Gud Gud Guncham

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 

 

 

 

 గుడు గుడు గుంచం

జనార్ధన మహర్షి

అతని పేరు సత్యనారాయణ.నిన్నటి వరకూ బాగానే ఉన్నాడు.పాపం ఇప్పుడు ఓ పెద్ద సమస్యతో గింజుకుంటున్నాడు.ఇంతకీ అతనికొచ్చిన కష్టం ఏంటంటే...?

***

శుక్రవారం ఉదయం పదిగంటలకి పెళ్లి చూపుల్లో అతను సుబ్బలక్ష్మిని చూశాడు.బాగా నచ్చింది. ఎత్తు,రంగు, చదువు, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్,చివరికి కట్నం.దాంతో సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు.ఆ డెషిషన్ ని స్ట్రాంగ్ గా తీసుకుంటే, అసలు అతనికి సమస్య వచ్చేది కాదు.

అదే శుక్రవారం సాయంత్రం నాలుగింటికి ఇంకో సంబంధం చూశాడు.పేరు రాధిక.ఎత్తు,రంగు, చదువు,ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్,చివరికి కట్నంతో సహా...సుబ్బలక్ష్మి కి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది.

ఇప్పుడొచ్చింది సమస్య. సుబ్బలక్ష్మా..?, రాధికా...?.

భారతదేశంలో పుట్టిన నేరానికి అతను వాళ్ళిద్దర్లో ఒకరినే పెళ్లి చేసుకోగలడు.కానీ సమస్య ఏంటంటే...ఇద్దరూ నచ్చారు. ఇద్దర్నీ పెళ్లి చేసుకుంటే...తన్నులు తధ్యమని తెలుసు.దాంతో సుబ్బాలక్ష్మా...! రాధికా...! ఎవర్ని చేసుకోవాలి,ఏ రాయితో పళ్ళు రాలగొట్టుకోవాలనే కన్ ప్యూజన్ లో రాత్రి నిద్రపోవడం మర్చిపోయాడు.

అతని బ్యాడ్ లక్ ఏమిటో...ఇంటర్ లోనూ ఇదే ప్రాబ్లమ్...ఎం.పి.సి.నా...? సి.ఇ.సి.నా...?! ఉద్యోగంలోనూ ఇదే ప్రాబ్లమ్...ఎల్.ఐ.సి.నా...? ఎస్.బి.ఐ.నా...?! మళ్ళీ ఇప్పుడు అదే ప్రాబ్లమ్. ఎలాగైనా సరే-ఇవాళ సాయంత్రం నాలుగు గంటల కల్లా ఓ నిర్ణయానికి రావాలనే... నిర్ణయానికి వచ్చాడు ఆ రోజు.

బొమ్మయితే సుబ్బలక్ష్మి...బొరుసైతే రాధిక.కాయిన్ పైకి విసిరేశాడు. అది వెళ్లి...రోడ్డు మీదున్న ముష్టివాడి సత్తు డబ్బాలో పడింది. సత్యనారాయణ పరుగున వెళ్లి ఆ ముష్టివాడి డబ్బాలో చూస్తే నలబై రూపాయి కాయిన్స్ ఉన్నాయి. ఇరవై బొమ్మవైపు...ఇరవై బొరుసువైపు పడున్నాయి.

అంటే ఇరవై బొమ్మలు....ఇరవై బొరుసులు...ఇలా ఆలోచిస్తు కూచుంటే "ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా!?” అంటూ పాడుకోవలసి వస్తుందని తెగించి...తనసొంత బుర్రని ఉపయోగించి సొంత నిర్ణయం తీసుకున్నాడు. దాంతో అతనికి రాధికతో పెళ్ళయ్యింది.

***

పదేళ్ళ కాపురం చేసాక...అందరూ భర్తల్లాగే సత్యనారాయణకి జీవితం మీద పూర్తి విరక్తి వచ్చేసింది.కారణం రాధిక ప్రవర్తన (అని అంటాడతను)ఎప్పుడూ సినిమాలు,షికార్లు,అంటూ ఇంటి పట్టున ఉండకుండా చాలా జల్సాగా తిరుగుతుంది.షోకులు ఎక్కువ.సంసార పక్షంగా ఉండదు.దాంతో పాపం...చాలా బాధపడిపోతున్నాడు.

అప్పుడు అనుకున్నాడు. పదేళ్ళ క్రితం తీసుకున్న చిన్ననిర్ణయం...ఇంత ఘోరమైన శిక్షను అనుభవించేలా చేయటం అతనికి విపరీతమైన క్షోభని కలిగించింది. ఆ రోజు సుబ్బలక్ష్మిని చేసుకొని ఉంటే...తన బతుకిలా నీచంగా తయారయ్యేది కాదని తనలో తానే రోదించాడు.

