో స్ఫురించింది ఆంజనేయులకు నాగరాజుని హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి.
    "నాగరాజూ! లేవరా డాక్టర్ దగ్గరికి వెళదాం" అని తమ్ముడి కన్నీళ్ళను తుడుస్తూ లేవడానికి ప్రయత్నించాడు ఆంజనేయులు.
    కాని అతను లేవలేకపోయాడు. కాళ్ళమీద శరీరం భారంపడగానే బాధ మెదడునుతాకుతోంది.
    "లేవలేను అన్నయ్యా" నిస్సహాయంగా అన్నాడు.
    పట్టుకుని లేవదీయమన్నట్టు చుట్టూ వున్న జనాన్ని వేడుకోలుగా చూశాడు ఆంజనేయులు.
    "పట్టండి" అని ఇద్దరు ముగ్గురు అనడంతో నలుగురు యువకులు ముందుకు వచ్చి నాగరాజును లేవబోయారు.
    బాధనంతా పళ్ళమధ్య బిగించి తనను పట్టుకున్న వాళ్ళపై భారాన్ని మోపి లేస్తున్నాడు నాగరాజు.
    సరిగ్గా అదే సమయానికి థియేటర్ లో మూడో బెల్ మోగింది. మరో క్షణంలో సినిమా ప్రారంభమౌతుందని తెలియడంతో నాగరాజు పట్టుకున్న నలుగురు యువకులు తమ చేతులను వదిలేశారు.
    మరో ఆలోచనకు తావివ్వకుండా వాళ్ళు థియేటర్ లోకి పరుగెత్తారు.
    తనను పట్టుకున్న యువకులు అర్ధాంతరంగా వదిలి వేయడంతో దబ్బున కిందపడ్డాడు నాగరాజు కాళ్ళు నేలకు కొట్టుకోవడంతో గుండెల్లో బాధ కలుక్కుమంది.
    నిస్సహాయంగా, ఆందోళనతో చుట్టూ చూశాడు ఆంజనేయులు.
    కానీ అప్పటికే ఆ ప్రాంతమంతా ఖాళీ అయిపోయింది. తమ అభిమాన హీరో సినిమా టైటిల్స్ కూడా మిస్ చేయడానికి అంగీకరించి జనం థియేటర్ లోకి దూరిపోయారు.
    కాళ్ళు తెగిన పక్షిలా గిలగిల్లాడుతున్న తమ్ముడ్ని పైకి లేపడానికి ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆంజనేయులు.
    
                                                                *    *    *


    ఉదయం పది గంటలైంది.
    ఆ రోజు ఆదివారం కావటంతో ఆంజనేయులు కూడా ఇంటి దగ్గరే వున్నాడు.
    అప్పటికి అందరూ సద్దులు తాగేశారు.
    మధ్యాహ్నం వంట ప్రయత్నంలో వున్నారు ఆడవాళ్ళు. ఆంజనేయులు కొట్టాములో మంచం వేసుకుని పుస్తకం చదువుకుంటున్నాడు. నాగరాజు చిరంజీవి బొమ్మలను ముందేసుకుని చూస్తున్నారు.
    ప్రభావతి వంటింట్లో గోడకు ఆనుకుని అప్పుడప్పుడు పొయ్యి మీదున్న కూరను కలబెడుతోంది. శారద ఓ మూల కూర్చుని చినిగిపోయిన పావడను కుడుతోంది.
    కాంతమ్మ చాటలో బియ్యం వేసుకుని రాళ్ళు ఏరుతోంది.
    ఆ ఇంట్లో అంతమందివున్నా ఎవరూ మాట్లాడుకోవడం లేదు. వాళ్ళందరూ కలిసి మాట్లాడుకోవడానికి చర్చించుకోవడానికి కామన్ టాపిక్ ఏమీ వుండదు. ఎవరికి వాళ్ళు ఆలోచనల్లో వుంటారు. అందుకే ఆ ఇంట్లో స్మశాన నిశ్శబ్దం రాజ్యమేలుతుంటుంది.
    ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేయడానికన్నట్టు ఎదురింటి ఇంద్రాణి ఆ ఇంట్లో ప్రవేశించింది.
    ఆమె లోపలకు అడుగుపెట్టగానే "ఏం కాంతమ్మ వదినా! ఏం చేస్తున్నావ్?" అంటూ పలకరించింది.
    కాంతమ్మ వచ్చింది ఎవరా అని ఓసారి తలపైకెత్తి "బియ్యంలో రాళ్ళు ఏరుతున్నాను. ఏ పాటు తప్పినా నా పాటు తప్పదు కదా" అంది.
