Shivatandavam - Comedy Serial 25

Listen Audio File :

25వ భాగం

పార్కులో.... కిష్టుడు వాళ్ళన్నయ్య గురించి వసుంధరకు ఎప్పట్నుంచో చెబుతున్నాడో గాని - ఇప్పుడు కొసమెరుపులో ఉన్నాడు.

"మీ ఆంటీ మా అన్నయ్యకి బాగా తెలుసు. ఎట్లా తెలుసు? ఏమి తెలుసు? అవన్నీ నాకు తెలీవు. మీ ఆంటీ పేరు చెబితే చాలు. అగ్గిరాముడై పోతున్నాడు"

"ఈ పరిస్థితుల్లో మనిద్దరం స్నేహంగా ఉన్నామని తెలిస్తేనో?"

"ఆడపిల్లతో మాట్లాడటమే తప్పు. స్నేహం కూడా చేస్తున్నానని తెలిస్తే వళ్ళు చీరేస్తాడు. పైగా నీతో స్నేహమని తెలిస్తే చంపేస్తాడు. నన్ను చంపితే చంపాడు. నన్ను చంపి తాను కూడా చచ్చిపోతాడు. అదీ నా బాధ, మొత్తం ఇద్దరం చచ్చిపోతామన్నమాట!"

"అమ్మో!"

"అంచేత మన స్నేహం గురించి మా అన్నయ్యకు తెలీకూడదు"

"మా ఆంటీకి తెలుస్తేనో?"

"అదీ ప్రమాదమే! పెద్దాళ్ల మధ్య ఏం గొడవలున్నాయో ఏమో మనకేం తెలుస్తాయి?"

"అయితే ఇప్పుడేం చేయాలి?"

"ఏమీ లేదు! వాళ్ళకి తెలీకుండా ఇట్లా పార్కులో కాలక్షేపం చేయడమొక్కటే మార్గం!"

"ఏమిటో ఈ పెద్దాళ్ళతో అన్నీ ఇబ్బందులే?" అంటూ వసుంధర తన లంచ్ బాక్స్ తీసింది.

"ఇబ్బందులవి చెప్పి దూరదూరంగా ఉంటామా? అసలట్లా ఉండగలమా?" అన్నాడు కిష్టుడు.

"అదెట్లా వీలవుతుంది? వుండలేం!" అన్నది వసుంధర.

"థ్యాంక్స్ ! స్నేహమంటే అట్లా ఉండాలి!"

"ఇంద... పకోడీలు ...తిను!"

"నీ ఒక్కదానికీ తెచ్చుకున్నావ్! నాకు పెడితే చాలవేమో"

"చాలవనుకుంటే స్నేహితులమెట్లా అవుతాం!...తిను!" కిష్టుడు ఒక పకోడి తినబోతూ సందేహంగా అడిగేశాడు -

"ఇందులో ఉల్లిపాయలేశారా?"

"అవును ఉల్లిపాయ లేకపోతే రుచి వుండదు!"

"నేను ఉల్లిపాయ తినకూడదు!"

"ఎంచేత?"

"బ్రహ్మచర్యం గదా! ఉల్లిపాయ నిషేధమని అన్నయ్య చెప్పాడు."

"అయితే ఇప్పుడు తినవా?" కిష్టుడు క్షణం ఆలోచించి అన్నాడు....

"ఎందుకు తిననూ? అయినా నేను తిన్నట్టు అన్నయ్యకేం తెలుస్తుంది?" అంటూ పకోడిని నోట్లో వేసుకున్నాడు.

"థ్యాంక్స్ " అన్నది వసుంధర.

"ఇదే కాదు. నువ్వేం పెట్టినా తింటాను, లేకపోతే స్నేహితులమెట్లా అవుతాం!" అన్నాడతను.

ఇద్దరూ పకోడీలు సేవిస్తుంటే చర్చిలోంచి అయిదు గంటలు వినిపించాయి.

"కాలేజీ అయిపొయింది!" అన్నాడు కిష్టుడు.

"అయితే ఇంటికి వేళకి చేరుకోవాలి!" అన్నది వసుంధర.

ఇద్దరూ లేచి నుంచున్నారు! కైలాసం కోటేశ్వరరావుని తీసుకొచ్చి శివుడికి పరిచయం చేస్తున్నాడు -

"ఎదురింటి యజమాని వీరే! పేరు కోటేశ్వరరావుగారు!"

"నమస్కారం, కూచోండి!" అన్నాడు శివుడు.

కోటేశ్వరరావు సిగ్గుపడుతూ కూచున్నాడు.

"మిమ్మల్ని కలుసుకునందుకు చాలా ఆనందిస్తున్నాను" అన్నాడు శివుడు.

"నేనూ అంతే!" అన్నాడు కోటేశ్వరరావు.

"చూడండి రావుగారూ! అర్జంటుగా మాకో ఇల్లు అద్దెక్కావల్సి వచ్చింది. మీ ఇళ్ళల్లో ఏదైనా ..."

"అన్ని ఇళ్ళూ అద్దెకిచ్చేశామండి!"

"అనే విన్నాను. మా ఎదురింట్లో ఎవరో డాన్సరున్నట్టున్నారు!"

"అవునండీ! మా ఆవిడే ఆవిడకి అద్దె కిచ్చింది"

"అద్దె ఎంతట!"

"పన్నెండొందలు కాబోలు!"

"నేను పదిహేనిస్తాను."