ఆహా నగర్ కాలనీ 14 వ భాగం

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

14 వ భాగం

ఆ జేబు దొంగకు భయమేసింది. ఖచ్చితంగా తన ఒంట్లోని ఎముకల్లో సున్నం మిగలకుండా చేసారని....నిజం ఒప్పుకుంటే పోలా అనుకున్నాడు. లోపలికి రాగానే తన నడుముకు ఉన్న బెల్ట్ తీసాడు షేర్ ఖాన్. తన పని అయిపోయిందని కళ్ళు మూసుకున్నాడు.

"అన్నం తిన్నారా సార్?" ఇన్స్ స్పెక్టర్ ఏం అడిగాడో అతడికి అర్ధం కాలేదు.

"మీరు భోంచేసారా?" అడిగాడు షేర్ ఖాన్.

తల అడ్డంగా ఊపాడు. వెంటనే షేర్ ఖాన్ బిర్యానీ ప్యాకెట్లు తెమ్మని ఓ కానిస్టేబుల్ కు డబ్బులు ఇచ్చాడు. కొంపతీసి ఫుడ్ పెట్టి కొడతాడా? అన్న డౌట్ వచ్చింది ఆ జేబు దొంగకు. చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని, ఎగ్ బిర్యాని వచ్చాయి.

"చూడు బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు. ముందు భోజనం చేయ్. తరువాత నిజం చెప్పుదువు గాని" అన్నాడు.

జేబుదొంగ గబగబా ప్యాకెట్ ఖాళీ చేసాడు. అయినా ఆకలి తీరినట్టు అనిపించలేదు. మరొకటి కూడా తిను. మటన్ బిర్యాని బాగా ఉంటుంది. చెప్పాడు ఇన్ స్పెక్టర్ షేర్ ఖాన్.

"మరి మీరు తినరా?"

"ముందు మీరు తినండి" అన్నాడు. పది నిమిషాల్లో ఆ ఎగ్ బిర్యాని తినేసాడు. వెంటనే ఓ కానిస్టేబుల్ బిస్లరీ వాటర్ తెచ్చి ఇచ్చాడు. యమ సంతోషంగా తాగేసాడు. కడుపు నిండినట్టు అనిపించింది."మరోటి" అంటూ అంటూ మరో బిర్యానీ ప్యాకెట్ సింహాచలం ముందుకు జరిపాడు ఇన్ స్పెక్టర్.

"అమ్మో.....వద్దు సార్. కడుపు నిండిపోయింది. దయతలచి నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతాను" అన్నాడు.

"తప్పు సింహాచలం గారూ....ఇవన్నీ మీరు తినవలసిందే....తిని నిజం చెప్పాల్సిందే ప్లీజ్.....కానియండి."

"గుండె గుభేలుమంది" ఇవ్వన్నా?

"అవును....మీ కోసమే తెప్పించాను"

"అదేం కుదరదమ్మా...నువ్వు తినకపోతే, మేమంతా ఈ పూట పస్తే.....తినాలమ్మా" బుంగమూతి పెట్టి అన్నాడు ఇన్ స్పెక్టర్.

"నేను తినలేను సార్. మొత్తుకున్నాడు సింహాచలం. "తినరా" అంటూ నేలమీద పెట్టిన బెల్ట్ మీద చెయి వేశాడు. తినకపోతే ఆ బెల్టుతో తన చెమ్డాలు తీసేసాడేమోనన్న డౌటు కలిగింది. గబగబ మూడో ప్యాకెట్ ఖాళీ చేసాడు. వెంటనే ఓ బిస్లరీ వాటర్ బాటిల్ అందించాడు. హెడ్ కానిస్టేబుల్ సూరిబాబు.

అతి కష్టమ్మీద సగం బాటల్ నీళ్ళు తాగగానే మరో బిర్యాని ప్యాకెట్ అతని ముందుకు తోసాడు. ముద్దా గొంతు లోపలికి దిగడం కష్టమైపోతోంది. నాలుగు....అయిదు....అయిదున్నర.... ప్లీజ్.....కానీయండి సింహచలం గారూ. ఆరు....ఆరుంపావు, వీడియో కెమెరాలో అదంతా రికార్డువుతుంది.

రైటర్ రామేశం అ సన్నివేశాన్ని వీడియో తీస్తున్నాడు. ఆరున్నర....ఏడవ ప్యాకెట్ లోని బిర్యాని ముద్ద నోట్లో పెట్టుకోగానే తన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోతాయోనన్న సేన్షేషన్ కలిగింది సింహాచలానికి. అంతే...గట్టిగా ఓ అరుపు అరిచి, ఆ బిర్యాని ప్యాకెట్లను చిందరవందరగా చేసి, తన చొక్కా చింపుకొని, జుట్టు పీక్కొని, ఓ రెండు నిమిషాలు కిందపడి గిలగిల కొట్టుకుని గట్టిగా ఓ అరుపు అరిచేసాడు.

"నేను జేబు కత్తిరించేసాను. నేను దొంగను. పాపిని నన్ను కోర్టుకు తీసుకెళ్ళండి" అని స్టీరియో ఫోనిక్ సౌండ్ లో అరిచేశాడు.