ప్రేమించండి ప్లీజ్


    థియేటర్ ముందున్న టీ స్టాల్ కుర్రాళ్ళ తో కేరింతలు కొడుతోంది.
    వాళ్ళను చూస్తూనే ఆంజనేయులు కి దిగులేసింది. రాత్రంతా నిద్రమేల్కొని తెల్లవారుజామున మూడున్నరకు వేసే షోకోసం పడిగాపులు కాస్తున్న ఆ చిట్టి తమ్ముళ్ళను చూస్తే బాధ కలిగింది. వాళ్ళల్లో తన తమ్ముడు కూడా వున్నాడన్న చేదునిజం అతన్ని కలచివేసింది.
    టీ స్టాల్ ముందున్న చెట్టుకింద నిలబడ్డాడు.
    అక్కడి నుంచి చూస్తే థియేటర్ సీరియల్ బల్బులతో కదలలేని పూలతెప్పలా వుంది. రంగు రంగుల పోస్టర్లు సీతాకోకచిలుకలను అంటించినట్టు కనిపిస్తున్నాయి. టీ స్టాల్ స్పీకర్ లోంచి వినిపిస్తున్న పాటలు ఆ ఉద్యమానికి సంగీత సౌరభాన్ని అద్దుతున్నాయి.
    ఆంజనేయులుకు పక్కనే మరో గ్రూప్ సీరియస్ గా మాట్లాడుకుంటోంది. వాళ్ళ మాటలు వినపడాలని అతను వాళ్ళకు దగ్గరగా జరిగాడు.
    "ఇందులో ఫైట్స్ అద్భుతంగా పిక్చరైజ్ చేశారట. క్లైమాక్స్ లో ముఫ్ఫై మందితో మన గురువు పోట్లాడుతాడట" ఒక యువకుడు చెప్పాడు.
    "ముఫ్ఫై మందితోనా?"
    అవును ఫైట్ చాలా బాగా వచ్చిందట. నిర్మాత పిఏ మొన్న హిల్స్ కు వచ్చాడు. సమత డిస్ట్రిబ్యూటర్స్ ఆఫీసులో వుంటే మేం వెళ్ళి కలిశాం అప్పుడు చెప్పాడు.
    అంటే వూర్లోకి ఎవరెవరు  వస్తారో ఈ అభిమానులు సేకరిస్తారన్నమాట. తమ హీరో కి సంబంధించిన వాళ్ళు వస్తే కలిసి మాట్లాడతారని అర్ధమైంది ఆంజనేయులకు. సినిమా రిలీజ్ కాగానే కలెక్షన్ వివరాలు-- సినిమా టాక్. ఏ థియేటర్లో ఎన్ని రోజులు ఆడిందో ఏ సెట్ వేయడానికి ఎంత ఖర్చయిందో ఈ వివరాలన్నీ తెలుసుకోవడం, తెలిసిన సమాచారాన్నంతా సోదర అభిమాన సంఘాలకు ఉత్తరాల ద్వారా తెలియపరచడం, మొత్తం దీనివెనుక గొప్ప నెట్ వర్క్ వుందనిపించింది అతనికి.
    అంతలో చిన్న కలకలం బయల్దేరింది. థియేటర్ ముందు అక్కడక్కడా గుంపులు గుంపులుగా నిలబడ్డ వారందరూ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళడానికి తోసుకోవడం మొదలుపెట్టారు.
    ఆంజనేయులు కూడా తన ప్రమేయం లేకుండానే ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. వెనకనున్న జనం గట్టిగా తోస్తున్నారు అతనిని. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని వున్నా వీలుపడడంలేదు చుట్టూ జనం.
    "ఏమైంది?" ఎవరో అడుగుతున్నారు ముందున్నవాళ్ళను.
    "కాపు వీధి మెగాస్టార్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మేనేజర్ తో గొడవ పడ్డారట" ముందున్న ఓ వ్యక్తి చెప్పాడు.
    "ఎందుకూ?"
    "సినిమా బాగున్నా లేకపోయినా ఏభైరోజులు ఆడించాలని శ్రీనివాసరావు మేనేజర్ తో చెప్పాడట. దాంతో మేనేజర్ కు కోపం వచ్చి అతన్ని కొట్టాడట. స్పృహ తప్పిందట"
    వింటున్న ఆంజనేయులు షాక్ తిన్నాడు. ఏమిటి వేలం వెర్రి? సినిమా బాగున్నా లేకపోయినా ఏభైరోజులు ఆడించాలని అడగడమేమిటి? దానికి దెబ్బలు తిని స్పృహ కోల్పోడమేమిటి?
