Rampandu-Navalamani

రాంపండూ - నవలామణీ

“ ఒరేయ్, మన క్లబ్బులో లేడీ వెయిటర్లను పెట్టారట.చూశావా ? ” అన్నాడు రాంపండు పోతుటీగల క్లబ్బులోకి అడుగుపెడుతూ.

“ చూశాను. కానీ అంతా వేస్టు కాండిడేట్లే వాళ్ళను చూసి క్లబ్బుకి ఎక్కువమంది వస్తారన్న ఐడియా ఎవడిదో కానీ, పాపం...” అంటూ చప్పరించేశాడు అనంత్.

కాస్సేపటిలోనే అనంత్ లంచ్ ఆర్దరిస్తున్నాడు. ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన అమ్మాయిని చూడగానే రాంపండుకి ఇంట్రెస్ట్ పోయింది.

“ ఏదో ఒకటి నువ్వే చెప్పేయరా " అని టాయిలెట్ కి వెళ్లిపోయాడు. ఆ వెళ్లినవాడు పావుగంటైనా తిరిగిరాకపోవడంతో అనంత్ కు అనుమానం పట్టుకుంది.

క్షుద్బాధతో మనవాడు ఎక్కడైనా కూలిపోయాడా అని.వెతుక్కుంటూ వెళితే మరో టేబుల్ దగ్గర కూచున్నాడు. ఏరా ఇక్కడున్నావ్ ? అంటే మండిపడ్డాడు.

“ నువ్వొక్కడివి.ఏదీ తెలిసీ తెలియకుండా మాట్లాడతావ్.వెయిట్రాసులందరూ వేస్టని చెప్పేశావ్. ఇక్కడ చూడు.ఈ టేబుల్ దగ్గర డ్రింక్స్ సప్లయి చేసే అమ్మాయి ఎంత బాగుందో చూడు. సన్నగా,పొడుగ్గా,చేపల్లాటి కళ్ళతో...”

“ ఆ లంచ్ నగరుకు రాను.ఈ డ్రింకు నగరులోనే ఉంటాను.టా టా వీడుకోలు " పాడాడు రాంపండు.

“ తంతాను.అదంతా ఎవడు తింటాడు ?ఇక్కడ డ్రింక్స్ మాత్రమే ఇస్తారు " మొత్తుకున్నాడు అనంత్.

“ కావాలంటే తన్నులు తింటా గానీ ఇక్కడే తాగుతా.ఆ అమ్మాయి చేతుల మీదుగా విషం ఇచ్చినా ఓకే " మొండికేశాడు రాంపండు.

“ ఒరే, నువ్వు ఆమెను చూసి పావుగంట కూడా కాలేదు.బహుశా టాయిలెట్ నుండి వస్తూ చూసి వుంటావు.అప్పుడే ప్రాణత్యాగం దాకా పోతున్నావే !” అని తెల్లబోయాడు అనంత్.

“ ఒరేయ్, నువ్వు ఈ జన్మలో లెక్కే చూస్తున్నావ్.క్రితం జన్మల ఎక్కువుంటు మర్చుపోకు. బుద్ధుడి జాతక కథల్లా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు.నేను బాబిలోనియాలో యువరాజు అవతారంలో ఉండగా,ఆమె అరబ్బీ బానిస.తను క్లియోపాత్రా అవతారంలో ఉండగా నేను ఆమె ఐదో నంబరు ప్రియుణ్ణి.ఇలా జన్మ జన్మల...”

***

ఇంటికిరాగానే అచలపతిని పిలిచి అనంత్ చెప్పేశాడు.

“ అచలపతీ, రెడీగా ఉండు. ఈ రాంపండు గాడు సహాయమో, గాడిద గుడ్దో అంటూ మళ్ళీ తయారవుతాడు చూస్తూండు " అని.

“ రాంపండు గారు మళ్ళీ ప్రేమలో పడ్డారా సర్ ? దేనితో ఇప్పటికైనా ఏభై మూడు సార్లయింది సర్ " “ మై గాడ్, ఏభై దగ్గర ఆపినా బాగుండేది.గుర్తుగా ఓ హాఫ్ సెంచరీ అనుకునేవాళ్ళం.ఇప్పుడు ఎ అర్ధనూటపదార్ల దగ్గరో అపుతాడు కాబోలు. వాడు వస్తే నేను లేనని...హలో రాంపండూ, మాటల్లోనే వచ్చేశావే...”

