Shivatandavam - Comedy Serial 23

Listen Audio File :

 

23వ భాగం

ఆమెను గబగబా చేరుకుని ఆనందంగా అన్నాడు.

"తొమ్మిదైనా నువ్వు రాకపోతే మన ప్రామిస్ నువ్వు మర్చిపోయావేమో అనుకున్నాను!"

"పది నిమిషాల ముందే ఇంట్లోంచి వచ్చేశాను!" అన్నది వసుంధర.

"ఎంచేత?"

"ఏమో మరి? ఇంట్లో వుండబుద్ధి పుట్టలేదు"

"అదంతేలే! స్నేహం చేస్తే అట్లాగే వుంటుంది. ఇవాళ కాలేజీకి డుమ్మాకొడితే ఎలా వుంటుంది?"

"ఆంటీకి తెలుస్తే ఊరుకోదు బాబు?"

"మా అన్నయ్యకి తెలిసినా అంతే! ఉతికి ఆరేస్తాడు. అయినా, మనం డుమ్మా కొట్టినట్టు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది."

"డుమ్మా కొట్టి ఏం చేద్దాం?"

"ఏదైనా పార్కులో కూచుందాం, కాలేజీ అయ్యేంతవరకూ పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ కాలక్షేపం చేద్దాం. ఒ.కే"

"ఒ.కే" ఇద్దరు సైకిళ్ళెక్కారు. చేయి చేయీ కలుపుకుని అట్లా అట్లా తూనీగల్లాగా వెళ్ళిపోతున్నారు. కైలాసం ఆపసోపాలు పడిపోతూ శివుడ్ని చేరుకున్నాడు. అతని చేతిలో ఒక కవరుంది!

"ఏమిటది?" అడిగాడు శివుడు.

"కవరండీ!"

"అది తెలుస్తూనే వుంది. పోస్టు రావడానికి ఇంకా టైముంది గదా - అప్పుడే ఎక్కడ్నుంచి వచ్చింది కవరు?"

"అది పోస్టాఫీసు నుంచి వచ్చిన కవరు కాదండీ. హేండ్ డెలివరీ మీకివ్వమని నా చేతికిచ్చారు!"

"ఎవరు!"

"ఒక స్త్రీ" భయంగా చెప్పాడు కైలాసం.

ఆ సమాధానానికి పిడుగు పడుతుందేమో ననుకున్న కైలాసం ఆశ్చర్యపోయేలా క్షణకాలం నిశ్శబ్దం ఆవరించింది.

గంభీరంగా అడిగాడు శివుడు "ఎవరా స్త్రీ?"

"పం... పంకజం గారు" కనీసం ఇప్పటికయినా పిడుగుపడి వుండాల్సింది.

అయినా పడలేదు. శివుడు తాపీగా లేచేడు. కవరందుకున్నాడు. దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కైలాసం మొహం మీద కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది.

అంతపనీ చేసేవాడే కానీ కైలాసం చొరవగా అడ్డుపడి అన్నాడు "సార్! మీ దగ్గిర ఇన్నాళ్ళు పనిచేస్తూ ఎన్నడూ, ఏ విషయంలోనూ అర్థించలేదు. ఈ ఒక్కసారి మాత్రం తప్పడంలేదు. ఉత్తరం చించకండి - తీరుబడిగ చదవండి సార్ ! మీకు మేలు జరుగుతుంది."

"నాకు మేలు జరుగుతుందని నీ కెట్లా తెలుసు? నువ్వు గాని చదివేవా?"

"లేదు సార్ ! ఆవిడగారే. పం...పంకజం గారే చెప్పారు సార్ ! ఈ ఉత్తరం గనక మీరు పూర్తిగా చదివితే మీ కెంతో ప్రయోజనం కలుగుతుందని తన మాటగా మీకు చెప్పమని వారు నాకు చెప్పారు సార్!"

"కైలాసం" అరిచాడు.

"సార్..." భయంగా అన్నాడు.

"ఒక ఆడ పురుగుతో మాట్లాడటమే నేరం. అది చాలదన్నట్లు ఉత్తరాలూ, రాయబరాలు కూడా నడుపుతున్నావా?"

"సార్...మీరు నన్ను తిట్టండి. కొట్టండి. చంపండి. నేనేమయిపోయినా ఫర్లేదు కానీ - మీ మంచి కోసం మీరు ఆ ఉత్తరాన్ని చదివితీరాలి. చదివినంతమాత్రాన వ్రతిభంగమవుతుందా సార్? ఆవిడ అంతగా చెప్పారంటే అందులో ఏదో ముఖ్యమయిన సమాచారమే వుంటుంది. ఈ ఒక్కసారి నా మాట కాదనకుండా చదవండి సార్!" ప్రాధేయపడ్డాడు కైలాసం.

క్షణంపాటు మళ్ళీ నిశ్శబ్దం. శివుడు ఏదో నిర్ణయానికి వచ్చాడు.

"సరే! ఇక నువ్వు వెళ్ళు" అన్నాడు.

కైలాసం నమస్కరించి వెళ్ళిపోయేడు.