Shivatandavam - Comedy Serial 13

Listen Audio File :

Comedy Audio Serial

భాగం - 13

******************** “

"అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మేడలోకి మరో మేడకి మారనని మాటిచ్చేయ్ " అన్నది ధనలక్ష్మి.

“ అట్లాగే పిన్నిగారూ! నేను కూడా కావాలనే ఈ ఇంట్లో అద్దెకు దిగేను " అన్నది పంకజం.

“ సంతోషం! ఏం కావలసినా కబురు చేస్తుండు.పక్క వీధిలోనే ఉంటున్నాం మా ఆవిడ వచ్చి సాయం చేస్తుంది. మరి వెళ్లి వస్తాం " అన్నాడు కోటేశ్వరరావు.

“ ఒక్క క్షణం ఆగండి! వసూ..వసుంధరా!” అని పిలిచింది పంకజం. మరుక్షణంలో అక్కడికొక బంగారు తీగవచ్చి తళుక్కున మెరిసింది. స్వీట్...సిక్స్ టీన్. ఆ పిల్లే సరిన సాక్షం.

“ పిలిచావా ఆంటీ " అని అడిగింది వసుంధర. కోటివీణలు మొగినట్టు ఎంతో సుతారంగా వుంది ఆ గొంతు.

“ అవును బేబీ. ఈవిడగారు ధనలక్ష్మీ. ఆయనగారు కోటేశ్వరరావుగారు. మనం అద్దెకు దిగిన మేడ వీళ్ళదే! నమస్కారం చెయ్యి " అన్నది పంజకం.

“ నమస్తే " అన్నది వసుంధర. ఆ దంపతులు ముచ్చటపడ్డారు.

“ ఈ పాప మా అన్నయ్య కూతురు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు " అన్నది పంకజం దిగులుగా.

“ అయ్యయ్యే " అన్నారు దంపతులు.

“ అప్పటి నుంచి బేబీని నేనే పెంచుకుంటున్నాను. పి.యుసి. చదువుతుంది. మీకు తెలిసిన కాలేజిల్లో ఎక్కడయినా ఒక సీటు ఇప్పించాలి " అన్నది పంకజం.

“ ఎక్కడో ఎందుకూ ? మా పిల్లలి చదివే ఆడపిల్లల కాలేజీలోనే చేరవచ్చు " అన్నాడు కోటేశ్వరరావు.

“ ఆ బాధ్యత మీరు తీసుకోవాలి బాబాయిగారు " అన్నది పంకజం.

బాధ్యతనే మాట వినగానే బాబాయిగారు భయపడిపోయారు. నావల్ల కాదని చెప్పేందుకు సిద్దపడినప్పుడు ధనలక్ష్మి, మాట సాయం చేసింది.

“ అమ్మాయ్..ఇంత చిన్న పనికి బాధ్యత, బరువులని పేర్లు పెట్టకు. ఇందులో మీ బాబాయి కలుగజేసుకోవలసినది ఏమి లేదు. నీ పేరు చెబితే చాలు. కళ్ళు మూసుకుని సీటు ఇచ్చేస్తుంది ఆ ప్రిన్సిపాల్ "

“ అవునవును. ఆవిడక్కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. ఆవిడ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు నాట్యం.” అన్నాడు కోటేశ్వరరావు.

“ అట్లాగా ?”

“ అడిగేవు గనుక స్వయంగా నేనే పెళ్లి బేబీకి సీటు ఖరారు చేస్తాను " అన్నది ధనలక్ష్మి.

“ మీ సాయం మరిచిపోలేను " అన్నది పంజకం.

“ మాటలో మాటగా మా పిల్లతోపాటు ఆ పిల్లలక్కూడా డాన్స్ పాఠాలు చెబుతావని అంటాను. అనమంటవా ?” అన్నది అప్పటి గాని ధనం ప్లానేమిటో అర్థం కాలేదు కోటేశ్వరరావుకి.

“ మా అమ్మాయికి సీటు దొరకాలి గాని డాన్స్ పాఠాలకేం పిన్నిగారు. మీరింత సాయం చేస్తుంటే నేను పాఠాలు చెప్పలేనా " అన్నది పంకజం.

“ అదీ అభిమానమంటే అట్లా ఉండాలి. మరి వెళ్ళొస్తానమ్మా " అంటూ పిన్నిగారు కదిలేరు.

ఆవిడతో పాటు బాబాయిగారు కదిలేరు. బాబాయిగారితో ఏమి మాట్లాడిన ప్రయోజనం లేదని తెలుస్కున్న పంకజం " పిన్నిగారూ " అని పిలిచింది. పిన్నిగారు ఆగిపోయేరు. బాబాయిగారు వెళ్ళిపోతున్నారు.

“ ఏం కావాలమ్మా ?” అని అడిగింది ధనలక్ష్మి.

“ ఏమీ లేదండి! మన మేడముందు మేడలో ఎవరుంటున్నారు ?”

“ ఏదీ...ఆ పచ్చమేడలోనా? హనుమాన్ భవన్లోనా?” అని రాగం తీసుకుంటూ అడిగింది ధనలక్ష్మి.

“ అవునండీ " అన్నది పంజకం.

ధనలక్ష్మి తన ధోరణి మార్చి ఆ మేడకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నంలో విసుకుంటూ అన్నది " అమ్మాయ్...నువ్వేదయినా అడుగు. అన్నిటికీ ఓపికగా సమాధానం చెబుతాను. ఆ ఇంటి గురించిగానీ, అందులో వుండే ముదనష్టపు మనుషుల గురించిగానీ అడక్కు. చెప్పడానికి నా నోరు తిన్నగా రాదు "

“ అదేం "

“ ఏం చెప్పమంటావు తల్లీ అతను ఆ మేడ కొని ఆరు నెలలయింది. అప్పటి నుంచీ ఈ వీధిలో ఏ సంసారం కూడా సుఖంగా లేదంటే నమ్ము "

“ ఏం చేస్తాడేమిటి ?”