Shivatandavam-Comedy Serial 11

Listen Audio File :

COMEDY AUDIO SERIAL

11 వ భాగం

“హూ..... నన్ను ఉద్దరించే మగాడివా నువ్వు? ఆనాడు నిన్ను నాటకంలో కొట్టేనే గాని దాంతో నా కసి తీరలేదు. శివుడూ! నిన్ను చితగ్గొట్టి పంపించాలనే ఉద్దేశంతో అలాంటి ఉత్తరం రాసేను. వెయ్యి జన్మలెత్తినా నువ్వు మా జగ్గు బావకి దీటురావు. అతనెక్కడ! నువ్వెక్కడ నేనా నిన్ను పెళ్ళి చేసుకునేది? ఫో! ఈ జన్మకి నాక్కనిపించకు. ఆడపిల్లని అవమానిస్తే డానికి శిక్షేమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నావు కదా! వెళ్ళింక! ఫో!” అంటూ అరుస్తోంది.

శివుడు చెంపలు రాసుకుంటూ ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ కదుల్తున్నాడు. అట్లా నడుస్తూ, నడుస్తూ అతను కాలి జారి నదిలో పడ్డాడు) అంతే అప్పల్సామీ! నదిలో పడిన మరుక్షణమే నేను మరో జన్మ ఎత్తును. ఆ గాధంతా గత జన్మలో జరిగిందిగా ఎంచుకుంటున్నాను.

" ఇప్పుడు చెప్పు అప్పల్సామీ... ఆడదాన్ని నమ్మవచ్చా? నయవంచనకు మరోపేరు ఆడది! మోసం దగా కుట్రలకి మూలవిరాట్టు ఆడది! అవునా కాదా. చెప్పు అప్పల్సామీ..... చెప్పు!” అంటూ అప్పల్సామి కూచున్నవేపు చూశాడు.

అక్కడ అప్పల్సామీ లేడు. గది బయట ఏదో శబ్దమైతే తొంగి చూసేడు! అప్పల్సామి చెవు పుచ్చుకుని నడిపించుకు పోతోంది దుర్గమ్మ. బాధగా కళ్ళు మూసుకున్నాడు శివుడు! ఎక్కడ్నించో సీజరు సన్నగా మూలిగినట్టు వినిపించింది! అన్ని కుక్కల్లాటి కుక్కకాడు సీజరు. దాని జాతి వేరు. బ్రహ్మచారి జాతి. దాని పెంపకం వేరు. బ్రహ్మచారి పెంపకం. దాని రోషం వేరు, బ్రహ్మచారి రోషం. అంచేత సీజరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మూలిగి మూలకూచోదు. ఆకలి వేస్తే మొరుగుతుంది. ఆనందం కలిగితే మొరుగుతుంది. మొరగటం అట్లా ఇట్లా కాదు. గుండెల్లో సోడా కొట్టినట్టు భయంకరంగా మొరుగుతుంది.

అల్లాంటిది మూలగడమేమిటి? జబ్బు చేసిందా? అందుకే మాత్రం అవకాశం లేదు. బ్రహ్మచారి కుక్కలకు జబ్బులు చేయవు. పైగా ఆ మూలగడం జబ్బుతో మూలిగినట్టు కూడా లేదు. తియ్యగా మూలిగినట్టు పరవశంతో మూలిగినట్టు కులుకుతూ మూలిగినట్టు మూలుగుతోంది! ఎక్కడుంది సీజరు? మెడమీద గదిలోంచి శివుడు చుట్టూ చూసేడు. కనిపించలేదు. ఇంకా మూలుగుతున్న శబ్దం వినిపిస్తూనే వుంది. గబగబా కిటికీ దగ్గరికి వెళ్ళాడు, కిందికి చూసేడు. ఆ దృశ్యం చూడగానే తన కళ్ళని తను నమ్మలేకపోయాడు. ఆవేశంతో ఊగిపోయాడు. పిడికిలి బిగించేడు. ఎదురింటి ఇనుప గేటు బయట సీజరు నిలబడి వుంది. గేటు లోపల మరోకుక్క వుంది. ఆ కుక్కతో ఈ కుక్క ముచ్చట్లాడుతోంది.

అవతల కుక్క కూడా మగ కుక్కయితే శివుడు పిడికిలి బిగిసేది కాదు. అది ఆడది తెల్లగా నిగానిగలాడుతోంది. హొయలు పోతోంది. అది ఆడించినట్లు సీజరు ఆడుతోంది! దగా! మోసం! కుట్ర! తన దగ్గరి పెరుగుతూ ఆడకుక్కతో ముచ్చట్లా! “సీజర్!” అని పులికేక పెట్టాడు శివుడు. గేటు బయట నిలబడ్డ సీజరు ఆ కేకకి ఉలిక్కిపడింది. కేక వచ్చిన దిక్కువేపు మెడ ఎత్తి చూసింది. మేడమీద శివుడ్ని చూసింది.

