Chakrapani Indraloka Yatra-2

చక్రపాణి ఇంద్రలోక యాత్ర - 2

డా.భానుమతి రామకృష్ణ

రంభ వెళ్ళిపోతుండగా,ఇంద్రుడు మళ్ళీ అడ్డుగా నిలిచి కోపంతో, అవమానంతో కంపించిపోతూ “ నీ నిశ్చయం మారదా? నీ పట్టు విడవ్వా ?” అన్నాడు.

“ విడవలెను...నా ఆశయం నెరవేరాలి.నేను ఒక గొప్పనటిననిపించుకుని అటు భూలోకానికీ, ఇటు ఇంద్రలోకానికీ కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి.రంభ కేవలం నాట్యకత్తే కాదు అనిపించుకోవాలి...అలాంటి పాత్ర యిచ్చారు చక్రపాణిగారు నాకు...” అంది రంభ.

“ ఛీ...దౌర్భాగ్యురాలా!ఆ సన్యాసి పేరు ఎత్తకు నా దగ్గర...” మరింత కోపంగా అన్నాడు ఇంద్రుడు.

“ నారాయణ " అంటూ నారదుడు ప్రవేశించాడు.

“ ఏమిటి ఇంద్రా ?రంభతో ఘర్షణ పడుతున్నట్లున్నావు...ఏమైంది రంభా ?” అడిగాడు నారదుడు.

ఇంద్రుడు కాస్త చల్లబడి " చూడు నారదా!భూలోకం నుండి వచ్చినప్పట్నుంచీ మళ్ళీ వెళతాను భూలోకానికి అంటుంది "చెప్పాడు ఇంద్రుడు.

“ నారాయణ...అందాక వచ్చింది కథ.నేనప్పుడే చెప్పాను గదయ్యా ?ఆ మానవులు అసాధ్యులు.అందులోనూ ఆ సినిమా జీవులు ఆఖండులని...అయితే ఇంతకూ రంభ మళ్ళీ ఎందుకు వెళతానంటుందీ ?” అడిగాడు నారాయణ.

“ ఎందుకా? నా విరోధి చక్రపాణి తీసే చిత్రంలో నటించడానికట...”

“ నారాయణ...నిజమే మరి పాపం సగంలో మనిద్దరం వెళ్లి రంభను తీసుకొచ్చామాయే అయినా మళ్ళీ మళ్ళీ లాభం ఏమిటీ ?రంభకు బదులు ఎవరిచేతనో ఆ పాత్ర వేయించి చిత్రం పూర్తి చేస్తున్నట్లున్నాడే ?”

“ ఆ...నిజంగానా? హతవిధీ!నేనెంతగానో ఆశపడ్డానే!ఎంతో కష్టపడి నటించాలనే మీ వల్ల నా నటనా జీవితం నాందిలోనే యీ విధంగా అయిందే!యిక నేను జీవించి ప్రయోజనం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటాను.నేను జీవించను "అంటూ రంభ వెక్కి వెక్కి ఏడుస్తుంది.

ఇంద్రుడు ఖంగారు పడిపోతూ " నారదా!ఇప్పుదేడిదారి?రంభకు పిచ్చి ఎలా వదుల్తుంది?”అన్నాడు.

“ నీవు పిక్చర్ తీస్తే వదుల్తుంది "

“ పిక్చరా!...అంటే ?”

“ అంటే ఏముంది ఇంద్రా! ఆ మానవులు చలన చిత్రాలు ఎలా తీస్తున్నారో అలాగే ఇంద్రలోకంలో నువ్వూ ఒక చిత్రశాల కట్టించు "

“ చిత్రశాల నేను కట్టించడమా!ఏమిటీ నారదా మీరనేది? అది మనకెలా సాధ్యం?”

“ ఆ వివరాలన్నీ చక్రపాణిని కనుక్కుంటే సరి "

“ నేనంటే కిట్టని వాడిని రంభకోసం'అన్యాథా శరణం నాస్తి 'అంటూ అర్థించమంటావా?”

“ ఏం చేస్తాం.ఇంద్రా ?మనకు తెలియని విషయాలు తెలిసిన వాళ్ళను అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు"

ఇంద్రుడు బరువుగా నిట్టూర్పు విడిచి "అయితే యిప్పుడు నన్నేం చేయమంటారు నారదా?” అని అడిగాడు ఇంద్రుడు.

ఏం లేదు.తక్షణం ఆ చక్రపాణిని పిలిపించి యిక్కడే ఒక చిత్రశాల కట్టించే ఏర్పాట్లు చేయి రంభకోసం నీవే ఇక్కడ చలన చిత్రాలు తీయవచ్చు.అందుకు కావాల్సిన పరికరాలూ యితర వివరాలూ చక్రపాణి చెప్తాడు.అతడు ఎలా చెప్తే అలా చేయి.ఏం రంభా..?”

“ అవును స్వామీ.మీరు చెప్పింది చాలా బాగున్నది.చక్రపాణిగారు మన ఇంద్రలోకానికి రావాలేగాని.వస్తే వారు మనకన్నివివరాలూ చెప్తారు " అంటూ సంతోషంగా చెప్తుంది రంభ.

కోపం దిగమింగుకుని కొర కొర చూస్తాడు ఇంద్రుడు.

“ నారాయణ!ఆ ఏర్పాట్లేవో వెంటనే చూడు ఇంద్రా!”

“ సరే ప్రారబ్దం మహామహులకే తప్పలేదు.”

“ ఇంతకూ ఆ మానవుడిని ఇక్కడికి ఎలా తీసుకురావడం ?అతడు ఒట్టి మొండివాడే పిలిస్తే రాడే !”

“ నిజమే!పిలిస్తే వచ్చే మనిషి కాడు.నిద్రపోతూండే సమయంలో మంత్రశక్తితో తీసుకురావలసిందే.నేను వెళ్ళొస్తాను నారాయణ " అన్నాడు ఇంద్రుడు.