Emergency Treatment

ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్

విద్యావతి

డాక్టర్ గారు ఓ పెద్ద ఆపరేషన్ చేసి ఇల్లు చేరేసరికి రాత్రి రెండుగంటలయింది.

ఇంటికి రాగానే భార్య విరుచుకు పడింది.

“ కిచెన్ లో కుళాయి లీక్ అవుతోందని చెప్పి నెల్లాళ్ళయింది. ఇప్పటిదాకా పట్టించుకోలేదు. నీళ్ళు లేక వంట చేయలేదు. ఏం చేస్తారో చేసుకోండి " అంది గట్టిగా.

భార్యను ఏమీ అనలేని డాక్టరు, ప్లంబర్ కు ఫోన్ చేశాడు.

మంచి నిద్రలోంచి లేచిన ప్లంబర్, ఎక్కడి నుండి అని నెంబర్ చూసుకున్నాడు.

అది డాక్టర్ ది అని తెలియగానే ఒళ్ళు మండిపోయింది.

“ ఏమిటి సార్ ! బొత్తిగా రాత్రి రెండు గంటలకు రోపేరు గురించి ఫోనా ?” అన్నాడు నిష్టూరంగా.

అసలే భార్య ఇచ్చిన షాక్ ట్రీట్ మెంట్ తో విసుగెత్తి పోయిన డాక్టరుకి ప్లంబర్ మాటలు చిరాకెత్తించాయి.

“ నువ్వు నాకు ఎన్ని సార్లు అర్ధరాత్రి ఫోన్ చేసి మెడిసిన్స్ అడిగావో గుర్తు తెచ్చుకుని మరీ మాట్లాడు " అన్నాడు.

“ అది ఎమర్జెన్సీ కదా "

“ ఇదీ ఎమర్జెన్సీయే. ఇంట్లో నీళ్ళు లేవు. మాకు తిండి తిప్పలు లేవు.” అన్నాడు మరింత కోపంగా డాక్టర్.

ప్లంబర్ కొద్దిసేపు ఊరుకుని " సరే, ఎలాగూ నిద్రలేపారుగా !ప్రాబ్లెం ఏమిటో చెప్పండి " అన్నాడు.

డాక్టర్ వివరించాడు.

అంతా విన్నాక ప్లంబర్ డాక్టర్ స్టయిల్లోనే చెప్పాడు.

“ ఓకే, మీరేం చేస్తారంటే...ఇంట్లో ఏస్పరిన్ మాత్రలు ఉంటాయిగా, రెండు మాత్రలు తీసుకుని లీక్ అవుతున్న పైపులో పడేయండి. ఇలా ప్రతీ నాలుగు గంటలకు ఒకసారి చేయండి.లీక్ ఆగిపోతుంది.ఒకవేళా పొద్దున్నకు కూడా ఆగకపోతే నేను ఆఫీసుకు రాగానే ఫోన్ చేసి చెప్పండి. లేదా పైపు పట్టుకు రండి. గుడ్ నైట్ " అని.

ఆశ్చర్యం తో నోరు తెరిచాడు డాక్టర్.