Telugu Funny Conversation

Telugu Funny Conversation

విశేషాలేంటి అని అడిగినందుకు...

సుధీర్ : హాయ్! బావున్నారా?

శేఖర్ : హాయ్! బావున్నాను.. నువ్వెలా ఉన్నావు?

సుధీర్ : నేను చాలా బావున్నానండి. చెప్పండి ఏంటి సంగతులు??

శేఖర్ : ఏముంటుంది.. అంతా రొటీనే..

సుధీర్ : అదేమిటి ? మీ దగ్గర విశేషాలు లేకుండా ఉంటాయా?

శేఖర్ : వారం నుండి అనుకుంటూ ఇవాళ గబ్బర్ సింగ్ సినిమా చూసా. సూపర్

ఉందనుకో. ముఖ్యంగా ఆ అంతాక్షరి. అసలైతే నేను దానికోసమే సినిమాకెళ్లాను కాని

ఇంటికొచ్చాక చూస్తే అది నెట్‌లో కనిపించిది.

సుధీర్ : అయ్యో అలాగా....

శేఖర్ : అనవసరంగా రెండొందలు ఖర్చుపెట్టా అనిపించింది. ఇక మే నెల

చివరికొచ్చింది కదా ఆవకాయ పెట్టాలి. మా ఆవిడతో చెప్పి వచ్చేవారం పెట్టించేయాలి...

చెప్తే నమ్మవుగాని జూన్ వచ్చేస్తుందంటే గుండె దడదడగా ఉంటుంది. అసలు ఈ నెలంతా

ఖర్చులే అనుకో. పిల్లల డ్రెస్సులు, బాగులు, పుస్తకాలు, పెన్నులు, గొడుగులు...

మర్చిపోయా.. నీకో విషయం చెప్పనా?

సుధీర్ : ఏమిటో అది ?

శేఖర్ : సురుచి వాళ్ల అబ్బాయికి ఆరునెలల క్రింద పెళ్ళి చేసారు కదా. ఆ కోడలు బాగా

చదువుకున్నదైనా చాలా ఖతర్నాక్ అంట. తనిష్టం ప్రకారమే అమెరికాలో కాపురం

పెట్టినా కూడా మొగుడిని కాల్చుకు తింటుందంట. పిల్లాడు బెంబేలెత్తిపోయి

ఏడుస్తున్నాడు. నాకేంటీ ఖర్మ అని.. ఇక మన కాలేజ్ ఫ్రెండ్ సుబ్బారావు తెలుసు కదా.

వాడిప్పుడు కోటీశ్వరుడయ్యాడు. వాడి బంగళా చూడాలి. ఇంద్రభవనం అనుకో. పెద్ద

బిజినెస్‌మాన్ అయ్యాడంట. వాడి పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారంట. కూతురు

పెళ్లికెదిగి ఉంది. మంచి సంబంధాలు ఉంటే చూడమన్నాదు. మనవాళ్లలో ఎవరైనా

ఉన్నారా?

ఇలాంటి కుబేరుడి కూతురంటే లక్ష్మీ దేవి ఇంటికొచ్చినట్టే కదా. నా కొడుకులు

చిన్నవాళ్లు. లేకుంటే నేనే మాట్లాడుకునేవాడిని. మా చెల్లెలి కొడుకు ఉన్నాడు కాని పదేళ్ల

క్రింద ఆస్తి విషయంలో గొడవలొచ్చి మాకూ మాకూ మాటల్లేవులే. అందుకే నీకు

చెప్తున్నా. మా ఆఫీసులో లోన్ తీసుకుని కార్ తీసుకుందామనుకుంటున్నాను.

ఏమంటావ్. ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సుల్లో వెళ్లలేము. ఆటోల్లో వెళ్లాలంటే తడిసి

మోపెడవుతుంది. ముఖ్యంగా ఏదైనా పెళ్లిళ్లు, పార్టీలకు వెళ్లాలంటే చాలా ప్రాబ్లమ్స్

వస్తున్నాయి. పిల్లలు కాలేజీలకు వస్తే లక్షల్లో ఫీజులు కట్టాలి. ఇక వేరే ఏం కొంటాం

చెప్పు? దానిలోపలే ఈ అప్పు తీర్చేసుకుంటే మంచిది కదా. ఇంతకూ నీ సంగతి చెప్పావు

కాదు. ఎలా ఉంది ఉద్యోగం? నీకేంటి నాయనా! కూతురి పెళ్లి చేసావ్. కొడుకు మంచి

ఉద్యోగంలో ఉన్నాడు. ఎంచక్కా ఏ చీకూ చింతా లేకుండా మహారాజులా ఎంజాయ్

చేస్తున్నావ్... అని అంటూ సుధీర్ ముఖంలో మారుతున్న వివిధ రకాల మార్పులను గమనిస్తూ ( రోగం కుదిరింది. ఎప్పుడు పలకరించినా విశేషాలేంటి అంటాడు. ఇక్కడ

పనీపాటా లేకుండా అందరికి చెప్పడానికి విశేషాలు దాచుకుని కూర్చుంటాం

అడగ్గానే చెప్పడానికి...నాకు తెలిసి మళ్లీ నా దగ్గరకు రాడు..) అని మనసులో

అనుకున్నాడు శేఖర్.

*******

జీవితం మీద విరక్తి కలిగిన వాడిలా ముఖం పెట్టిన సుధీర్ : ఓరి దేవుడో! తిన్నదరక్క

విశేషాలేంటి అని అడిగా. నాకిలా జరగాల్సిందే.. బుర్రలో తుప్పంతా

వదిలిపోయింది. మళ్లీ వీడి చుట్టుపక్కలకు రాను. పలకరించను. అని మనసులో

అనుకుని పరుగులు తీశాడు.