Evarni Tindam

ఎవర్ని తిందాం ?

అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ లోని మెనూలో ధర ముందు మనిషి ఫోటో, బరువు వుంటాయి. ఎందుకేంటే అది నరమాంస భక్షకుల దేశం.కేన్సర్ సోకిన మనుషులు వాళ్లకి పుచ్చుకాయలతో సమానం. ఎందుకంటే వాళ్ళు నరమాంస భక్షకులు.

అక్కడ కొందరు ఉరి తీయబడ్డ వాళ్లనే తింటారు. ఎందుకంటే నరమాంస భక్షకుల్లో వారు అహింసావాదులు. అక్కడ బేంకుల్లో మనుషుల ఫారాలు తెరవడానికి లోన్స్ ఇస్తారు. ఎందుకంటే అవి నరమాంస భక్షకులు నడిపే బేంక్స్. అక్కడ విస్కీలో సోడా సోడా బదులు రక్తం కలుపుకుని తాగుతారు.

ఎందుకంటే, వాళ్ళు నరమాంస భక్షకులు. అక్కడ బంధుమిత్రులు మరణిస్తే, బయటికి ఏడ్చి, లోపల సంతోషపడతారంతా. ఎందుకంటే వాళ్ళు నరమాంస భక్షకులు. అక్కడ చికెన్,మటన్, ఫిష్, ప్రాన్స్ లని మాత్రమే తినేవారు శాఖాహారుల కింద లెక్క. ఎందుకంటే వాళ్ళు నరమాంస భక్షకులు.

అక్కడి ధనికులు పెళ్ళిళ్ళల్లో అతిధులకు వడ్డించే ఖరీదైనా ఐటమ్ లేడీస్ ఫింగర్స్ ప్రై. ఫింగర్స్ కి అర్థం ఆడవాళ్ళ చేతివేళ్ళని తప్ప బెండకాయాలని కాదు. అక్కడ బీదవాళ్ళు పసి కందులనే తింటారు.

ఎందుకంటే, వాళ్లకి పెద్ద వాళ్ళని కొనుక్కునే డబ్బుండదు. అక్కడ పిటి ఉష, ఆశ్వనిలని అంతా ఇష్టపడతారు. ఎందుకంటే, వాళ్ళు 'ఫాస్ట్ పుడ్స్ ' కాబట్టి. ఆ దేశంలో పుట్టి పెరిగిన సుబ్బారావుతో అతని భార్య చెప్పింది.

“ ఏమండి, రేపటికి అన్నంలోకి కూర లేదు. కూరలు తీసుకురండి"

“ మనం కొత్తగా కొన్న ప్రిజ్ లో ఏవో వుండాలిగా? ” ప్రశ్నించాడు సుబ్బారావు.

“ ఫ్రిజ్ ని మోసుకొచ్చిన ఇద్దరి గురించా మీరు చెప్పేది ? నిన్నటితో వాళ్ళయిపోయారు.”

“ సర్లే. వెళ్ళొస్తాను.”

సుబ్బారావు తన కొడుకుని, తుపాకిని తీసుకుని బయటికి నడిచాడు. ఇద్దరూ తమ ఊరి పొలిమేరల్లో వుండే అడవిలోకి వచ్చారు. ఓ కాలిబాట పక్కన దాక్కున్నారు. కొద్దిసేపటికి ఒకరెవరో స్కూటర్ మీద వస్తూ కనిపించారు.

“ అడుగో నాన్నా. మీల్స్ ఆన్ వీల్స్ " చెప్పాడు కొడుకు సంతోషంగా.

“ స్కూటర్ మీద వెళ్ళే వాడ్ని గురి చూసి చంపటం కష్టం. నడిచే వెళ్ళే వాళ్ళే మనకి దక్కేది" చెప్పాడు సుబ్బారావు కొడుకు ఉత్సాహం చూసి. మరికొద్ది సేపటికి ఓ ముసలాయన కర్రని తాటించుకుంటూ వస్తూ కనిపించాడు.

“ అడుగో నాన్నా.” చెప్పాడు కొడుకు ఉత్సాహంగా తుపాకీ సర్దుకుంటూ.

“ లాభం లేదు. అతని వంటి మీద మాంసం మనకి ఉప్మా క్కూడా సరిపోదు. మోసుకెళ్ళడం దండగ " చెప్పాడు సుబ్బారావు. మరికొద్ది సేపటికి బాగా లావుగా వున్న ఒకతను వస్తూ కనిపించాడు.

“ నాన్నా, మన సందులోని వాళ్ళందరికీ సరిపడేంత మాంసం వుంది వీడికి " చెప్పాడు కొడుకు సంతోషంగా.

“ ఒద్దొద్దు. వాడికున్న కొవ్వుకి మనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇలాంటి వాళ్ళని మనం ఎప్పుడూ తినకూడదు " ఆరోగ్య సూత్రం బోధించాడు సుబ్బారావు.

మరికొద్ది సేపటికి పాతికేళ్ళ వయస్సుగల సౌందర్యరాశి కులుకుతూ రాసాగింది.

“ ఈమె మరీ సన్నమూ కాదు అలా అని లావూ కాదు. ఈమెని తీసుకెళ్దాం నాన్నా" చెప్పాడు కొడుకు తుపాకిని ఆమెకి గురిపెడుతూ.

“ ఒద్దొద్దు... చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తున్నా ఈమెని మనం తినకూడదు " వారించాడు సుబ్బారావు.

“ ఏం ? ఎందుకు తినకూడదు ? ” ప్రశ్నించాడు కొడుకు.

“ ఎందుకంటే ఈమెని ప్రాణాలతో పట్టుకెళ్ళి మీ అమ్మని తిందాం " చెప్పాడు సుబ్బారావు ఆమె సౌందర్యాన్ని కళ్ళతోనే తాగేస్తూ. -

మల్లాది వెంకట కృష్ణమూర్తి