Aahanagar Colony 17

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

17 వ భాగం

ముదనష్టపు పార్క్ కళకళ లాడిపోతోంది. బాయ్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఏజ్ ప్రేమికులు ఆ పార్క్ లో అటు, ఇటు ఉత్సాహంగా తిరుగుతున్నారు. ఆ పార్కులో భార్య భర్తల సంఖ్య చాలా తక్కువ.

సెకండ్ సెటప్ పెట్టిన వాళ్లు, ప్రేమించుకుంటున్న వాళ్ళ సంఖ్యే ఎక్కువ అక్కడ. పల్లీ, బఠానీ, టైంపాస్ బఠానీ,...అని ఓ కుర్రాడు....ఐస్ ఫ్రూట్...మీ ప్రేమలా కరిగిపోయే చల్లటి ఐస్ ఫ్రూట్ అని మరో కుర్రాడు. వేడి వేడి పకోడి అని యింకో కుర్రాడు....రకరకాల మాడ్యు లేషన్ స్తో అరుస్తున్నారు.

ఎవరికి వారు వాళ్ళ ప్రేమలో డీప్ గా మునిగిపోయారు. చిన్న చిన్న పొదలు...వున్నాయ్. ఓ కుర్రాడు కండోమ్స్....కండోమ్స్...ఫ్రెష్ కండోమ్స్...అంటూ అరుస్తున్నాడు. మధ్య మధ్య పొదల్లోకి తలపెట్టి అరిచి మరీ, పొదల్లో వున్న వారికి కండోమ్స్ గురించి ప్రచారం చేస్తున్నాడు.

ఎంట్రన్స్ దగ్గర పావాలా ఇచ్చి, టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చాడు సాకేత్. అతనికి పార్క్ పేరే విచిత్రంగా తోచింది. ముదనష్టం పార్క్ ఏమిటి? అనుకున్నాడు. జంటలు జంటలు కనిపించాయి. ముసలవాళ్ళు కూడా చెట్టాపట్టాలేసుకొని అక్కడికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు.

అతనికి హైదరాబాద్ లో ఇందిరాపార్కు లో చూసిన సంఘటనలు గుర్తొచ్చాయి. అక్కడయింతే ....కాకపోతే పేరుకు ముదనష్టం పార్క్ అయినా నీట్ గా వుంది. పార్క్ లో కండోమ్స్ అమ్మడం ఆశ్చర్యం అనిపించింది. అదే విషయాన్ని కండోమ్స్ అమ్మే కుర్రాడ్ని అడిగాడు.

అతడో పిచ్చి లుక్కేసి.... "పార్క్ లోనే కదా సార్....ఇలాంటి వాటి అవసరం ఎక్కువ....మీకో విషయం తెలుసా....ఇక్కడికి ఎక్కువగా లవర్స్, ఓల్డ్ ఏజ్ వాళ్లు, అమ్మాయిలను వెతుక్కునే అబ్బాయిలు, అబ్బాయిలను వెతుక్కునే అమ్మాయిలు వస్తారు. ఎలాగూ బేవార్స్ పనులే చేస్తారు. అలాంటప్పుడు కండోమ్స్ అమ్మామనుకో....ఎయిడ్స్ అరికట్టినట్టు ఉంటుంది. మరో వైపు భవిష్యత్తులో వాళ్ళని ప్రెగ్నెన్సి ప్రాబ్లం వచ్చి, ఆత్మహత్యల్లాంటి పనులు చేయకుండా కాపాడినట్టూ వుంటుంది." ఆ కుర్రాడి వంక చూసాడు విభ్రమంగా సాకేత్.

"ఇంత చిన్నవయసులో, ఎంత జనరల్ నాలెడ్జి....నీ ఫోటోని దేశంలో ఉన్న పార్క్ లన్నింటిలోనూ పెట్టాలి." మనసులో అనుకున్నాడు.

"కండోమ్స్....కండోమ్స్...అని అరుచుకుంటూ వెళ్తూనే వున్నాడా కుర్రాడు.

గుడ్డిమెల్ల....అంటే ఇదే కాబోలుననుకున్నాడు సాకేత్. పార్క్ అంతా తిరిగి రావలనుకొని నిర్ణయించుకున్నాడు రకరకాల జంటలను చూస్తున్నాడు. అతనికి చిత్రంగా అనిపిస్తోంది.

విచిత్రమైన క్యారెక్టర్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రియుడి ఒళ్లో తల పెట్టుకుని ప్రియురాలు......ప్రియురాలు ఒళ్ళోతల పెట్టుకుని ప్రియుడు.

కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్య చిలిపిపనులు చేసుకుంటూ.... ఓ పదేళ్ళ తర్వాతో, ఇరవైఏళ్ళ తర్వాతో, వాళ్లు తిరిగి ఇక్కడ వచ్చి, ఈ జ్ఞాపకాలను నెమరువేసుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచన కలిగింది సాకేత్ కు.