“ విన్నానురా మిత్ర ద్రోహీ...నేను వస్తే లేనని చెప్పిద్దామని కదా నీ యెత్తు.ఎక్కడున్నా వెతికి పట్టుకోగలడురా వీడు. అయినా అదంతా పక్కన బెట్టు.నా ప్రేమకథ టీవి సీరియల్ కాదురా.ఏళ్ళూ పూళ్ళూ సాగడానికి.ఇదే లాస్ట్ ఎపిసోడ్. నువ్వో ఉపకారం చేస్తే "

“ అదేమిటో చెప్పేస్తే నేనూ, పాఠకులూ కూడా తెరిపిన పడతాం "

“ చెప్తా. నేనూ ఊహా...అదేరా క్లబ్బులో అమ్మాయి అమ్మాయి పేరులే...తన డ్యూటీ అయిపోయాక కబుర్లు చెప్పుకుంటూ ఒకరి మనసులు మరొకరికి ఇచ్చిపుచ్చుకున్నామా ..?మీ ఇంటికి వస్తుంటే నా మనసులో ఒక అనుమానం వచ్చింది.ఇలాటి సంఘటన ఇంతకు క్రితం జరిగిందా అని. బహుశా పూర్వజన్మ వృత్తాంతమేమోనని అనుకుంటుండగా " అని రాంపండు చెప్తూ ఉండగానే.

“ నీ బొంద పూర్వజన్మా లేదు.పరజన్మా లేదు.ఆ పెసరట్ల సుబ్బి ప్రేమలో పడ్డావు కదరా నువ్వు.అదీ ఇలాటిదేగా.అక్కడ తిండి .ఇక్కడ తాగుడు.అమ్మాయిల లెవెల్ లో తేడా లేదు.అయినా సుబ్బిని ఎలా మర్చిపోయావురా ? దాని కోసమే నేను నేను కాదనీ, ఆ పుస్తకాలు రాసే ఆవిడ...పేరేమిటి చెప్మా...ఆ కల్పనారాణి. నేను ఆ కల్పనారాణి అని మీ బాబయ్య దగ్గర అబద్ధం చెప్పడం.అసలెలా మర్చి...” అని విరుచుకుపడ్డాడు అనంత్.

“ ఊరికే డైలాగులు అప్పజెప్పకు. నేను మర్చిపోయానని చెప్పానా ! అదంతా గుర్తుకు వచ్చిందని చెప్పబోతున్నాను.అందుకే మళ్ళీ నిన్ను కల్పనారాణి వేషం కట్టమంటున్నాను. మా బాబయ్య దగ్గరికి వెళ్లి....” ఆ పైన రాంపండు ఏం చెప్పాడో అనంత్ వినిపించుకోలేదు.అప్పటికే వణుకుతున్నాడు.

“ నో,నో...” అని అంటున్నాడు. ఇక రాంపండు వివిధ ఉపాయాలు మొదలు పెట్టాడు.

“ అనంతూ.మనం ఇద్దరం ఒకే స్కూలులో చదువుకున్నాం "

“ అది నా పొరపాటు కాదు.మా నాన్నది.నీలాటివాడు అదే స్కూలులో చేరతాడని ఊహించలేకపోయాడు "

“ పదిహేనేళ్ళుగా నేను నీ ప్రెండుని "

“ అది మాత్రం నా పొరబాటే !ఆ పాపానికే జన్మంతా అనుభవిస్తున్నాను " అది దొరకబుచ్చుకున్నాడు రాంపండు " ఒరేయ్, నీ జన్మ ఇంకా పూర్తికాలేదు.అందువల్ల నాకు సాయం చేయకతప్పదు " అన్నాడు గట్టిగా.

అనంత్ ఓడిపోయినట్టు తలవాల్చేశాడు " అయితే ఏం చేయాలంటావ్?” అడిగాడు.

