TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
ఆంజనేయులు ముందున్న బ్యాచ్ లో చిరంజీవి అసోసియేషన్లు ఆంద్రదేశంలో ఎన్ని వున్నాయో, అవి చేస్తున్న పనులేమిటో అన్న టాపిక్ మీద ఘాటుగా చర్చించుకుంటున్నాయి.
మరో పది నిమిషాలకు కలకలం సద్దుమణిగినట్టు నిశ్శబ్దం పేరుకుంది.
ఏమైందోనన్న కంగారులో ఆంజనేయులు అందరూ చూస్తున్న వంక చూశాడు.
ముగ్గురు వ్యక్తులు థియేటర్ ముందు భాగానవున్న సన్ సైడ్ మీదకు ఎక్కుతున్నారు. కింద మరో ముగ్గురున్నారు.
"వాళ్ళు ఏం చేస్తున్నారక్కడ?" ఆంజనేయులు మెల్లగా ప్రశ్నించాడు తన ముందు నిలుచున్న కుర్రాడిని.
అమెరికాను కనిపెట్టింది. ఎవరో చెప్పలేని స్టూడెంట్ ను హిస్టరీ టీచర్ చూసినట్టు చూశాడు ఆకుర్రాడు.
"చిరంజీవి కటౌట్ ను తగిలిస్తున్నారు" ఆంజనేయులు అజ్ఞానాన్ని మొదటిసారి కాబట్టి మన్నిస్తున్నట్టు జవాబు చెప్పాడు. అప్పటికే తాను కటౌట్ ను ఏర్పాటు చేసే సుందర దృశ్యాన్ని మిస్ అయినట్టు వెంటనే తల తిప్పుకున్నాడు.
ఆంజనేయులు కూడా అటే చూపు సారించాడు.
ఇప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. తదేకంగా అటే చూస్తున్నారు.
భక్తులు ధ్వజస్తంభాన్ని కూడా అంతతదేకంగా చూడరు.
కిందనున్న ముగ్గురు వ్యక్తులు లోపల్నుంచి ఓ అట్ట తెచ్చారు. అది కటౌట్ లో ఒక భాగమని అర్ధమైంది ఆంజనేయులుకు.
దాన్ని కిందనున్న వాళ్ళు అందిస్తే సన్ షేడ్ మీదున్న వాళ్ళు అందుకున్నారు. అది ఏ భాగమో చూసి అక్కడ నిలబెట్టారు. కటౌట్ ను కట్టడానికి అంతకుముందే వెదురులతో సపోర్ట్ కట్టివున్నారు.
ఇప్పుడు కటౌట్ లోని ఆ భాగం జనానికి కనిపిస్తోంది.
"రేయ్! అదిగోరా గురువుగారి కాలు" గుంపులోని ఎవరో గట్టిగా అరిచారు.
ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా చప్పట్లతో మార్మోగిపోయింది. అందరి కళ్ళలోనూ ఆనందభాష్పాలు ఆ ఉదయంపూట ముత్యాల్లా వున్నాయి. సాక్షాత్తూ చిరంజీవిని చూసినట్టు అక్కడున్న కుర్రకారంతా కటౌట్ లోని ఓ భాగాన్ని చూసి పులకరించిపోతున్నారు.
దానిని వెదురులకు కట్టివేశాక మరో భాగాన్ని అందుకున్నారు థియేటర్ వర్కర్లు.
అందరూ దానివంక దీక్షగా చూస్తున్నారు. అది ఏభాగమో కనిపెట్టడానికి తెగ ఉత్సాహపడి పోతున్నారు. కన్ను మూస్తే ఆ సుందరదృశ్యం మాయమౌతుందన్న దిగులుతో బొమ్మల్లా బిగుసుకుపోయారు.
'అది.....అది.....గురువుగారి చేయి"
"మొదట ఆ భాగం కనిపెట్టిన యువకుడు గొంతు పగిలిపోయేలా అరిచాడు.
మళ్ళీ చప్పట్లు.....ఈలలు.....కేకలు.
"అదిగో నడుము....."
"అదిగో తొడ....."
ఇలాంటి అరుపులతో, కేకలతో ఆ ప్రాంతం భూకంపం వచ్చినట్టు కదిలిపోయింది.