    ఇంద్రాణి పరుగుపరుగున వచ్చి ఆమె పక్కనే కూర్చుని ఈ విషయం విన్నావా?" అని అడిగింది.
    ప్రభావతి, శారద కూడా ఆమె ఏం చెబుతుందా అని ఉత్సుకతతో వింటున్నారు.
    ఎ విషయం?" కాంతమ్మ ముఖంలో ఆశ్చర్యాన్ని నింపుకుని అడిగింది.
    "అదే! మన పెద్ద నాయకుడు కూతురు మంజుల లేదూ! అదే ఎత్తుపళ్ళు  వేసుకుని, ఎలుక జడతో టింగురంగా అంటూ తిరుగుతుంటుంది-- అదీ ఎదురింటి రాఘవులతో లేచిపోయింది" అని చెప్పి ఇది విడ్డూరం కాదా అన్నట్టు నోటిని మూడు వంకర్లు తిప్పింది.
    ఇంద్రాణిది చాలా విచిత్రమైన మనస్తత్వం. మొదట్లో ఆమె బాగానే వుండేది. కానీ భర్త చనిపోయాక ఆమెకు రకరకాల దుర్లక్షణాలు అలవడ్డాయి.
    "ఆమెకు ఇప్పుడు ముఫ్ఫైఏళ్ళు ఇరవై రెండేళ్ళకు పెళ్ళయ్యింది. మూడేళ్ళు తిరక్కుండానే మొగుడు చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరైపోయింది. జీవితంలోకి మరో మగాడ్ని ఆహ్వానించడానికి ఆమె భయం. వంశగౌరవం మంట కలుస్తుందనో, నలుగురికి విషయం తెలిసి నగుబాట్లు అవుతుందనో ఖచ్చితమైన కారణం తెలియదు గానీ ఆమె ఆ సాహసం చేయలేక పోయింది. దాంతో ఆమె మనస్తత్వంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
    నిజానికి పెద్ద నాయుడి కూతురు మంజుల చాలా అందంగా వుంటుంది. పెద్దవళ్ళు, ఎత్తుపళ్ళు లేవు. ఆమెది ఎలుక జడ అంతకంటే కాదు. బారెడు జడ నిగనిగలాడుతుంటుంది. కానీ ఆమె అందవికారి అని ఇంద్రాణి ఇప్పుడు చెబుతోంది. ఆమె ఎదురింటి అబ్బాయితో లేచిపోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది.
    తనకు ఏదైతే లేదో దాన్ని ఆమె పొందడంతో ఆమె మీద ఇంద్రాణికి తెలియని కసి. దానివల్లే ఆమెకు ఎత్తుపళ్ళు, ఎలుక జడ తగిలించింది.
    ఇదే కాదు ఇలాంటి చాలా దుర్లక్షణాలు ఆమెకు అలవడ్డాయి. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది. ఇతరుల గురించి చాలా చెడ్డగా కామెంట్లు చేస్తుంది. ఎవరూ సుఖపడరనీ, కష్టాల్లో మునిగి తేలుతారని భావిస్తుంది. స్త్రీ, పురుష సంబంధాలకు ఎనలేని ఇంపార్టెన్స్ ఇచ్చి, విన్నదానికి చిలవల, పలవలు అల్లి చెబుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు మంజుల విషయమై వూరంతా తిరుగుతూ కాంతమ్మ ఇంటికి వచ్చింది.
    "రాఘవులంటే - టైలర్ గా పనిచేస్తున్నాడే అతనేనా?" కాంతమ్మ సందేహంగా అడిగింది.
    "వాడే నాడు ఎందుకూ కొరగాడు. రూపాయి నెత్తినబెట్టి బజార్లో నిలబడితే అర్ధరూపాయి క్కూడా ఎవరూ కొనుక్కోరు ఏం వుంది వాడికి" ఒక చదువా? సంధ్యా? ఆస్తులా పాస్తులా! ఉద్యోగమా సద్యోగమా? ఏం లేవు మనిషి కూడా మంచివాడు. ఆడపిల్ల వీధిలో పోతుంటే మిడిగుడ్లు వేసుకుని చూస్తుంటాడు. నన్నూ ట్రై చేశాడు. కానీ నేను నిప్పులాంటి ఆడదాన్ని కనుక వాడికి లొంగలేదు. ఆ ఎత్తుపళ్ళది అమాయకురాలు గనుక, ఒళ్ళు కొవ్వెక్కింది గనుక, బజారు ఆడది గనుక వాడితో లేచి పోయింది" తన అక్కసంతా వెళ్ళగక్కింది ఇంద్రాణి.