“ సింపుల్. నీ నవల...అదే కల్పనరాణి నవల ఒకటి మార్కెట్లోకి కొత్తగా వచ్చింది.ఒకటి కొని కాంప్లిమెంటరీగా మా బాబాయ్ కి పంపు.ఆయనకు కల్పనారాణి నవలలంటే పిచ్చికదా!పైగా నువ్వే కల్పనారాణి అని ఇప్పటి వరకు పరిచయం చేశాడు.దెబ్బకీ గుమ్మైపోతాడు.లంచుకి పిలుస్తాడు.శుబ్బరంగా కడుపునిండా తిని, ఆ తర్వాత మీ రాంపండు ఫలానా ఊహ అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మీరు ఆశీర్వాదింపచేయండి అని చెప్పు "

“ సుబ్బి విషయంలో ఇదే జరిగింది.కల్పనారాణి నవలలు చదివి,ఆయన వంటావిడను` పెళ్లి చేసుకుని నీ నోట్లో కరక్కాయ కొట్టాడు.ఇప్పుడెవరిని చేసుకుంటాడు "

“ ఎవరినీ చేసుకోనివ్వదులే ఆ వంటావిడ.అదే మా కొత్తపిన్ని.ఇదీ వరకు ఇలా బార్ లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కర్ర పట్టుకునేవాడు. ఇప్పుడు కల్పనారాణి నవలల ప్రభావం వల్ల సులభంగా ఒప్పుకుంటాడు. పైగా సాక్షాత్తు నువ్వు.అంటే కల్పనారాణిని రికమెండ్ చేసినప్పుడు...!ఆయన అనుమతితో చేసుకుంటే నెలనెలా కాస్త డబ్బు ఇస్తాడురా.. ఈ ప్రయివేటు మాష్టారి ఉద్యోగాలు చేయలేక చస్తున్నానుకో " అని గొల్లుమన్నాడు రాంపండు.

ఆ బాధ చూడలేక అనంత్ సరేనన్నాడు. కల్పనారాణి కొత్త పుస్తకం కొని, చచ్చినట్టుగా చదివి దాన్ని మీద 'కల్పనారాణి 'పేరుతో ఆటోగ్రాఫ్ చేసి రాంపండు బాబయ్య గారయినా సింహాద్రి గారికి పంపాడు.అనుకున్నట్టే ఆయన వద్దనుంచి మూడోరోజులకే పిలువు వచ్చింది.అనంత్ ను చూడగానే సింహాద్రి గారు దండకం మొదలు పెట్టారు.

“ మీ కొత్త పుస్తకం 'లోకాన్ని ఎదురించిన లలిత ' మీరు పంపేనాటికి మూడుసార్లు చదివాను. అయినా మీరు ఎంతో ఆదరంతో ఫ్రీ కాఫీ పంపితే మళ్ళీ చదవకుండా ఉంటానా ? అసలు మీ పుస్తకాలు లోకం పట్ల నా దృష్టినే మార్చేశాయనుకోండి.అంత స్ట్రిక్టుగా ఉండేవాణ్నా ? ఇప్పుడు జనం పట్ల ప్రేమ, వాత్సల్యం, క్షమ ఉట్టిపడుతున్నాయనుకోండి " అందివచ్చిన అవకాశాన్ని అనంత్ వదలదలుచుకోలేదు.

“ ఆ జనంలో రాంపండు కూడా ఉన్నాడా ?” అన్నాడు చట్టున. బ్రేకు వేసినట్టు ఆగిపోయాడు సింహాద్రిగారు. “ వాడా ?” అన్నాడు. కాస్త ఆలోచించాడు.

“ ఓకే వాడూను...వాడు మాత్రం...సరే వాణ్ణి... కానీయండి. వాణ్ని కూడా క్షమిద్దాం...మీ అంతటివాళ్ళు రికమెండ్ చేశాక ...” అని గుండె చేత్తో పట్టుకుని " సరే...ఏం చేస్తాం ?” అని నిట్టూర్చాడు.

“ అయితే ప్రతీనెలా ఇంతని ఇస్తారా ? పాపం ట్యూషన్ల మీద పెద్దగా రావటం లేదు.ఎంతైనా మీ వంశం వాడు.” అన్నాడు అనంత్ ఆదుర్దాగా.

“ సరే, ఇద్దాం.ఇది వరకు ఇచ్చేవాణ్నిగా..” అన్నాడు ఆయన ఇంకేమీ అనలేక.

