Shivatandavam - Comedy Serial 17

Listen Audio File :

17వ భాగం 

" ఒక్క క్షణం మీతో మాట్లాడాలి " అన్నది వసుంధర.

కిష్ణుడు సైకిలు దిగకుండానే ఒక కాలు కింద పెట్టి ఏమిటన్నట్టు చూశాడు.

" ఉదయం నేను మిమ్ముల్ని ఎన్నెన్నో మాటలని అవమాన పరిచేను "

" అందుకు శిక్షగా కొట్టేను గదా " వసుంధర నీరసంగా నవ్వేసింది.

" కోపమొచ్చి కొట్టారేగాని, ఆ చర్యతో నన్ను క్షమించినట్టు అవుతుందా " అన్నది వసుంధర.

కిష్ణుడికి మతిపోయినంత పనైంది. అయిదేళ్ళూ అచ్చు పడేలా చాచి కొడితే యింకా క్షమించమని ప్రాధేయపడే ఈ పిల్ల పిచ్చిదా లేక ఇది ఏమైనా ఎత్తా. ఇంకా వసుంధర మాట్లాడుతూనే ఉంది " చెంప చెళ్ళుమనిపించేరు అంతేగా! నేను తిట్టినా తిట్లకు నా కాలో చెయ్యో విరగొట్టాల్సింది. ఆ పని చేయలేదు " అని.

" ఆ పని ఇప్పుడు చేయమంటావా ?"

" మీరేం చేసిన నేనందుకు సిద్ధమే " కిష్ణుడు సైకిల్ దిగేడు.వసుంధరకి దగ్గరగా వచ్చాడు. ఆమె తలొంచుకు నిలబడింది. అతను ఆమె తలను తన చేతుల్తో పైకేత్తేడు.

ఆమె కళ్ళలోకి చూసేడు. ఆమె కళ్ళు నీళ్ళతో నిండివున్నాయి.కిష్ణుడు బాగా చలించి పోయేడు. ఒక్కో అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు. " నీకేమైనా పిచ్చా ?" వసుంధర లేదన్నట్టు తలూపింది.

" లేకపోతే కాలో చెయ్యో తీసేయమని కోరుకుంటారేమిటి ? మీ కంటికి నేనో రౌడీ వెధవలాగా కనిపిస్తున్నానా ?"

" చూడూ..నేను మంచివాడినే. సాధారణంగా ఎవర్నీ ఎప్పుడూ కొట్టను. నిన్ను కొట్టినందుకు ఎంతో బాధపడ్డానో తెలుసా? క్లాసులో ఇవాళ ఒక్క పాఠం కూడా బుర్రకు ఎక్కలేదు "

" నాకూ అంతే! ఒక్క పాఠం కూడా అర్థం కాలేదు "

" అసలు నిన్ను ఎందుకు కొట్టానో తెలుసా ?"

" తెలుసు "

" నీ యిష్టం వచ్చినట్టు తిడుతుంటే ఓర్చుకోలేకపోయాను. మీ గేటు ముందే తన్నేవాడ్ని. మా అన్నయ్య చూస్తే ఊరు కోడని. దార్లో కాపు కాసేను "

" మీ అన్నయ్యంటే "

" శివరామారావు గారని పెద్ద ఇదిలే! మీ మేడముందు మేడ మాదే ! "

" నిజం "

" అవును. మనవి ఎదురెదురీళ్ళన్న మాట. అది సరే. నువ్వేం చదువుకున్నావ్ ?"

" ఉమెన్స్ కాలేజీలో పి.యూ.సి."

" నేను బాయిస్ కాలేజీలో బి.ఏ. ఫైనలియర్ చదువుకున్నాను. ఎదురెదురు ఇల్లు గనుక మనిద్దరం కలిసే కాలేజికి వెళ్ళచ్చు కదూ ! ? " అంతే నా మీద కోపం పోయిందా ?"

" ఎప్పుడో పోయింది. ఇప్పుడు మనం స్నేహితులం "

" థేంక్స్ "

" మరి రోజూ కాలేజికి "

" కలిసే వెడదాం "

" థేంక్స్...అవునూ ఇంతకీ నీ పేరేమిటి ?"

" వసుంధర " మంచిపేరు. నా పేరు క్రిష్ణ. మా అన్నయ్య నన్ను బుజ్జులూ అని పిలుస్తాడు "

" నన్ను బేబి అని పిలుస్తుంది మా ఆంటీ "

" ఆంటీ అంటే...ఆవిడే గదూ..మార్నింగ్ నువ్వు నన్ను తిట్టినందుకు...నిన్ను కోప్పడిందే ఆవిడేనా ?"

" అవును "

" ఆవిడెం చేస్తుంటారు " ఆ ప్రశ్న విని వసుంధర తల్లడిల్లిపోయింది. అంత గొప్ప ఆంటీ గురించి అతనికి తెలీక పోవడం చాలా బాధ కూడా కలిగింది.అంచేత ఆశ్చర్యపోతూ బాధపడిపోతూ అడిగింది.

" అయ్యయ్యో మా ఆంటీ గురించి అస్సలు నీకేమీ తెలీదా ?"

" ఒట్టు నాకేం తెలీదు "

" మా ఆంటీ పేరు పంజకం. ప్రఖ్యాత నర్తకి "

" అట్లాగా " అన్నాడు అతను వుదాసీనంగా. అప్పుడు కూడా వసుంధర బాధపడింది.