Shivatandavam - Comedy Serial 24

Listen Audio File :

24వ భాగం

శివుడు కవరు చించేడు లోపలున్న కాగితం తీసేడు.పంకజం గొంతుతో ఉత్తరం చదవబడుతోంది. ప్రియాతి ప్రియమైన శివుడూ - ఆవాక్యం చదవగానే శివుడు తత్తరపాటు చెందాడు. అటూ ఇటూ చూశాడు.

భగవాన్ హనుమాన్ పూజామందిరం కనిపించింది. కొంచెం చేదిరాడు. అయినా తమాయించుకున్నాడు. ఉత్తరం చూపు పెట్టాడు. ఈ ఉత్తరాన్ని నాకోసం చదువుతావనే ఉద్దేశంతో రాస్తున్నాను. దయచేసి పూర్తిగా చదువు. కోపతాపాలు దూరం చేసుకుని చదువు. (ఇంకా చదివేవాడే కానీ, అంతలో ఎవరో మగ మారాజు నవ్వినట్టయింది. ఆ నవ్వు ఎంతో గంభీరంగా వినిపించింది) శివుడు ఉలిక్కిపడ్డాడు.

"ఎవరు? నవ్విందెవరు?" అని ప్రశ్నించాడు.

"నేను!" మళ్ళా దిక్కులు చూస్తున్నాడు శివుడు.

"నేను వత్సా! నీ స్వామిని! పూజామందిరంలో వున్నాను." శివుడు ఆశ్చర్యంగా పూజామందిరం వైపు చూశాడు.

భగవాన్ హనుమాన్ ఆర్జా జనార్ధనరావుకి మల్లె మాట్లాడుతున్నాడు.

"ఉత్తరం చదువుతున్నావా వత్సా!"

"ఇప్పుడే మొదలుపెట్టాను స్వామీ! కైలాసం ప్రాధేయపడితేనూ..."

"హు...ఎవరు ప్రాధేయపడినా... ఉత్తరం రాసింది ఒక మహిళ. మాయలాడి ఆ ఉత్తరం చదివి మళ్ళా మాయలో పడాలనుకుంటున్నావా? ఇంత బలహీనుడివి - నిన్ను నా భక్తుడని చెప్పుకోడానికి సిగ్గుపడుతున్నాను వత్సా! చింతపడుతున్నాను". శివుడు బాగా కలతపడ్డాడు.

చెంపలు వాయించుకున్నాడు.

"అపరాధం జరిగిపోయింది స్వామీ! మన్నించు, శిష్యుడి ఏకైక కోరిక కాదనలేక ఈ పాపిష్టి ఉత్తరాన్ని చదవడానికి సిద్ధపడ్డా. ఇదిగో స్వామీ...నీ కళ్ళముందే దీన్ని బూడిద చేస్తాను, చూడు." అంటూ శివుడు తన చేతిలో కర్పూరం వెలిగించుకున్నాడు.

ఆ మంటలో ఉత్తరాన్ని పూర్తిగా కాల్చి బూడిద చేశాడు. బూడిదైన తర్వాత తృప్తిగా నిట్టూర్చాడు. ఆ పైన స్వామికి నమస్కరించి కదలబోయాడు. అంతలో ఫోన్ మోగింది. శివుడు ఫోనెత్తి హలో అన్నాడు అవతల నుంచి పంకజం మాట్లాడుతోంది.

"నేనే శివుడూ ! పంకజాన్ని! ఉత్తరం చేరిందా?"

"చేరింది" ఆ మాట వెనగానే పంకజం నిబ్బరంగా, ఉత్సాహంగా, ఆవేశంగా, ఆనందంగా మాట్లాడుతోంది.

"అమ్మయ్య! చేరింది గదా! ఉత్తరం చదివి వుంటావు. ఇప్పటికైనా నా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుని వుంటావు కదూ! ఇందులో నా తప్పు ఏమీలేదని తెలుసుకుని వుంటావు. అవునా! మాట్లాడు శివుడూ మాట్లాడు! ఇక మన ఇద్దర్నీ ఎవ్వరూ వేరు చెయ్యలేరు. ఏ శక్తీ మనల్ని విడదీయలేదు అవునా? అవునను శివుడూ... ఆ చల్లటి మాటకోసం తపించిపోతున్నాను."

"స్టాప్ దట్ బ్లడీ ట్రాష్" కోపంగా అరిచాడు శివుడు.

పంకజం నీరసపడిపోయింది. దిగాలుగా అడిగింది "ఉత్తరం చదివి కూడా అరుస్తున్నావా శివుడూ!" చేరిందని చెప్పేనేగాని చదివేనని చెప్పేనా?"

"మరి?"

"కాల్చి పారేశాను."

"చదివి కాల్చావా? చదవకుండా కాల్చేవా" ఆందోళనగా అడిగింది పంకజం!

"చదవడం కూడానా? నెవ్వర్! చదవకుండానే కాల్చి పారేశాను చాలా?" అంటూ ఫోన్ పెట్టేశాడు.

"శివుడూ" అంటూ పంకజం సోఫాలో వాలిపోయంది నీరసంగా.