“ ఇదివరకంటే వేరు...ఇప్పుడు తను పెళ్లి చేసుకోబోతున్నాడు.ఖర్చులు పెరుగుతాయి.” అన్నాడు అనంత్ కోర్కెల నిచ్చెనలో పై మెట్టు ఎక్కుతూ.

“ పెళ్ళా ? ఎవరా అమ్మాయి ? “ అడిగాడు బాబాయ్.

" హోటల్లో పనిచేస్తుంది " అంతలావు సింహాద్రి గారూ ఉలిక్కిపడి లేచాడు.

“ నిజమా ? మా రాంపండులో ఇంత మంచి లక్షణం ఉందని నాకెప్పుడూ తెలీదు.అసలు అనుమానం కూడా లేదు.పద్దెనిమిది నెలలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే గ్రేట్ ! మీకు గుర్తుందా ఈ హోటల్ అమ్మాయి గురించే కదా వాడు మిమ్ముల్నిపరిచయం చేయడం. మీ స్నేహ భాగ్యం నాకు కలగడం" అంటూ పెద్దాయన ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోవడం చూసి అనంత్ కంగారు పడ్డాడు.

ఆ హోటల్ అమ్మాయి.ఈ హోటల్ అమ్మాయికీ మధ్య చాలా మంది ఉన్నారని చెప్పాల్సి వచ్చింది. అనంత్ ఇంటికి వచ్చిన కాసేపటికి రాంపండు వచ్చి పడ్డాడు.

“ ఏమయిందిరా ?” అడిగాడు. “ అలవెన్సు ఓకే కానీ పెళ్లి విషయంలోనే మొహం మాడ్చుకున్నారు ' చెప్పాడు అనంత్.

“ నువ్వు సరిగ్గా అడిగివుండవు " అన్నాడు రాంపండు.

“ పోనీ కదాని సాయం చేయబోతే ఇలాగే ఉంటుంది.నీ పెళ్ళికి ఆయన రాడు ఫో " అని కసురుకున్నాడు అనంత్.

“ ఆయన వచ్చేదేముంది నా బొంద !పెళ్లి అయిపోతేనూ " అన్నాడు రాంపండు ఆముదం తాగినవాడిలా మొహం పెట్టి.

తను బతికివుండగా రాంపండు పెళ్లి వార్త వింటాననే ఆశ పెట్టుకుని పాఠకుళ్ళా అనంత్ ఉలిక్కి పడ్డాడు. ఐదు నిమిషాల్లో కథంతా తెలిసింది.

రాంపండు తన బాబయ్య గురించి ఊహకు చెప్పేడట.

“ అయితే నన్నుతక్షణం గుళ్ళో పెళ్లి చేసుకుని మీ బాబయ్య దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి. లేకపోతే నా మీద ప్రేమ లేనట్టే " అని పట్టుబట్టిందట ఆ అమ్మాయి.

గత్యంతరం లేక ఎవరికీ చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవలసి వచ్చిందట. ఇందరు అమ్మాయిలను ప్రేమిస్తే అదే గతి ! అని అన్నా అనంత్ స్నేహితుడి దుస్థితి చూసి జాలి పడ్డాడు.

అతని అభ్యర్థన మన్నించి వాళ్ళ బాబయ్య దగ్గరికి వెళ్లి ఆయన కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చాడు.

రాంపండు వెంటనే ఎగిరి గంతేసి బయట వెయిట్ చేస్తున్న భార్యను పిలిచి అనంత్ కు పరిచయం చేశాడు. చూడపోతే హోటల్ అమ్మాయి చౌకబారుగా ఏమిలేదు.

మర్యాదస్తురాలిగా, చదువుకున్నదానిలా ఉంది.

" చెప్తేగానీ ఫలానా అని తెలియదు.అనవసరంగా చెప్పాం " అన్నాడు అనంత్.

“ చూడబోతే డబ్బున్నదానిలా వుంది. నా డబ్బెందుకు. అని అలవెన్సు పెంచకపోగా కట్ చేసేస్తాడు కూడా " అన్నాడు రాంపండు.

