Binladen-Pendladen

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.


 

 

 

బిన్ లాడెన్ - పెండ్లాడేన్

జనార్ధన మహార్షి

ఆమె పేరు ఏదైనా...అందరూ ఆమెని 'దురదృష్టిణి 'అని పిలుస్తుంటారు.దానికి కారణం ఉంది.

ఆమెకి వయసొచ్చాక,పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు.

మొదటిసారిగా ఆమె పెళ్లి చూపులకి సిద్దం అవుతోంది.ఆమె అంతవరకు రాసిన మార్చి ఇంటర్ నీ, సెప్టెంబర్ ఇంటర్ నీ మించిన అతిపెద్ద, ఆఖరి పరీక్షలోకి ఎంటర్ అవుతున్న క్షణాలవి.

అతని పేరు ఏమైనప్పటికీ...పెళ్లి చూపులకి ఆమెని చూడటానికి బయలుదేరిన అతను దారిలో దారుణంగా యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు.

కేవలం, ఇంతే అయితే ఆమెని అందరూ పేరు పెట్టె పిలిచేవారు.కానీ...ఆ పెళ్లి చూపులు జరిగిపోయి అతను పోయిన కొన్నాళ్ళు తర్వాత ఆమెను సూపర్ బజార్లో చూసి తెగ ఇష్టపడిన ఇంకో అతను ఏకంగా తాంబూలాలు తీసుకోవడానికి సిద్దపడిపోయాడు.

ఆ విషయం తెలుసుకొని ఆమె పొంగిపోయింది.

మరో గంటలో...నిశ్చితార్థం అనగా అతన్ని ఫాక్షనిస్టులు గొడ్డలితో నరికారు.

కేవలం...ఇంతే అయితే ఆమెని అందరూ పేరు పెట్టె పిలిచేవారు.కానీ ఆ తర్వాత మళ్ళీ ఇంకో అతను వచ్చాడు.ఏ మూఢ నమ్మకాలు, జాతకాల మీద నమ్మకం లేని అతను ఆమె మెడలో తాళి కట్టాడు.

ఆ రాత్రి శోభనం అనగా...మల్లెపూలు తీసుకొస్తూ హార్ట్ ఎటాక్ వచ్చి పోయాడు.

అదిగో ఇది కూడా జరిగాక జనం ఖాళీగా ఎందుకు కూర్చుంటారు? అందుకే...ఆమెకు 'దురదృష్టణి'అని బిరుదిచ్చారు.

ఆమె కూడా ఆ బిరుదు తనకే కరెక్ట్ అని నమ్మింది.

అందుకే 'విధిలేని సన్యాసిని 'అవతారం దాల్చింది.

ఆమె కష్టం అలా ఉండగా..అంతకంటే పెద్ద కష్టం అమెరికాకి వచ్చింది.

ట్రేడ్ సెంటర్ కుప్ప కూలింది.బిన్ లాడెన్ వేట ప్రారంభమయ్యింది. అతను బ్రతికితే చాలా మందికి ప్రమాదం.కానీ అతను మృత్యుంజయుడని అన్ని దేశాలు నమ్ముతున్నాయి.

అతని దారుణాల్ని...ఆమె ఓ రోజు పేపర్ లో చదివింది.

లాడెన్ గురించి బాగా అర్థం చేసుకొంది. సరిగ్గా నెల తిరక్కుండా..." లాడెన్ చనిపోయాడు " అనేది సంచలన వార్త. అన్ని పేపర్లు ప్రముఖంగా రాశాయి.

ఎందరో సంతోషించారు అతన్ని కన్నదేశం తప్ప.

అన్ని దేశాలు పండుగ చేసుకున్నాయి.ఆ ఆనందంలో అతను అసలు ఎలా చనిపోయాడో ఎవ్వరూ పట్టించుకోలేదు.కానీ అతను అర్జంట్ గా చనిపోవడానికి కారణం...'బిన్ లాడేన్-పెళ్లాడేన్'.

అర్థం కాలేదు కదూ...?.

'దురదృష్టిణి ' లాడెన్ కి చాలా మంది పెళ్లాలున్నారన్న విషయం తెలుసుకుంది. అతను 'ఆడ వీక్ ' గాడని అర్థం చేసుకొని...అతి కష్టం మీద వెళ్ళింది.ఎవ్వడి కంటా పడని 'అతడి కంట 'ఆమె పడింది.

ఒప్పించి పెళ్లి చేసుకొంది.

అందుకే బిన్ లాడెన్ చనిపోయాడు.

ఆమెని ఇప్పుడు 'దురదృష్టిణి ' అని ఎవరైనా పిలిస్తే వాళ్ళ శవం లేస్తుంది.

ఇంకో విషయం.ఎవరైనా అన్యాయం చేశారో...ఖబడ్దార్.

ఆమె గుట్టుగా పెళ్లి చేసుకుంటుంది.

అంత మంచి ఆమెని ఏమైనా చెయ్యండి...కానీ.''దీర్ఘ సుమంగళీభవ ''అని మాత్రం ఆశీర్వదించకండి.