చివరగా తల అమర్చాడు.
అక్కడ తల బెట్టడం, ఇక్కడ కొన్ని వందల కొబ్బరికాయలు పగలడం ఒకేసారి జరిగాయి.
కటౌట్ కి దిష్టి తగులుతుందని దూరంనుంచే కొబ్బరికాయను రెండుమూడుసార్లు చుట్టూ తిప్పి కొడుతున్నారు. కొబ్బరి చిప్పలు పగిలి మూలకొకటి పడుతున్నాయి.
మరికొందరు కర్పూరం వెలిగించి హారతులు పడుతున్నారు.
అక్కడ తరువాత జరుగుతున్నట్టుంది ఆంజనేయులకు. ఇలాంటి అనుభవం కొత్త అతనికి. అందుకే ప్రతి చర్యనూ విస్మయంతో చూస్తున్నాడు.
జనంలో మళ్ళీ కలకలం.
"కారు వచ్చేస్తోంది.
"ఫిల్మ్ బాక్స్ వచ్చేసింది"
కొందరైతే ఆనందం పట్టలేక డ్యాన్సులు ప్రారంభించారు. మరి కొందరైతే పైనున్న చొక్కాలు విప్పి తమ సంతోషాన్ని ప్రకటించారు.
కారు అక్కడకు రాగానే ఫిల్మ్ బాక్స్ ను చూడాలని అందరూ విరగబడ్డారు. కారు వెళ్ళడానికి కూడా వీలు కావడంలేదు.
పరిస్థితి చేయి దాటిపోయిందని అనిపించగానే దూరంగావున్న ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్ళు లాఠీలను ఝుళిపించారు.
కానీ జనం చెదరడంలేదు. వీపు మీద లాఠీ దెబ్బ పడుతున్నా పట్టించుకోకుండా అయ్యో' అని బాధతో మూల్గకుండా కారులోకి తొంగి తొంగి చూస్తున్నారు.
ఓ కుర్రాడికైతే తలచిట్లి రక్తం కారుతోంది. అతను చాలా క్యాజువల్ గా రక్తాన్ని ఎడమచేతితో తుడుచుకుంటున్నాడే తప్ప అక్కడి నుంచి కదలడంలేదు.
ఎట్టకేలకు కారు అతి బలవంతంమీద థియేటర్ లోకి వెళ్ళింది. అది వెళ్ళగానే గేటు మూసుకుంది.
దాన్ని నెట్టివేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు. వాళ్ళచేతుల్లో పెద్ద పెద్ద పూలదండలున్నాయి.
"ఫాన్స్ మేము కటౌట్ కి పూలదండలు వేయాలి" మేనేజర్ కి వినపడాలని గేటు దగ్గరున్న వ్యక్తితో గట్టిగా అంటున్నారు.
"అవును ఇవి వేసి షో చూడాలి"
"కావాలంటే మేనేజర్ ని పిలువ్"
"ఫ్యాన్స్ ని ఫాలో చేయకపోతే చిరంజీవికి చెబుతాం ఆయన సినిమాలు మీ థియేటర్ కు రాకుండా చేస్తాం.
గేటు దగ్గర గలాటా జరుగుతూ వుందని తెలియడంతో మేనేజర్ బయటకు వచ్చాడు. గేటు తీయమని గేటుమాన్ కు సంజ్ఞ చేశాడు.
మరో క్షణంలో గేట్లు తెరుచుకున్నాయి.
ఒక్కసారిగా జనం లోపలికి చొరబడ్డారు. ముందున్న స్థలమంతా అభిమానులతో నిండిపోయింది. వెనుకున్న వాళ్ళు ముందుకెళ్ళాలని నెట్టుతున్నారు. ముందున్న వాళ్ళు వెనుకనున్న వాళ్ళు పైన పడకుండా మోచేతులతో కుమ్ముతున్నారు.
అక్కడ చిన్న సైజు యుద్ధం జరుగుతున్నట్టుంది.
సన్ షేడ్ మీద నుంచి కటౌట్ కి చిన్న నిచ్చెన వేశారు.