కాస్సేపటిలో అనంత్ సింహాద్రి గారి హాల్లో సతీసమేతంగా రాంపండు వరండాలో కాచుకున్నాడు.భార్య ఏదైనా మాట్లాడబోయినా కసురుకుంటున్నాడు.

సింహాద్రిగారి టీపాయ్ మీద 'లోకాన్ని ఎదిరించిన లలిత' పుస్తకం సగం తెరిచివుంది.ఆయన వచ్చేలోపున అనంత్ ఓ పేరా చదివేడు.లలిత జమీందారు భుజంగరావుని నిలదీస్తోంది.

' ప్రేమకెదురు నిలబడి సూర్యుడు ఉదయించలేడు.సముద్రం పొంగలేదు.చుక్కలు మెరవలేవు. జమీందార్, నువ్వు మానవమాత్రుడివి.మా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టాలని రాసి వుంటే విధినెదిరించడానికి నీవెవరివి ?' అని.

“ హలో అనంత్ గారూ.మళ్ళీ వచ్చారే ! ఇవాళ రెండుసార్లు మీ దర్శనం. మా అదృష్టం...” అంటూ సింహాద్రిగారూ హాల్లోకి వచ్చారు.

“ రావలసివచ్చింది.మీ రాంపండు నిర్వాకం వల్ల.పాపం...” అంటూ క్లుప్తంగా చెప్పాడు అనంత్.

ముసలాయనకి ఒళ్ళు మండింది.

అనంత్ కల్పనారాణి కాక మామూలు అనంతే అయి వుంటే తనని తగిలేసేవాడు.

ముక్తాయింపుగా అనంత్ తను అప్పుడే చదివిన ముక్కలు వల్లించాడు. గుర్తున్నంతవరకు...

“ సార్, మనం మానవమాత్రులం.వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించాలని రాసి పెట్టి వుంటే విధి నెదిరించడానికి మనం ఎవరం ? ప్రేమ నెదిరిస్తే సూర్య గ్రహణాలు జరగవు.నక్షత్రాలు రాలిపోవు....చంద్రుడేమో...”

“ ఆగండి అనంత్...నాకు గుర్తొచ్చింది.మీరు లోకాన్ని ఎదిరించిన లలత లోని డైలాగులు చెబుతున్నారు.నా వీక్ పాయింటు పట్టేశారు మీరు.కానీ నేను జమీందారు భుజంగరావులాటి వాణ్ణి కానండోయ్. నాకూ ప్రేమంటే తెలుసు.అందుకే వంటలక్కను పెళ్ళాడడానికి కూడా వెరవలేదు.రేపే రాంపండుని పంపండి.ఆశీర్వదిస్తాను" అన్నాడు సింహాద్రిగారు.

“ రేపటిదాకా ఆగనక్కరలేదు.మీ వంశాకురం వరండాలోనే వెయిట్ చేస్తున్నాడు.మీ మధ్య నేనెందుకు? వస్తా " అంటూ అనంత్ వరండాలో రాంపండుకి షేక్ హాండ్ ఇచ్చేసి పరుగు, పరుగున ఇల్లు చేరాడు.

ఇంకాస్సేపు వుంటే రాంపండు ఇంకేం పని చెబుతాడోనన్న భయంతో. తెల్లారి లేచేసరికి అచలపతి కబురు మోసుకొచ్చాడు.

రాంపండు వెయిట్ చేస్తున్నాడని వచ్చి చూస్తే ఎప్పట్లాగేనే ఏడుపుమొహం.

“ శుభమాని పెళ్లి చేయించి. మీ బాబయ్యను చల్లార్చిన తర్వాత కూడా ఈ ఏడుపు ఏమిట్రా ? మీ అంతటి జన్మదరిద్రుడిని ఎప్పుడూ చూడలేడు " అన్నాడు అనంత్ విసుగ్గా.

“ వినాయకుడు పెళ్ళికి అన్నీ విఘ్నాలే అన్నారు.నాకు పెళ్లి తర్వాత కుడా విఘ్నాలే !” అన్నాడు రాంపండు పళ్ళు గిట్టకరిచి.

