Political leader

రాజకీయ నాయకుడు

శాగంటి శ్రీహిత

ఒక రాజకీయ నాయకుడు ఒక స్లమ్ ఏరియాకు వెళ్లాడు. అక్కడ పేదలందరినీ పలకరిస్తూ పేదరాసి పెద్దమ్మ దగ్గరికి వచ్చాడు.

ఆ పెద్దమ్మ, తన ఇంటికి వచ్చిన రాజకీయ నాయకుణ్ణి చూసి చాలా సంతోష పడింది.దాంతో వెంటనే టీ చేసి...అక్కడే తాగి పెట్టిన ఎంగిలి కప్పులో పోసింది.

అది గమనించిన రాజకీయ నాయకుడికి...కడుపులోని పేగుల్ని దేవేసినట్టు అయింది.కానీ వాటిని బయట పడనీయకుండా గొంతు దగ్గర అదిమి పట్టుకున్నాడు.

“ తాగండి బాబుగారు...ఎప్పుడు రాని మీరు మొదటిసారిగా మా ఇంట్లో కాలు పెట్టారు.టీ తాగండి బాబుగారూ " అంటూ టీ పోసిన ఎంగిలి కప్పుని అందిస్తూ అతన్ని బలవంతపెట్టింది.

ఆయన చూస్తూ చూస్తూ ఎంగిలి కప్పులో పోసిన టీ తాగలేక, వద్దంటే మిగతా అందరూ ఏమనుకుంటారో అని కక్కలేక...మింగలేక...కాసేపు ఆలోచించి, " అందరూ కుడిచేత్తో కప్పు హేండిల్ పట్టుకుని తాగుతారు కదా!పోనీ కనీసం ఎడం చేత్తో కప్పు హేండిల్ పట్టుకుని తాగితే కొంచెం ఎంగిలైనా తగ్గుతుంది కదా ! " అనుకుని ఎడం చేత్తో కప్పు హేండిల్ పట్టుకుని టీ తాగాడు.

టీ కప్పు క్రింద పెట్టిన వెంటనే " మీకు కూడా నాలాగే ఎడం చేత్తో కప్పు పట్టుకుని తాగే అలవాటుందా బాబుగారూ .” అని అడిగింది పేదరాసి పెద్దమ్మ ఆప్యాయంగా.

“ ఆఁ..” అని నోరుతెరిచాడు ఆ రాజకీయ నాయకుడు.