Pelli Chupulu

పెళ్లి చూపులు

మల్లిక్

 

పరమేశ్వర్రావు ఆవేళ చాలా హుషారుగా ఉన్నాడు. కారణం ఆ వేళ అతనికి పెళ్లి చూపులు. పెళ్లి చూపులకి అతనితో పాటు అతని తండ్రి విశ్వనాధం, తల్లి మంగతాయారు, చెల్లెలు సుబ్బలక్ష్మి తరలి వెళ్లారు.

" ఓ పని చేద్దాంరా అబ్బాయ్... ఇక్కడి నుండి గాంధీ బొమ్మదాకా బస్సులో వెళ్లి అక్కడినుండి టాక్సీలో వెళ్దాం " అన్నాడు విశ్వనాధం.

" అక్కడి నుండి టాక్సీ ఎందుకు నాన్నా! అక్కడికి పెళ్ళికూతురి ఇల్లు పడి అడుగులేగా ?" అన్నాడు పరమేశ్వర్రావు.

" నీ మొహం నీ తెలివి తేటలు ఇలా ఉన్నాయి కాబట్టే నీకు పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రావడం లేదు. పెళ్లి వాళ్ళ యింటి ముందు టాక్సీలో దిగితే దర్జాగా ఉంటుందిరా అబ్బాయ్ " అని విశ్వనాథం విసుక్కుంటూ అన్నాడు.

వాళ్ళూ ముగ్గురు బావుంది బావుంది అంటూ తలలు ఆడించారు. వాళ్ళు అనుకున్న ప్రకారమే గాంధి బొమ్మదాకా వెళ్లి అక్కడి నుండి టాక్సీవాడితో మాట్లాడుకున్నారు.

" సీతమ్మ పురానికి వస్తావా ?"

" వస్తానండి " అన్నాడు ఆ టాక్సీ వాడు హుషారుగా.

" సీతమ్మ పురానికి రమ్మంటున్నామంటే మేం ఊరు తెలియని వెర్రి మేలాలమని అనుకుని సంబరపడి టాక్సీ ఎక్కించుకుని ఊరంతా తిప్పి బాగా డబ్బు లాగుదామని అనుకుంటున్నావేమో....సీతమ్మపురం ఈ పక్క సందులోనే ఉందని మాకు తెలుసు...చెప్పు ఏం తీసుకుంటావు ?" అన్నాడు విశ్వనాథం తనతెలివి తేటలకి తానే మురిసిపోతూ.

టాక్సీవాడు పడి క్షణాల పాటు తెల్లబోయి పదిరూపాయలు అడిగాడు. అలా వీల్లేదని వాదించి చివరికి ఐదు రూపాయలకు బేరం కుదిరించుకుని ఆ నలుగురు టాక్సీ ఎక్కారు. ఆ టాక్సీ వెళ్లి అమ్మాయి ఇంటి ముందు ఆగింది.

అమ్మాయి తల్లిదండ్రులు వెంకుమాంబ, సాంబమూర్తి, అన్నయ్య రాజారావు బిలబిల మంటూ టాక్సీ చుట్టూ చేరి వీళ్ళని సాదరంగా లోపలికి తీసుకెళ్ళారు.

అందరూ కూర్చున్న తరువాత " టిఫిన్లు పట్రామ్మా " అంటూ లోపలికి చూస్తూ సాంబమూర్తి కేకే వేశాడు. పరమేశ్వర్రావు తండ్రి వంక చూసి కళ్ళు ఎగరేసి "హిహిహి " అన్నాడు.

విశ్వనాథం ఊర్కో అన్నట్టు కోపంగా చూసి తొడమీద గిల్లాడు. లోపలి నుండి పసుపు పచ్చ పట్టుచీరలో మెరిసిపోతూ ఉన్న ఆమె స్వీట్లు, ఖారా ప్లేట్స్ ఉన్న ట్రే తో గదిలోని వచ్చింది.

పరమేశ్వర్రావు సోఫాలో బాగా ముందుకు జరిగి మెడ ముందుకు చాపి కళ్ళు పెద్దవి చేసి, ఆమెను చూస్తూ " బానే వుంది బానే వుంది " అన్నాడు గొణుగుతున్నట్లు.