“ విషయం చెప్పి ఏడు.లేదా ఏడ్చి విషయం చెప్పు " అన్నాడు అనంత్ చికాకు పెరుగుతుండగా. జరిగినది - రాంపండూ, ఊహా హాలులోకి వెళ్లారు.సింహాద్రిగారు అనంత్ కు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళను ఆశీర్వదించదానికి ఆక్షింతలు తెమ్మన్నాడు.

ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టడానికి వంగబోతున్న ఊహాకు టీపాయ్ మీద పుస్తకం కనబడింది. “ లోకాన్ని ఎదిరించిన లలిత " పుస్తకం చదివేరా అంకుల్ ? “ అంది ఊహా.

“ నాలుగు సార్లు" అన్నాడు ఆయన హుషారుగా.

“ చాలా సంతోషంగా ఉంది " అంది ఊహ.

“ ఎందుకు ? నీక్కూడా కల్పనారాణి నవలలు ఇష్టమా ?' అడిగాడు సింహాద్రి కుతూహలంగా.

ఊహ పగలబడి నవ్వింది. “ నా రచనలు నాకు ఇష్టం కాకపోవడమేం ?” అంది.

అక్కడున్న అందరికీ మతిపోయింది. ఇక్కడదాకా విన్న అనంత్ కీ మతిపోయింది.

“ ఆవిడే కల్పనారాణి అయితే మరి క్లబ్బులో ఆ ఉద్యోగం దేనికి ?” అడిగాడు.

“ హోటల్ వాతావరణంలో కొత్త నవల రాయబోతోందట.దానికీ మెటీరియల్ గురించి ఆ ఉద్యోగం చేస్తోందట.బీదదాని వేషంలో ఉన్నా నేను తనని ప్రేమించినందుకు ముగ్డురాలాయి పోయింది.వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకోమని అగ్నిపరీక్ష పెట్టింది.నేను దాంట్లో నెగ్గడంతో ఆనందంతో తలమునకలయి పోతోంది.హనీమూన్ టైములో ఈ విషయం చెప్పి నన్ను సర్ ప్రయిజ్ చేద్దామనుకుందిట "

“ మరింకేం,హేపీ ఎండింగేగా ?”

“ నీ బొంద హేపీ.ఊహ ఆ మాట అనగానే మా బాబయ్య మండిపడ్డాడు.కల్పానారాణి కలం పేరుతో రాసే ఆయన నాకు బాగా తెలుసు.నువ్వు బోగస్.అసలు హోటల్ ఉద్యోగం కూడా బోగస్సేమో !అలగాజనానికి అలాగా బుద్దులు ఎక్కడ పోతాయ్ ? అన్నాడు ".

“ ఊహ ఊరుకుందా ?” అనంత్ అడిగాడు.

“ ఎందుకూరుకుంటుంది ? పబ్లిషర్ల దగ్గర్నుంచి ఋజువులు చూపిస్తుందంట.తర్వాత పరువు నష్టం దావా వేస్తానంటోంది ".

“ అమ్మో! ఎందుకొచ్చిన గొడవ.నేనే ఆ వేషం కట్టేశానని చెప్పేస్తా "

“ ఉండరా త్యాగమూర్తీ, నిదానించి ఆలోచించు.ముందు మా బాబయ్యకు కోపం వస్తుంది. మనం ఇద్దరం కలిపి తనను పూల్ చేసామని మండిపడతాడు.నువ్వు దొరక్కుండా పోతావనుకో...నా అలవెన్స్ కట్...అదీ ఫరువాలేదు.అనుకోకుండా డబ్బున్నమ్మాయి నా భార్య అయింది.

కానీ ఆసలు గొడవ ఎక్కడ వస్తుందంటే కల్పనారాణి పేరు ఎక్కడ,ఎందుకు ఉపయోగించ వలసి వచ్చిందని ఊహ అడిగితే నేను ఇదివరకు సుబ్బిని ప్రేమించిన విషయం బయటకు వస్తుంది.దాంతో నేను ఫట్.అసలు ఊహ నన్ను ప్రేమించినదెందుకో తెలుసా ?

లోకంలో ఇప్పటివరకు నేను ఎవర్నీ ప్రేమించలేదని నేను చెప్పడం వల్ల.దాన్ని తను నమ్మడం వల్ల " ఊపిరి పీల్చుకోవడానికి ఆగాడు రాంపండు.