    వినయ్ విశ్లేషణ కరక్టేననిపిస్తోంది ఇదంతా చూస్తూంటే? హీరోలో తమను ఐడెంటిపై చేసుకోవడంవల్లే ఇంత పిచ్చి అభిమానం కలుగుతుంది. బజార్లో తను చేయలేని పనులను తెరమీద హీరో చేసి చూపిస్తుంటే తామే వాటిని చేస్తున్నట్టు భ్రమపడతారు. అందుకే హీరో వర్క్ షిప్ ప్రారంభమవుతుంది.
    అన్ వాంటెడ్ చిల్డ్రన్ లోనూ, ఇల్లు వాకిలీలేని పేద యువకుల్లోనూ ఈ ఫాంటసీ మరీ ఎక్కువగా వుంటుంది. సంఘంలో తృణీకరించబడే వీళ్ళు పిచ్చిగా ఆరాధించటం మొదలుపెడతారు. తమ హీరో తప్ప జీవితం లేదన్నంత విపరీతమయిన స్థాయికి వెళ్ళిపోతారు. తమకంటూ స్వంత జీవితం లేని వాళ్ళే వీళ్ళంతా అట్టడగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు డబ్బున్న ఇంట్లో సుఖసంతోషాలు లేని పిల్లలు, సంఘంలో ఏ గుర్తింపు లేనివాళ్ళు తల్లిదండ్రి ప్రేమ కరువైన వాళ్ళు వీళ్ళే ఇంత పిచ్చిలో బతికేది. ఆ హీరో తప్ప మరో ప్రపంచం వుండదు వాళ్ళకు. అందుకే వరుసగా తమ హీరో సినిమాలు చూస్తారు. పోలీసుల దగ్గర లాఠీ దెబ్బలు తింటారు. మద్రాసు వెళ్ళి హీరో ఇల్లు చూసి వస్తారు. పిచ్చిపిచ్చిగా వెర్రివెర్రిగా ప్రవర్తిస్తారు. వీళ్ళే సినిమా మహారాజ పోషకులు అవుతారు.
    ఈ సత్యం నిర్మాతలకూ తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడూ మాస్ సినిమా తీయాలంటారు. తప్ప క్లాస్ సినిమా తీయాలనుకోరు. సినిమా బాగా వుందంటే క్లాసు ప్రేక్షకుడు ఓసారి చూస్తాడు. కానీ వీళ్ళు అలా కాదే. కాస్తంత మసాలా వుంటే ఒక్కొక్కడు పది పదిహీనుసార్లు చూస్తారు. ఏభైరోజులు ఆడించమని మేనేజర్లను బతిమలాడుతారు.
    తన తమ్ముడు నాగరాజులాంటివాళ్ళే వీళ్ళంతా వేషభాషల్లోనే తెలిసిపోతోంది ఆ విషయం. దైన్యం చూపులు, మురికి బట్టలు ఈజీగా పట్టించి వేస్తాయి వాళ్ళను.
    నాగరాజు కోసం ఆంజనేయులు పరిశీలించి చూశాడు. అంత జనంలో వాడు కనిపించడం దుర్భరమని అనుకున్నాడు.
    కాసేపటికి సద్దుమణిగింది.
    థియేటర్ మేనేజర్ క్షమాపణ చెప్పడంతో గొడవ ముగిసింది.
    తిరిగి జనం వెనక్కి రావడం మొదలుపెట్టారు. వాళ్ళతోపాటు ఆంజనేయులూ మొదట నిలుచున్న దగ్గరికి వచ్చి ఆగాడు.
    టీ స్టాల్ పాటలు కవ్విస్తున్నాయి.
    మరోసారి టీ తాగాలనిపించింది. ఆంజనేయులకు టీ ఇమ్మని సైగ చేశాడు.
    మరో అయిదు  నిమిషాలకు టీ వచ్చింది.
    జనాన్ని చూస్తూ సిప్ చేస్తున్నాడు.
    ఆంజనేయుల్ని చూసి లీడర్ లాగా కనిపిస్తున్న ఓ యువకుడు 'టిక్కెట్టు వుందా" అని ప్రశ్నించాడు.
    లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు అతను.
