TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Comedy Audio Serial
.png)
8 వ భాగం.
అవి నేను కాలేజీలో చదువుకునే రోజులు. (శివుడు కళ్లముందు కాలేజీ వాతావరణం తళుక్కున మెరిసింది . కాలేజీకి సైకిళ్లమీద వచ్చేవాళ్లే గాకుండా చెట్టాపట్టా లేసుకుని కొందరు నడిచే విద్యార్ధులు కూడా వున్నారు. వాళ్ళల్లో శివుడునడుస్తున్న శివుడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. అతని చూపు ఒకచోట నిలబడి మాట్లాడుకుంటున్న ఆడపిల్లల గుంపుమీద పడింది. ఆ గుంపులో ఒక అందాలబొమ్మ నవ్వుతూ చేతులూపుకుంటూ ఏమిటేమిటో చెలికత్తెలతో చెబుతోంది. ఏం చెబుతోందో వినపడటం లేదు కానీ అలవోకగా ఆ నవ్వు అందమైన భంగిమలో ఆ చేతులు తిప్పటాలు వగైరా విన్యాసాలు కంటికింపుగా వున్నాయి. ఆ అమ్మాయి అట్లా చెబుతూనే వుంది. శివుడు అట్లా చూస్తూనే వున్నాడు)
మా కాలేజీ మొత్తమ్మీద అందమైన ఆడపిల్ల ఎవరని ఎవర్నిడిగినా ఒకే సమాధానం పంకజం! పంకజం గొప్ప అందమైన ఆడపిల్లయ్యా అప్పల్సామీ! అందంలో ఫస్టు, చదువులో ఫస్టు, ఆటల్లో ఫస్టు, హై జంపూ, లాంగు జంపు పోటీల్లో పంకజాన్ని చూసేందుకు కుర్రాళ్ళు ఎగబడే వారు అప్పల్సామీ! ఇసకేస్తే రాలే చోటుండేది కాదు. ఇప్పుడు శివుడి మనోతెరమీద పంకజం హైజంపూ లాంగుజంపూలు చేస్తోంది. చిన్న నిక్కరు కట్టుకుని వుండడంవల్ల ఆ పిల్ల గొప్ప సెక్సీగా చమత్కారంగా వుండి. హైజంపు చేస్తున్నప్పుడు లాంగు జంపు దూకుతున్నప్పుడు వేలాది కళ్ళు ఆ పిల్లని ఆశగా చూస్తున్నాయి.
శివుడి కళ్ళు సరేసరి! ఆమె ఛాతీకి, నిక్కరుకీ అంకితమైపోతాయి. ఆమె దూకుడు ఫీట్లు శివుడి కళ్ళమీదికి వచ్చేసి మనసు వికలం చేయడంవల్ల ఆ దృశ్యాన్ని అతి కష్టం మీద కట్ చేసుకున్నాడు శివుడు). పంకజం చదువు ఆటల్లోనే కాదు అప్పల్సామీ! నాటకకళలో కూడా ఫస్టేనని చెప్పాలి. మా కాలేజీలో ప్రదర్శించే నాటకాల్లో ఆమె హీరోయిన్. అయితే ఆమె నాటకాల్లో హిరోగా జగ్గూగాడే వుండేవాడు. జగ్గుగాడి పూర్తిపేరు జగన్నాధం. మా క్లాసుమేటు. ఉత్త రౌడీ వెధవ. వాడి జేబులో ఎప్పుడూ ఒక బాకు పెట్టుకుని తిరిగేవాడు. జగ్గుగాడు పంకజానికి మేనమామ కొడుకు అంటే బావన్నమాట. ఈ బావగాడు పంకజానికి బాడీగార్డు.
పంకజమ్మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. కాబోయే భార్యనే బోర్డు మూర్ఛ రోగిలాగా మెళ్ళో కట్టుకుని తిరిగేవాడు. వాడిమీద భయంతో పంకజంమ్మీద ఆశ వదులుకున్న ప్రేమ జీవులు అనేకమంది వున్నారు అప్పల్సామీ. (జగ్గుగాడు భయంకరంగా కనిపిస్తున్నాడు. బాకుతో చాకులాంటి పర్సనాలిటీతో, నోట్లో సిగరేట్ తో, మూతిమీద బొద్దు మీసాలతో గొప్ప భయంకరంగా వున్నాడతను. పంకజాన్ని ఎవడో ఏదో అన్నాడు కాబోలు వాడికి రేవు పెట్టేశాడు. కొట్టినచోట కొట్టకుండా కైమా చేసేస్తున్నాడు.