“ వార్నీ ఇంత అబద్దమా !? నాకు తెలిసి నీ లవర్స్ సంఖ్య ఆఫ్ సెంచరీ దాటి ఆర్నెల్లయింది " అని తెల్లబోయాడు అనంత్.

“ వెధవ లెక్కలూ నువ్వూనూ.అదంతా ప్రేమ కాదురా అంటే వినిపించుకోవు కదా !ఇంతకీ నేను గట్టెక్కే మార్గం చూడు.ఇప్పుడు నా దారేమిటి "

“ గోదారే " “ థ్యాంక్స్ రా.గొప్ప ఐడియా.అదీ ప్రాసతో " అన్నాడు రాంపండు కసిగా.

*****

మర్నాడు పొద్దున్నే ఫోన్. రాంపండు నుండి " అనంత్...అనుకున్నట్టే జరిగింది.ఊహ ఇచ్చిన ఋజువులు చూసి మా బాబయ్య కన్విన్స్ అయ్యాడు.తనే కల్పనారాణి అని ఒప్పుకున్నాడు.వాళ్ళిద్దరి మధ్య సంధి కుదిరింది " అని.

“ వెరీగుడ్ "

“ అప్పుడే గుడ్డేట్టకు.మా బాబాయ్ నన్నుపిలిచి జన్మలో తనతో మాట్లాడద్దన్నాడు.మనిద్దరం కలిసి తనను వెర్రి వెధవను చేసినందుకు కోపంగా ఉందన్నాడు.నా అలవెన్స్ కట్ చేసిన ప్రకటన జనాంతికంగా చేశాడు "

“ పాపం.ఐ యామ్ సారీ "

“ కంగారు పడకు ఆ సారీ నీకే ఉపయోగించుకో.ఆయన కొద్దిసేపట్లో మీ ఇంటికి వస్తున్నాడు. నువ్వే కల్పనారాణి అని ఎందుకు అబద్దం చెప్పావో సంజాయిషీ అడుగుతాడట "

“ చచ్చాం "

“ చావకు.ఇంకో విజిటర్ కూడా రాబోతోంది "

“ ఎవరు ?”

“ ఊహ ! తన పేరు ఎందుకుపయోగించు కున్నానని నిన్ను సంజాయిషీ అడగబోతోంది " అనంత్ కీ నోట మాట రాలేదు.

రాంపండు విచారం వ్యక్త పరచాడు.

“ సారీరా, వచ్చి తమాషా చూద్దామంటే నాకో అర్జంటు పని పడింది తర్వాతైనా వివరంగా చెప్పు. నువ్వు ఇద్దర్నీ ఎలా హేండిల్ చేశావో, వాళ్లమేం తిట్లు తిట్టారో...” విసుగుపెట్టి అనంత్ ఫోన్ పెట్టేశాడు.

ఆ తరువాత అనంత్ కీ.అచలపతికి జరిగిన అత్యవసర సమావేశంలో అనంత్ బొంబాయి పారిపోవాలని, పరిస్థితి చక్కబడ్డాకనే తిరిగి రావాలనీ నిర్ణయించబడింది.

బొంబాయి ట్రయిన్ టైము అయ్యేదాకా క్లబ్బులో రాక్కుంటానన్నాడు అనంత్.శరవేగంతో తయారయి ఇంట్లోంచి పారిపోయాడు.

బొంబాయిలో వారం రోజులుండే సరికి మొహం మొత్తింది అనంత్ కి.పైగా ఇంకో ఆలోచన ఒకటి అతన్ని తినేసింది.అసలు తప్పంతా రాంపండు గాడిది.చీటికీ,మాటికీ ప్రేమించడం ,తన చేత అబద్దాలు ఆడించడం వాడివంతు.కందిశీకుల్లా ఊరొదిలి పారిపోవడం తన వంతా ? నాన్సెన్స్ !వెళ్లి మొహాన్నే అడిగిస్తే సరి అనుకుని ఊరొచ్చి పడ్డాడు.

ఊరికి వస్తూనే స్టేషన్ నుంచే రాంపండు ఇంటికి వెళ్లాడు.తలుపు కొడితే తీసినది సింహాద్రి గారు.ఇద్దరి మధ్యా సయోధ్య ఎలా కుదిరిందాని అనంత్ తెల్లబోతే, అనంత్ ను చూసి సింహాద్రి గారు తెల్లబోవడమే కాదు, బెదిరిపోయాడు కూడా.

