“షూ” టింగ్

 

“షూ” టింగ్

-పద్మశ్రీ

రాక రాక హైదారాబాదు వచ్చాడు ఓ పల్లెటూరి బైతు... అతనికి సినిమా షూటింగులు ప్రత్యక్షంగా చూడాలని మహా సరదా....

అందుకే అన్నపూర్ణా స్టూడియో గేటు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఎంత ప్రయత్నించినా లోనికి పంపించని సెక్యూరిటీ గార్డులని పల్లెటూరి నాటు భాషలో కచ్చగా తిట్టుకున్నాడు. హీరోలని ప్రత్యేకంగా చూడాలని, సినిమా షూటింగ్ ని తిలకించాలని ఎంతో ఆశతో ఉన్న అతనికి నిరాశే ఎదురుకావడంతో బాధగా అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.

అలా కొద్ది దూరం వెళ్ళగానే అతని కాళ్ళకి బ్రేకులు పడ్డాయి. మొహంలో విపరీతమైన సంతోషం ప్రత్యక్షమయింది. దానికి కారణం.... కొద్ది దూరంలో ఏదో షూటింగ్ చూసి తన ముచ్చట తీర్చుకోవాలని పంచెని రెండు చేతుల్తో ఎత్తిపట్టి ఒక్క లాంగ్ జంప్ తో అక్కడికి చేరుకున్నాడు. అదో పెద్ద ఇల్లు...

ఆ ఇంటి ఎదురుగుండా ఓ వందమంది దుండగులు వీరావేశంతో కొట్టుకుంటున్నారు.... ఆ దృశ్యాలని కెమెరాలతో ఎంతో అద్భుతంగా చిత్రీకరిస్తున్నాడు ఓ కెమెరామెన్....

ఆ పక్కనే పోలీసులు కూడా కళ్ళని ఇంతింత జేసుకుని ఆ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు కానీ, వాళ్ళ జోలికి మాత్రం పోవటం లేదు...

ఆ సీన్ చూస్తుంటే పల్లెటూరి బైతుకి ఎంతో ఆనందం వేసింది..... ‘అబ్బబ్బబ్బ.... షూటింగ్ అద్దిరిపోయింది... అబ్బో... అందరూ షానా మంచిగ యాక్టింగ్ జేస్తుండ్రు.... అబ్బబ్బ... ఇరగదీస్తుండ్రు....’ సంతోషంతో చప్పట్లు కొడుతూ అనుకుంటున్నాడు పల్లెటూరి బైతు.

అతని పక్కనే నిలబడ్డ ఓ యువకుడు అతని వంక సీరియస్ గా చూశాడు. అతని గురించి పట్టించుకోని పల్లెటూరి బైతు తన ఆనందంతో తానున్నాడు.

దుండగులు ఒకటిపై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్నారు... మరి కొందరు ఆ ఇంట్లోకి జొరబడి అక్కడి వస్తువులని చిందర వందర చేస్తున్నారు...

పల్లెటూరి బైతుకి ఆనందమే ఆనందం.... ‘అబ్బబ్బ... ఎంతబాగా జేస్తుండ్రు... ఇయ్యన్నీ సీనిమలనే జూసిన.. కానీ ఇప్పుడు కళ్ళారా జూస్తుండ... అబ్బబ్బ.. ఇరగదీస్తుండ్రు... ఈ బొమ్మ రిలీజున మొదటాటనే జూస్త.... బ్లాకులో టికెట్ తీసుకునయినా సరే...’ ఆనందంతో రంకెలు వేస్తున్నాడు పల్లెటూరి బైతు. ఈసారి ఆ యువకుడు మరింత సీరియస్ గా చూసాడు...

ఎక్కడి నుండో మరో గ్యాంగు ప్రత్యక్షమయింది... అంతే... అక్కడ పెద్ద రగడ ప్రారంభమయింది... అందరి చేతులోనూ ఇనుపరాడ్లు ప్రత్యేకమయ్యాయి... ఒక్క సారిగా అక్కడ యుద్ద వాతావరణం నెలకొంది. తలలు పగులుతున్నాయి.. శరీరాలకు గాయాలవుతున్నాయి.. రక్తం నేలని తడుపుతుంది...’

పల్లెటూరి బైతుకి మరింత ఆనందం... “హమ్మో... హమ్మో... హమ్మో... యెంత బాగా జేస్తుండ్రో... నిజంగానే కొట్టుకుంటున్నంతగా యాక్టింగ్ జేస్తుండ్రు... అర్రె... నిజంగానే రక్తం వస్తున్నట్లు నటిస్తుండ్రు... అబ్బ... ఈ సినిమా సూపర్హిట్టు... యాడాది పాటు ఆడుద్ది.” పల్లెటూరి బైతు మాటలకి ఈసారి పక్కనే ఉన్న యువకుడికి చిర్రెత్తుకొచ్చింది...

“ఏమయ్యా... ఇందాకట్నుండి చూస్తున్న.... ఆ అరుపులేంటయ్యా...” అన్నాడు కోపంగా.... “ఏమయ్యో... ఇవ్వి అరుపులు గాదు... ఎన్నాళ్ళనుండో సీనిమా షూటింగు జూడాలనుకున్న... ఇయ్యాల తీరింది... గందుకే ఆనందంతో అరుస్తున్న” అన్నాడు ఆనందంగా....

“ఇది సినిమా షూటింగ్ కాదయ్య...” చిరాగ్గా అన్నాడు యువకుడు.. “సీనిమా షూటింగ్ గాదా... పల్లెటూరోనన్ని నా చెవిల మక్కజొన్న పొట్టు పెట్టాలనుకుంటున్నవా యేంది.. సినిమా షూటింగ్ గాకపోతే, గా పోరగాళ్ళు అట్ట కొట్టుకుంటుంటే గా కెమెరా తో షూటింగ్ ఎందుకు దీస్తుండ్రు.... గా పోలీసులు కూడా ఈ లడాయి ఆపక కళ్ళు ఇంతలా జేసి ఎందుకు జూస్తుండ్రు” అన్నాడు...

“ఈ ఇళ్ళు ఓ పొలిటికల్ లీడర్ దన్నమాట... ఈయనఅప్పోజిషన్ లీడర్ ని తిట్టాడట... అందుకు కోపగించిన ఆ అప్పోజిషన్ లీడర్ కార్యకర్తలు వచ్చి ఇక్కడ ఇలా నిరసనలు తెలుపుతున్నారన్న మాట... తన లీడరుకి వెంటనే క్షమాపణ జెప్పాలని వాళ్ళు డిమాండ్ జేస్తున్నారన్న మాట... ఇదంతా టివీ చానెల్స్ లలో రావడం కోసం వాళ్ళే ఓ వీడియో గ్రాఫర్ తో దీన్నంతా చిత్రీకరిస్తున్నారు ఇది సినిమా షూటింగ్ కాదు” ఆ యువకుడు చెప్పిన మాటలకి పల్లెటూరి బైతు షాకైపోయాడు.

నేటి రాజకీయాలు వీధినపడి ఇలా బీభత్సం సృష్టిస్తుంటే అదో సినిమా షూటింగని ఆ పల్లెటూరి బైతు భ్రమించడంతో తప్పేముంది...

ఎందుకంటే ఇలాంటి సీన్లు సినిమాలలోనే తప్ప, నిజజీవితంలో జరుగుతాయని ఊహించని ఆ రైతు హమ్మో... ఈ హైదరాబాదుకో దండం.... అంటూ తన పల్లెటూరికి పరారయిపోయాడు... అదండీ సంగతి...!