“అయ్ విల్ కిల యూ బ్లాస్టర్డ్! కమాన్!” శివుడు ఉరిమాడు. సీజరు అక్కడ్నించి చెంగున దూకి సొంత ఇంటివేపు దారి తీసింది. గేటు లోపల మిగిలిపోయిన ఆడ కుక్క శివుడివేపు కోపంగా చూస్తూ, శాపనార్ధాలు పెడుతోంది కీచుగా మొరుగుతూ! 'అవమానం... ఇన్ సల్ట్' అనుకున్నాడు శివుడు.

నిన్న మొన్నటివరకు ఆ ఇంట్లో ఆడకుక్కే కాదు ఏ కుక్కా లేదు. ఇవాల్టికివ్వాళ ఎక్కడ్నుంచి దిగొచ్చింది? ఎక్కడ్నుంచి వచ్చినా.. వచ్చింది వచ్చినట్టుండక నిప్పులాంటి సీజర్ని ఆకర్షిస్తుందా? ఎన్ని గుండెలు? మళ్ళా కిందకి చూశాడు శివుడు. ఆ ఇంటి గోడకి నేమ్ బోర్డు కొడుతున్నాడెవడో... బహుశా, ఆ మేడలోకి ఇవాళే ఎవరో కొత్తవాళ్ళు వచ్చిఉండాలి వస్తే వచ్చేరు. కుక్క నెందుకు తీసుకురావాలి. అందునా ఆడకుక్క. బోర్డు కొట్టేసి మనిషి వెళ్ళిపోయేడు.

శివుడి చూపు ఆ బోర్డు మీద పడింది. “కె. పంకజం. నర్తకి" అని రాసి ఉంది. శివుడు నెత్తిమీద పిడుగు పడినట్లయ్యింది. ఏ వ్యక్తిని మరిచిపోయి లోకకళ్యాణం కొరకు తన జీవితాన్ని వినియోగిద్దామనుకున్నాడో... సరిగ్గా ఆ వ్యక్తే తన ఇంటిముందు కాపురం పెట్టిందా? ఎవరు తన బ్రతుకుతో ఆడుకుని అవమానించారో ఆ వ్యక్తే తనని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చిందా? వచ్చి ఏమి చేయాలనుకుంటోంది? వ్రతభంగమా అది ఆమె తరం కాదు! అల్లరా? అందుకు తను అతీతుడు. మరేం చేద్దామని వచ్చింది? అయినా ఆ పంకజం ఆ పంకజం ఒకటి కాకపోవచ్చు పోవచ్చుమేమిటి? ఖచ్చితంగా కానే కాదు ఆ పంకజం ఇంటిపేరు ఆర్.

ఈ పంకజం ఇంటిపేరు కె. ఈమె ఎవరోగాని ఆమె కానే కాదు! ఎవరైతేనేమి? దొరక్క దొరక్క దిక్కుమాలిన పేరు పంకజం దొరికిందా ఈమెకు? ఎన్ని పేర్లు లేవు. సీత, అనసూయ, సావిత్రి, దమయంతి, సరళ, విమల ఎన్నెన్ని పేర్లు? ఆ పేర్లన్నీ కాదని పంకజమనే పెట్టుకోవాలా? అవును... నర్తకి అని రాసి ఉందేమిటి? ఆ పంకజం కూడా డాన్సర్! కొంపదీసి ఆ పంకజమే ఈ పంకజం కాదు గదా! ఎట్లా అవుతుంది? ఆమె ఆర్. పంకజం... ఈమె కె. పంకజం. ఇంటిపేర్లలో తేడా లేదు ఆడపిల్లకి పెళ్ళవడంతో ఇంటిపేరు మారోపోతుంది. ఆర్. పంకజం ఎవర్నో పెళ్ళాడి కె. పంకజం కావచ్చు గదా! ఇంకె ఎవరో ఏమిటి? ఆ జగ్గుగాడినే పెళ్ళి చేసుకుని వుంటుంది.

జగ్గుగాడి ఇంటిపేరు ఏమిటి? గుర్తులేదు. బహుశా కె. కావచ్చు. ఆలోచనలతో శివుడి తల బరువెక్కింది. మళ్ళా ఒకసారి బోర్డు వేపు చూడాలనుకున్నాడు కాని ఆ ప్రయత్నము విరమించి కిటికీ రెక్కలు ఫడేల్మని మూసేశాడు. తిన్నగా ఆంజనేయస్వామి వేపు కదిలి చేతులు జోడించి. 'ఈమె ఆమేనా స్వామీ' అని అడిగాడు. భగవాన్ హనుమాన్ చిద్విలాసంగా నవ్వేశారు.