విశ్వనాథం మళ్ళీ గిల్లాడు. " అబ్బాయి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయ్ కాని ఈ అమ్మాయి పెళ్లి కూతురు కాదు... మా కోడలు రాజేశ్వరి " అని అంది వెంకమాంబ.

పరమేశ్వరరావు " హుస్ " అని నిట్టూరుస్తూ సోఫాలో వెనక్కి జారగిలబడ్డాడు.

రాజేశ్వరి స్వీట్స్ ఉన్న పళ్ళాలు టీపాయ్ మీద పెట్టింది. " టిఫిన్ చెయ్యండి బావగారూ " అన్నాడు సాంబమూర్తి.

పరమేశ్వరరావు మళ్ళీ సిఫాలో బాగా ముందుకు వంగి స్వీట్స్ వంక చూసి " అమ్మో...జాంగ్రీలు ?" అన్నాడు సంతోషంగా.

విశ్వనాథం, కొడుకు తొడమీద గట్టిగా గిల్లాడు.

" ఎందుకు అలా ఊరికే గిల్లుతావు? అన్నీ తిననులే... నేనేం మొహం వాచిపోయినోడిలా కనిపిస్తున్నానా ?" అని తండ్రి మీద విసురుకున్నాడు పరమేశ్వరరావు.

" పరువాలేదు నాయనా ! అన్నీ నీ కోసమే తెప్పించాం...అన్నీ తిను " అంది వెంకమాంబ.

" తిను బావా " అన్నాడు సాంబమూర్తి.

" తినండి అన్నయ్యగారూ " అంది రాజేశ్వరి.

పరమేశ్వరరావు గర్వంగా తండ్రి వంక చూస్తూ జాంగ్రీ కొరికాడు. ఇంతలో లోపలి నుండి ఐదేళ్ళ పిల్లాడు ఒకడురయ్యిన పరుగెత్తుకు వచ్చి పరమేశ్వరరావు ముందు నిలుచున్నాడు. వాడు తననే చూస్తూ నిలబడం పరమేశ్వరరావు గమనించాడు.

" కుర్రాడు ముద్దోస్తున్నాడు కదు నాన్న ? నీ పేరేంటి బాబు ?" అన్నాడు పరమేశ్వరావు.

కుర్రాడు నిర్లక్ష్యంగా చూశాడు.

" ఇప్పటికి ఎన్ని జాంగ్రీలు తిన్నావు " అని అన్నాడు పరమేశ్వరరావు వంక చూస్తూ.

" అబ్బే...ఇదొక్కటే బాబు " అన్నాడు పరమేశ్వరరావు ఆ కుర్రాడు ప్లేట్లోని జాంగ్రీలని ఎక్కడ తీసుకుంటాడో అని కంగారు పడుతూ, ఆ ప్లేటుని వెనక్కి దాచేసుకున్నాడు.

" అలా దాచేసుకోకు.. నాకేం అక్కర్లేదులే. నేను కూడా నా పెళ్లి చూపులకి వేరే వాళ్ళింటికి వెళ్లి స్వీట్లన్నీ బాగా తింటాను " అన్నాడు ఆ అబ్బాయి.

" వీడు మా చిన్నబ్బాయి బావగారూ..పేరు రవి " అన్నాడు సాంబమూర్తి తన చిన్న కొడుకు మాటలకు మురిసిపోతూ.

" మీ అబ్బాయి చాలా చలాకీయే " అంది మంగతాయారు వెంకమాంబతో.

" ఇందాకటి నుండీ అన్నీ నువ్వే మింగుతున్నావు..నాకోటి పెట్రా అన్నయ్యా " అంది సుబ్బలక్ష్మి పరవేశ్వర్రావుతో.

" అందరిలాగే స్వీట్లన్నీ మింగేసి మీరు కూడా మా అక్కయ్య నచ్చలేదని అంటారా ?" అన్నాడు రవి.

పరమేశ్వరరావుకు జాంగ్రీ ముక్క గొంతుకి అడ్డుపడి దగ్గోచ్చింది. " చూశారా గుంటడికి అయిదేళ్ళు కూడా ఉన్నయోలేవో గాని ఎన్ని తెలివితేటలు ఉన్నాయో " అని వెంకుమాంబ మురిసిపోయింది.