    "అయితే ఇంద" అని ఓ టిక్కెట్ చించి ఇస్తూ "ఈ షోకే టికెట్టు పది టికెట్లు మిగిలిపోయాయి కౌంటర్ లో. ఈ విషయం తెలిస్తే మిగిలిన హీరోల సంఘాలు దుష్ప్రచారం ప్రారంభిస్తాయి. అభిమానుల షోకే టికెట్లు మిగిలిపోయాయన్న అపఖ్యాతిని భరించగలమా? అందుకే ఆ పదిరెట్లు కొనేశాం. ఇప్పుడు థియేటర్ హౌస్ ఫుల్. కాసేపట్లో బోర్డు వేలాడుతుంది" అని వివరించాడు ఆ యువకుడు.
    అనాలోచితంగా టికెట్టు అందుకున్నాడు ఆంజనేయులు.
    "డబ్బులు ఎవరిచ్చారు?" ఎవరో అడిగారు.
    ఇదిగో ఈ మధు" అని లీడర్ మరో యువకుడి  వైపు చూపించాడు. తమ హీరోకోసం త్యాగం చేసిన అతను గర్వంగా ఫీలయ్యాడు.
    "సమయానికి అంత డబ్బు వుండటం మంచిదైంది"
    "ఆ డబ్బు మానాన్న నిన్ననే ఏం ఓ పంపాడు పరీక్ష ఫీజు డబ్బు ఇలా ఉపయోగపడింది. పరీక్షకు హాజరుకాకపోయినా ఫరవాలేదు. మన గురువుగారి సినిమా ఫస్టు షో హౌస్ ఫుల్ కాకపోవడమా? ఈ మార్చిలో పరీక్ష కాకుంటే సెప్టెంబరులో కూర్చుందాం" మధు మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు.
    ఆంజనేయులు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆమాటలు వింటుంటే తమ హీరో సినిమాకు హౌస్ ఫుల్ బోర్డు వేలాడాలని ఓ స్టూడెంట్ పరీక్షనే వదులుకుంటున్నాడు. మరో వ్యక్తి మేనేజర్ తో గొడవపడి దెబ్బలు తిని స్పృహ తప్పాడు.
    అంతలో థియేటర్ ఆఫీసు గది నుంచి ఓవ్యక్తి బయటకు వచ్చాడు. అతనిచేతిలో హౌస్ ఫుల్ బోర్డు.
    అతన్ని చూస్తూనే యువకులంతా ఆనందంతో కేరింతలుకొట్టారు. తమ హర్షాన్ని తెలియజేస్తూ చప్పట్లు చరిచారు. ఒకరుకొకరు విజయగర్వంతో చూసుకున్నారు.
    "బోర్డు పడిందిరా" మధు పట్టలేని సంతోషంతో అన్నాడు.
    "మన గురువుగారి ఫస్ట్ షో ఆ బోర్డు పడకుండా వుండడమా" మరో యువకుడు ఎంతో విశ్వాసంతో అన్నాడు. పరాయి వ్యక్తి మీదున్న విశ్వాసం తన మీద తనకే వుంటే అంతనెంతో గొప్ప వాడై వుండేవాడు. కానీ ఇతరులను ఆరాధించడంలోనే స్వంత వ్యక్తిత్వాలను పోగొట్టుకుంటున్నారు. వీళ్ళకు  భరోసా కలిగించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించి వ్యక్తిత్వాలను వికసింపజేసేందుకు ఎవరికుంది తీరిక. నాగరాజునే తీసుకొందాం. అతన్ని ఎవరూ పట్టించుకోరు. తనింట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బుంది. అందరికి కామన్ గా ఆత్మనూన్యతాభావముంది. ఇంకెక్కడి ఆత్మవిశ్వాసం? విరక్తిగా నవ్వుకొన్నాడు ఆంజనేయులు.
    "ఫిల్మ్ బాక్స్ వున్న కారు అదిగో" ఎవరో గుంపులోంచి అరిచాడు అందరూ రోడ్డువైపు చూపులను నిలబెట్టారు.
    తెల్లటి అంబాసిడర్ కారు మెల్లగా వస్తోంది.
    దేవుడ్ని వూరేగించే అంబారీని భక్తి ప్రవత్తులతో చూసినట్టు అందరూ దానివంక చూశారు.
    "తిరుమలకు వెళ్ళి బాక్స్ ను స్వామి కాళ్ళదగ్గర పెట్టితీసుకొస్తారట. అంతవరకూ షో లేదంట" మధు తనకు తెలిసిన సమాచారం చెప్పాడు.
    క్షణాల్లో ఈ విషయం జనంలో పాకిపోయింది.
    "ఎంతసేపట్లో తిరిగి వస్తుంది?"
    "ఇంకో గంట అట"
    "అయినా జనం అక్కడి నుంచి కదలలేదు.