“ రాంపండు ఉన్నాడా ? " అని అనంత్ అడిగేలోపునే హడావిడిగా ధడాలున తలుపు మూసేశాడు. అనంత్ కి ఏమీ అర్థం కాలేదు.తనతో మాట్లాడాలన్న పెద్దమనిషి ఏమీ మాట్లాడక పోవడమేమిటి ? పైగా రాంపండు ఇంటికి రాకపోవడం ఏమిటి ? ఆలోచిస్తూ వస్తుండగానే వీధి మొగలో రాంపండు ఎదురయ్యాడు.

“ ఏరోయ్ కనబడ్డం మానేశావ్ ?ఊరెళ్ళావుట " అంటూ పలకరించాడు.

“ హుషారుగా కనబడతున్నావ్.నీ ప్రాబ్లెమ్సన్నీ సాల్వ్ అయిపోయాయా?” అని అడిగాడు అనంత్.

“ ఎప్పుడో !మన అచలపతి లేడూ !రెండు నిమిషాలలో సాల్వ్ చేసి అవతల పడేశాడు.ఇప్పుడు మా బాబాయ్.ఊహ బెస్ట్ ప్రెండ్స్ తెలుసా ? నాల్రోజులకోసారి వచ్చి సాహిత్యం గురించి కబుర్లు చెప్పి పోతూ వుంటాడు.”

“ ఇవాళా ఆ పని మీద వచ్చి వుంటాడు.ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్నాడు.అవునుగానీ మీ బాబాయ్ కేమైనా పిచ్చేమిట్రా ? నన్ను చూసి అలా హడిలిపోయాడేమిటి ?” రాంపండు హాయిగా నవ్వాడు.హడిలిపోడూ,పిచ్చాణ్ని చూస్తే ఎవరికైనా భయమే కదా !"

“ పిచ్చెవరికి?” అయోమయంగా అడిగాడు అనంత్.

“ నీకే, అందుకే నువ్వే కల్పానారాణివని మా అందరితోనూ...ముఖంగా నాతో చెప్పావు. నేను నమ్మాను. అదే మా బాబాయ్ తో చెప్పాను...”

“ ఇదెక్కడ అన్యాయంరా, నేనెక్కడ...”

“ అబ్బ, ఉండరా...అచలపతి ఐడియారా ఇది.నీకు హెల్యూసినేషన్స్ జాస్తి అని చెప్పమన్నాడు .స్క్రూ కాస్త లూజనమన్నాడు.బాబాయ్ కి అలాగే చెప్పాను.మనిషి పైకి బాగానే కనబడతాడే అంటూ నా మాట నమ్మడానికి సందేహించాడు.అచలపతికి చెప్తే శాండో షాలిని నాన్నగార్ని అడగమన్నాడు.

వాళ్ళ అబ్బాయి బుజ్జిని బ్రిజ్ మీద నుండి కాలవలోకి తోసేశాడా లేదా అని అడగమన్నాడు.అడిగితే ఆయన అవును నిజమే నన్నాడు. ఇక బాబయ్య నమ్మక చస్తాడా ?”

“ దుర్మార్గుడా, నువ్వు షాండో షాలినిని ప్రేమించబట్టే కదురా...నీ కోసం నేను వాణ్ని కాలవలోకి తోసినది.నాకు పిచ్చాడని ముద్రవేస్తారా ? అసలు ఈ వెధవ ఐడియా ఇచ్చినందుకు అచలపతి ననాలి.నీకు మాత్రం...ఒరే శాపం ఇస్తున్నా కాసుకో !నీ సంసార జీవితం మాత్రం సజావుగా సాగుతుందనుకుంటున్నావా ? నా ఉసురు పోసుకుంటావురా...” అనంత్ రొప్పుతున్నాడు.

-ఎమ్బీయస్ ప్రసాద్

(పిజి ఉడ్ హవుస్ రాసిన 'బింగో అండ్ ది లిటిల్ ఉమన్ ', ' ఆల్ ఈజ్ వెల్ ' కథల ఆధారంగా )