టిఫిన్లు తినడం పూర్తయింది. పరమేశ్వరరావు వెళ్ళకు అంటిన జాంగ్రీ పాకాన్ని నాకుతుంటే విశ్వనాథం అది చూసి గట్టిగా తోడమీద గిల్లి " ఇకా చెల్లే వెళ్లి చేయి కడుక్కో " అన్నాడు చెవిలో.

" అమ్మాయిని తీసుకురండి " అన్నాడు సాంబమూర్తి భార్య కోడళ్ళతో.

వెంకుమాంబ, రాజేశ్వరి లోపలికి వెళ్లి పెళ్ళికూతురివి చెరో రెక్కా పుచ్చుకుని లాక్కొచ్చి చాపమీద కూలేశారు. పెళ్ళికూతుర్ని చూడగానే సుబ్బలక్ష్మి ఏడుపు లంకించుకుంది.

" ఏమయిందే " అంటూ కంగారు పడింది మంగతాయారు.

" పెళ్ళికూతురు చూడవే ఎంత లావుగా ఉందో. ఆడపడుచు కదా...నేనెప్పుడైనా సాధిస్తే నన్ను ఒక గుడ్డు గుద్దిందంటే చచ్చురుకుంటాను...వా...." అని మళ్ళీ ఏడిచింది.

" ఊర్కోమ్మా...ఊర్కో.. మా అమ్మాయి అలా కనిపిస్తుంది గానీ దానిది ఒట్టి ఊబవళ్ళు.........నీలా కర్ర శరీరం కాదు..నువ్వే దాన్ని తన్నొచ్చు " అన్నాడు సాంబమూర్తి నచ్చేజేపుతూ.

సుబ్బలక్ష్మి పెళ్లి కూతురు దగ్గరికి వెళ్లి ఆమె జబ్బలు పట్టి నొక్కి చూస్తూ " అవునే అమ్మా...ఒళ్ళు చాలా మెత్తగాఉంది...నేనే తన్నేయగలను " అంది సంతోషంగా ఏడుపు ఆపి. విశ్వనాథం సంతోషంగా తల ఊపాడు సంతృప్తి చెందినట్టు.కానీ మంగతాయారు మాత్రం నిలువు గుడ్లేసుకుని యింతికప్పు వైపు చూడసాగింది.

" చెలేమ్మ గారు ఏదో ఆలోచిస్తున్నారు " అన్నాడు సాంబమూర్తి ప్రశ్నార్థకంగా.

మంగతాయారు తల పంకించి అంది " ఏం లేదు అన్నయ్యా..రేపొద్దున మీ అమ్మాయిని పుట్టింటికి వెళ్లి అదీ తెమ్మని ఇదీ తెమ్మని అంటాం అనుకోండి..అప్పుడు మీ అమ్మాయి తెలేదనుకోండి..మరి మేం మీ అమ్మాయిని తగలబెట్టాలి కదా ? మీ అమ్మాయి శరీరం చూస్తే ఇంతుంది. కనీసం రెండు టన్నుల కిరసనాయిలు కావాలి కదా " అని.

వెంకుమాంబ చాల కంగారు పడిపోయింది.

" ఆ విషయం గురించి మీరేం దిగులు పడకండి వదినా.........దీని అక్కని వాళ్ళ అత్తగారు మీ పుట్టింటి నుండి ఓ ప్రిజ్జు పట్రమ్మని అడిగాడు. అది మమ్ముల్ని అడిగితే మే వీల్లేదని అన్నాం. అప్పుడు దాన్ని వాళ్ళ అత్తగారు ఒక కిరసనాయిలు తిన్నుతోనే తగలేసింది.దానిది దీనంత శరీరమే, కాబట్టి మీరు కావాలని అనుకున్నప్పుడు దీన్ని ఒక్క టిన్ను కిరసనాయిలుతోనే తగలెయ్య వచ్చు. రెండో టిన్ను ఎందుకు దండుగా " అని అంది.

మంగతాయారు తృప్తిగా తల వూపింది.