మొదట ఓ అభిమాని నిచ్చెన ఎక్కాడు. అతను టౌన్ చిరంజీవి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆయన చివరకంటా ఎక్కి సన్ షేడ్ మీద నిలబడి వున్న యువకుల నుంచి పెద్ద పూలమాల అందుకున్నాడు కేవలం గులాబీలతోనే కట్టిన ఆ దండను బలవంతంగా లేపి కటౌట్ మెడలో వేశాడు.
చూస్తున్న వాళ్ళంతా ఎగ్జయిట్ మెంట్ తో థ్రిల్ తో కదిలిపోయారు. పూనకం వచ్చిన వాళ్ళలా వూగిపోయారు. చప్పట్లు ఈలలతో మరొక్కసారి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
అతను నిచ్చెన దిగగానే మరొకరు ఎక్కారు. పూలమాల వేశారు. చిత్తూరు నుంచి పుత్తూరు వరకు వున్న అభిమాన సంఘాల అధ్యక్షులు పూలమాలలు వేశారు.
ఇప్పుడు కటౌట్ అంతా పూలమాలలో నిండిపోయింది. అయినా అక్కడ వున్న జనం తగ్గడం లేదు. పూలమాలలు వేయాల్సిన అభిమానసంఘాలు ఇంకా వున్నాయి.
కొందరయితే సన్ షేడ్ మీదకు తమ పూలమాలలు విసిరారు. ఇంకొందరు ఓపిగ్గా నిచ్చెన ఎక్కి మెడలో వేస్తున్నారు.
షడెన్ గా ఆంజనేయులు ఓ క్షణంపాటు జర్క్ యిచ్చి సర్దుకున్నాడు.
నిచ్చెన ఎక్కుతున్నది తన తమ్ముడు నాగరాజులా అనిపించింది. పరిశీలించి చూశాడు సందేహం లేదు నాగరాజే.
అంతలో సినిమా స్టార్టు కాబోతున్నట్టు బెల్ మోగింది.
ఒక్కసారిగా బయటున్న జనంలోపలికి వురికారు.
బెల్ వినపడగానే సినిమా స్టార్టు అయిపోయిందేమోనన్న కంగారులో నిచ్చెన దిగుతున్న నాగరాజుకు పట్టు తప్పింది.
అక్కడే చూస్తున్న ఆంజనేయులు "తమ్ముడు" అని అరిచాడు.
దాదాపు ముఫ్ఫై అడుగుల ఎత్తునుంచి నాగరాజు కిందపడి "అమ్మా" అని మూలిగాడు.
ఆ సమయంలో తను తన ఫావరెట్ హీరో పేరు తలుచుకోకుండా "అమ్మా" అనే ఎందుకన్నాడో అతను ఓ క్షణం ఆలోచించగలిగివుంటే ఆ ఉదయం ఇంతమంది అక్కడ చేరివుండేవారు కాదు.
"ఎవరో కిందపడ్డారు"
"అతనా మన ఫ్యానే పపానాయుడు పేట పేరు నాగరాజు"
"కళ్ళు విరిగిపోయాయి"
"ఇక లేవలేడు"
"ఆంజనేయులు నిర్దారణమైపోయింది. కటౌట్ కి పూలమాల వేయబోతూ పడిపోయింది నాగరాజే అని తెలియడంతో ఒక్కసారిగా బలాన్నంతా కాళ్ళల్లోకి తెచ్చుకుని ముందుకు వురికాడు.
జనాన్ని కంట్రోల్ చేయడానికి థియేటర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. లాఠీల్లాంటి కర్రలను చేతబట్టుకుని బాదుతున్నారు. అయినా ఎవరూ లెక్కచేయటం లేదు. లోపలికి వెళ్ళడానికి తోసుకుంటున్నారు.
మరో నిముషానికి అక్కడికి చేరుకున్నాడు ఆంజనేయులు.
రెండు కాళ్ళూ పట్టుకుని చతికిలపడి ఏడుస్తున్న నాగరాజును చూస్తూనే ఆంజనేయులుకి దుఃఖం ఆగలేదు. భోరున ఏడుస్తూ వెళ్ళి తమ్ముడ్ని కౌగిలించుకున్నాడు.
|