సరిగ్గా అదే టైంకి టీవీలో అతి నీచమైన ప్రోగ్రాం వస్తోంది. అది చూస్తున్న సత్యనారాయణ చిరాకుపడి...రిమోట్ కంట్రోల్ తో ఛానల్ మార్చాడు. అదీ బోర్ కొట్టింది.మళ్ళీ ఛానల్ మార్చాడు.

ఇలా ఛానల్స్ పది మార్చాక టీవీకి రిమోట్ ఉన్నట్టే...లైప్ కి కూడా రిమోట్ ఉండి ఉంటే... నచ్చని ఛానల్స్ ని మారినట్టుగా...నచ్చని 'పెళ్ళామ్స్ 'ను కూడా మార్చుకోవచ్చు కదా..!అని అతను మనసు తెగపీకింది.వెంటనే ఆకాశాన్ని చీల్చుకుని ఓ రిమోట్ 'టప్ 'మణి వచ్చి సత్యనారాయణ ఒళ్లో పడింది.

ఉలికిపడి చూసేడతను. పైన ఆకాశంలో తధాస్తు దేవతలు... “ భక్తా...నీ బాధ తెలిసింది.అందుకే ఈ రిమోట్ పంపాం.నీకు రాధిక ఛానల్ బోరు కొట్టింది. కాబట్టి సుబ్బలక్ష్మికి వెళ్ళిపో...ఈ రిమోట్ నొక్కిన మరుక్షణం నువ్వు...ఆ శుక్రవారం పెళ్లి చూపులు చూసిన తర్వాత...డెసిషన్ తీసుకోవల్సిన టైంకి...మళ్ళీ వెనక్కి వెళుతున్నావ్.” అని చెప్పగానే...సత్యం ఎగిరిగంతేసి రిమోట్ నొక్కాడు.

మళ్ళీ ఈ కథ మొదటికి వచ్చింది.

ఇప్పుడు సత్యానికి సమస్య లేదు.అతనికి సుబ్బలక్ష్మి సంబంధం నచ్చేసింది.వెంటనే ఓ.కే. చేసేశాడు.దాంతో సత్యనారాయణ సుబ్బలక్ష్మి మొగుడయ్యాడు.

ఇది జరిగిన పదేళ్ళకి...సత్యం ఇంకా బాగా విరక్తి చెందాడు. సుబ్బలక్ష్మి ఎప్పుడూ డల్లుగా ఉంటుంది.దాంతో ఓ సినిమా లేదు.షికారు లేదు.షోకులు అసలే లేవు.ఓ పనిమనిషిలా ఉంటుంది. ఒంటిమీద బొత్తిగా శ్రద్ధలేదు.

ఇది సత్యం భరించలేక పోతున్నాడు. ఇప్పుడతనికి ఓ సుబ్బలక్ష్మి....ఓ రాధిక...కాదు. మరో వెంకటలక్ష్మి, ఒంకో కవిత కావాలి. పోనీ వాళ్ళయినా కరెక్టా...? ఏమో...తెలీదు...!

***

ఈ అసంతృప్తి ఒక్క సత్యనారాయణది మాత్రమే కాదు చాలా మంది మగాళ్ళకుండేదే !సౌందర్య, సిమ్రాన్,శ్రీదేవి,ఐశ్వర్యారాయ్...మనకు పెళ్ళాలెందుకు కారని...!? ఇదే కష్టం మగాళ్ళాకే కాదు. ఆడాళ్ళలకి కూడా.

చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,పవన్కళ్యాణ్...మన సొంతం ఎందుకు కారని...! ఒక్క పెళ్లి విషయంలోనే కాదు.ప్రొఫెషనలోనూ,హొదాలోనూ...అన్నింటిలోనూ ఇదే అసంతృప్తి.

" ఆ రోజు నేను మద్రాస్ వెళ్లి ఉంటే, సిన్మా హీరోని అయ్యేవాణ్ణి.ఖర్మ కొద్ది ఇలా బ్యాంక్ క్లర్క్ ని అయ్యానని " ఒక మల్లికార్జునరావ్.

“ ఆ రోజు క్రికెట్ కరెక్టుగా ప్రాక్టీస్ చేసి ఉంటే...ఇవాళ సచిన్ టెండూల్కర్ కంచం లాగేసుకునే వాడిని" ఒక ప్రణవానంద్.