ఆ దృశ్యాన్ని చూడగానే పంకజం కూడా కళ్ళు మూసుకుంది. అయినా జగ్గుగాడు అవతలవాడ్ని వీర ఉతుకు ఉతుకుతున్నాడు.) సిగ్గు విడిచి చెప్పేస్తున్నాను అప్పల్సామీ! నేను పంకజాన్ని ప్రేమించేను. ఏంతో ఘాటుగ, గాఢంగా ప్రేమించేను. అయితే నిన్ను ప్రేమించేను పంకజం అని చెబితే పంకజం ఏమంటుందో ఏమనుకుంటుందోనని బెరుకు. జగ్గుగాడి చేతిలో నా ఎముకలు సున్నమైపోతాయని భయం. ఈ రెండు కారణాలవల్ల నా ప్రేమను వ్యక్తం చేయలేదు. జీవితం నా ప్రేమను వ్యక్తం చేయలేకపోయినా కనీసం నాటకంలోనయినా ఆమెను ప్రేమించే అవకాశం కలగాలని ఎందరో దేవుళ్ళను ప్రార్ధించాను. జగ్గుగాడు వుండగా నాకు ఛాన్సు కూడా దక్కదని ఆ కోరికను సైతం గుండెలో దాచేసుకున్నాను.
(శివుడి చేతిలో గులాబి పువ్వుంది. ఎంతో ఆశగా దాన్ని పంకజానికివ్వబోయాడు. ఆ సమయానికి జగ్గుగాడు నోట్లో సిగరేట్ ని వయ్యారంగా తిప్పడం చూసి పువ్వు జేబులో దాచేసుకుని దారి మార్చి వెళ్ళిపోతాడు శివుడు) అట్లా కొన్నాళ్ళు జరిగాయి.
ఆ ఏడాది మా కాలేజీలో సాంస్కృతికోత్సవాల్లో 'వరూధినీ ప్రవరాఖ్య' నృత్య నాటికను ప్రదర్శించాలని తీర్మానించుకున్నారు. నీకు చెప్పడం మరిచేను అప్పల్సామీ - పంకజం డ్యాన్సులో కూడా ఫస్టేనయ్యా! (శివుడి గుండెలమీద పంకజం వివిధ రకాల నాట్య భంగిమల్లో తళుక్కున మెరిసింది - అంతే!) నాట్యంలో ఫస్టు పంకజాన్నే వరూధిని సెలక్ట్ చేశారు.
అయితే ప్రవరాఖ్యుడు జగ్గుగాడు కాలేడు. వాడికి డ్యాన్స్ రాదు. నన్నడిగే ఏ కుర్రాడికి డ్యాన్సురాదు. డ్యాన్సు వచ్చిన కుర్రాడే ప్రవరాఖ్యుడు కావాలని నోటీసు పంపారు.
అదొక మంచి అవకాశం. చేయిజారితే మళ్ళా పంకజం పక్కన హీరోగా నటించే అవకాశమే రాదు. ఎట్టి పరిస్థితుల్లోనయినా సరే నేనే ప్రవరాఖ్యుడిగా పంకజం పక్కన డ్యాన్సు చేయాలి. ఎట్లా? నాకు డ్యాన్స్ బొత్తిగా రాదు. రాదని ఊరుకుంటే వచ్చన సదవకాశం దూరమవుతుంది. పంకజం కోసం కాలికి గజ్జె కట్టుకోవడమే కాదు మెడకి ఉరి వేసుకోమన్నా సిద్ధమే నేను! అందుచేత నాకు డ్యాన్స్ లో ప్రవేశమున్నట్టు అబద్ధం చెప్పేను. పదిరోజుల్లో ప్రవరాఖ్యుని ఎన్నిక.
ఆ తర్వాత రిహార్సల్సు ప్రారంభం. ఆ పదిరోజులు కాలేజీకి వెళ్ళలేదు. ఒక ప్రముఖ నాట్యాచార్యులను కలుసుకుని. కేవలం పదిరోజులకు వెయ్యినూటపదహార్లు దక్షిణ సమర్పించుకుని ప్రవరాఖ్యుడికి సంబంధించిన నృత్యాన్ని అభ్యసించెను. ఆ పదిరోజులు ఒకటే దీక్ష! నాట్య దీక్ష. (నాట్యాచార్యుడు పాఠాలు చెబుతున్నాడు శివుడు తాండవం చేస్తున్నాడు.
చెమట్లు పట్టేలా గంతులు రేయింబవళ్ళు ఇదే శ్రమ. శ్రమని లెక్కచెయ్యని దీక్ష. ఇదంతా ప్రేమ పరీక్షకు ప్రిపరేషన్) చివరికి నా ఆశయం నెరవేరింది అప్పల్సామీ! ప్రవరాఖ్యుడిగా నేనే ఎన్నికయ్యాను. నా దశకు ఎందరో ఈర్ష్య పడ్డారు. ఇద్దరూ ముగ్గురు స్నేహితులు అకారణంగా విరోధం తెచ్చుకున్నారు. నేను లెక్క చేయలేదు. నాక్కావలసింది పంకజం ఆమె మెప్పు. పిసరంత ఆరాధన. అయ్ లెక్యూ శివుడు అనే అప్రిసియేషన్.
|
|