" నీ పేరు ఏంటమ్మా " అని అడిగాడు విశ్వనాథం.

" సుభద్ర "

" ఏరా...అమ్మాయిని చూస్తున్నావా ! " సోఫా అంచుమీద కూర్చుని ముందుకు వంగి సుభాద్రని చూస్తున్న పరమేశ్వరరావు " ఓ........" అంటూ బోర్లా ముందుకు పడిపోయాడు.

రాజారావు చటుక్కుని ముందుకు వచ్చి పరమేశ్వరరావుని లేవనెత్తాడు.

" బాగా స్వీట్స్ ఎక్కువ తిన్నానేమో...మత్తెక్కి పోయి..గీరగా ఉండి తలతిరిగి పడ్డా.......హిహిహి..............." అన్నాడు పరమేశ్వరరావు.

విశ్వనాథం, కొడుకు తోడమీద గట్టిగా గిల్లాడు.

" అమ్మాయిని కాస్త ఈ చివరి నుండి ఆ చివరిదాకా...ఆ చివరి నుండి ఈ చివరిదాకా " అంది మంగతాయారు.

" మా అమ్మాయికి పుట్టిన పది నెలలకే నడక వచ్చింది. అయినా మీ తృప్తి కోసం నడిపిస్తాం ! అమ్మాయి కాస్త నడవ్వే " అంది వెంకుమాంబ. సుభద్ర లేచి అటూఇటూ నడిచి కూర్చుంది. " కుట్లు అల్లికలూ వచ్చా ?" అంది మంగతాయారు.

రాజారావు సర్రున పరమేశ్వర్రావు దగ్గరికి వెళ్లి అతని చొక్కా జేబు పట్టుకుని లాగి చింపేశాడు.

" ఇదేంటి బావగారు అన్యాయం ?" అన్నాడు పరమేశ్వరరావు.

రాజారావు చిద్విలాసంగా నవ్వి " బావగారి జేబు కుట్టేయ్యమ్మా చెల్లెమ్మా " అన్నాడు.

సుభద్ర సూది దారం పుచ్చుకుని పరమేశ్వరరావు చొక్కా జేబు చకచకా కుట్టేసింది. అలా కుడుతున్నప్పుడు చాతీకి రెండుసార్లు సూది గుచ్చుకుని " కెవ్వు కెవ్వు మని అన్నాడు పరమేశ్వరరావు.

తరువాత " వదినకి పాటలు ఏమైనా వచ్చా ?" అని అడిగింది సుబ్బలక్ష్మి.

సుభద్ర పాట ఎత్తుకుంది.

" పుట్టింటి వాళ్ళు తరిమేశారు...కట్టుకున్నవాడు వదిలేశాడు " అని పాట పూర్తయింది.

అందరూ సంతృప్తిగా తలలూగించారు. తరువాత కట్నాకానుకల గురించి మాటలు జరిగాయ్. కట్నాల దగ్గర కుదరక ఆ సంబంధం తప్పిపోయింది. కొన్ని రోజులు గడిచాయి. పరమేశ్వరరావు చెల్లెలు సుబ్బలక్ష్మి కోసం ఒక సంబంధం చూశారు. వాళ్ళు సుబ్బలక్ష్మిని చూడటానికి ఆరోజు సాయంత్రమే వస్తామని అన్నారు.

సాయంత్రం అయింది. సుబ్బలక్ష్మి చూడటానికి అబ్బాయి, అతని తల్లితండ్రులు వచ్చారు. వారిని సాదరంగా ఆహ్వానించాడు. విశ్వనాథం, మంగతాయరు, వారితో బాటు ఉన్న సుభద్ర, ఆమె అన్నయ్య రాజారావుల్ని చూసి ఖంగుతిన్నాడు పరమేశ్వరరావు.

" పెళ్ళికొడుక్కి మేం చుట్టాలమవుతాం... అందుకనే కూడా వచ్చాం. ఇప్పుడు మాకు అవకాశం " అన్నాడు రాజారావు కొరకొరా చూస్తూ. వారి చూపుల్లో కక్ష సాధింపు చర్యలు చేసే భావం కనిపించింది పరమేశ్వర్రావుకి.