ఇలా...ఓ రాంబాబు...ఓ సుబ్రమణ్యం...ఇంకో నారాయణ...ఓ లలిత...ఓ సుమిత్ర...మరో కైకేయిల కోరిక...

***

ఆంద్రా బ్యాంకులో అటెండర్ గా పని చేస్తున్న సుబ్రమణ్యానికి,తన ఉద్యోగం మీద (పై అందరిలాగే )విరక్తి వచ్చింది.

“ఎధవ ఉద్యోగం...ప్రతిరోజూ బ్యాంక్ మేనేజర్ చేతులమీదుగా చీవాట్లు తినాలి "అంటూ తెగబాధపడిపోయాడు. ఎప్పటికైనా బ్యాంక్ మేనేజర్ అయితే చాలని కలలు కన్నాడు.

***

వెంకటేశ్వరరావు...ఇతనే సుబ్రహ్మణ్యం కలలు కంటున్న బ్యాంక్ మేనేజర్.గత మూడేళ్లుగా అతనికి మేనేజర్ ఉద్యోగం మీద విరక్తి పుట్టింది.ఎన్నాళ్ళిలా...అతని కాలేజ్ మెట్ ఒకడు కలెక్టర్ అయ్యాడు.

అతడు...ఇతని పేపర్స్ ఇంటర్ లో కాఫీ కొట్టాడు.కాబట్టి ఆ కలెక్టర్ అంటే ఈ వెంకటేశ్వరరావుకి చాలా చులకన.కానీ తనకంటే పై పదవిలో ఉన్నాడు.అందుకే...వెంకటేశ్వర రావు రోజు గడ్డం గీక్కోవటం దగ్గర్నుంచి...రాత్రి బెడ్ ఎక్కేవరకూ కలెక్టర్ కాలేకపోయానని కుమిలిపోతూ ఉంటాడు.

***

హనుమంతరావ్...ఇతనే వెంకటేశ్వరరావు కుళ్లిపోయే కలెక్టర్.ఇతను గత సంవత్సరం నించీ...నిద్రాహారాలు మానేశాడు.పనిలో స్పీడు ఏ నిష్పత్తిలో తగ్గిస్తే తప్పులు కూడా ఆ నిష్పత్తిలో తగ్గుతాయి.

***

శ్రీనివాసరావు.ఇతనే హనుమంతరావు కోరుకునే మినిష్టర్.చాలా ఖర్చుపెట్టి,రిగ్గుంగులు చేసి , మర్డర్స్ చేసి మినిష్టర్ అయ్యాడు. ఇంత కష్టపడినా...సుఖం లేదు. ఏ నిర్ణయం తీసుకువాలన్నా-సి.ఎం.దే పవర్ అంతా.అందుకే అతను సి.ఎం.కావాలానుకుంటూ ఉంటాడు.

***

సి.ఎం. ఇప్పుడాయాన్ని వీరప్పన్ కిడ్నాప్ చేశాడు.అడవుల్లోకి తీసుకెళ్ళాడు.అన్నం పెట్టకుండా..గవర్ణమెంటుకి కొన్ని కండిషన్స్ పెట్టాడు.అడవిలో అనాధలా బతుకుతున్న సి.ఎం.కి తన వృత్తి మీద విరక్తి వచ్చి వీరప్పన్ లా అయితే ఎంత బాగుండేది అనుకున్నాడు ***

వీరప్పన్ అడవిలో పరుగెడుతున్నాడు.వెనక ఐజి రాయ్ చేజ్ చేస్తున్నాడు.

ప్రాణభయంతో పరిగెడుతున్న వీరప్పన్ అనుకున్నాడు "ఏమిటీ మనకీ ఖర్మ...మనం ఐజి రాయ్ లా అయిఉంటే ఎంత బాగుండేది.

***

ఐజి రాయ్ ఏ రోజూ నిద్రపోడు.పొతే...చచ్చిపోతానని భయం.ఎంతో మంది నక్సల్స్ అతన్ని చంపాలనే ప్రయత్నంలో ఉన్నారు. “హాయిగా ఏ బ్యాంకులోనో అటెండర్ అయి ఉంటే,ఈ కష్టాలేవీ తనకి ఉండేవి కాదుగా...” అని అందుకే ప్రతిరోజూ అతను అనుకునేది ఒకే చోట.

అలా ఆ ఐజి కోరుకున్న..ఆ అటెండర్ ఎవరు ? గుర్తొచ్చిందా ? సుబ్రహ్మణ్యం...ఇక ఆ సుబ్రహ్మణ్యం ఏం కోరుకున్నాడో...మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు.