రేపటి పౌరులు

 

                                                           

                                                                                                           యర్రం శెట్టి శాయి

మా కాలనీ వారపత్రిక మూసేసిన తర్వాత కాలనీ రచయితకూ, కవులకూ, అందరికీ మామీద చాలా కోపం వచ్చింది. “మేం ఉండగా వాళ్ళూ వీళ్ళతో ఎవర్రాయించమన్నారు? ఆ పాటి మేము రాయలేమా?” అంటూ ఎదురు తిరిగారు. ఏమయినాసరే మళ్ళీ పత్రిక పెట్టాల్సిందే అంటూ మొండికేశారు. ఆ గొడవల్లో మునిగి తేలుతుండగా కాలనీలో ఇంకో హడావుడి ప్రారంభమయింది హఠాత్తుగా. శ్యామల్రావ్ వాళ్ళింటి వెనుకే పెద్ద రేకుల షెడ్డు కట్టించాడు వారం రోజుల్లో. మాకందరికీ అనుమానం, ఆత్రుత ఎక్కువయిపోయి కొంపలు ముంచే కార్యక్రమం ఏదో చేపట్టాడని అర్థమయిపోయింది.

డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి మామూలుగానే తన రహస్య పరిశోధన ప్రారంభించి రెండు రోజుల్లో మాకు రిపోర్ట్ అందించింది. దాని షేడ్స్ లో ‘హెల్మెట్స్’ తయారు చేసే మిషనరీ పెట్టాడుట. హెల్మెట్స్ కి అసలే మాత్రం డిమాండ్ లేదు ఆంధ్రప్రదేశ్ లో. మరి ఆ ఫాక్టరీ ఎందుకు పెట్టినట్లు అని ఆలోచించాం గానీ మాకేమీ అర్థం కాలేదు. మరో నెలరోజులు గడిచేసరికి మా కాలనీలో చాలా ఇళ్ళల్లో గదులు సబ్ లెట్ కి తీసుకుని వాటినిండా వేలకు వేలు హెల్మెట్స్ తో నింపే మా అందరకు శ్యామల్రావ్ ఓ జోక్ అయిపోయాడు. రోజూ సాయంత్రం అందరం కలిసి ఫాక్టరీ కెళ్ళి అతని పిచ్చి, అతి తెలివితక్కువతనం చూసి చతురోక్తులు వేసిరావడం జరుగుతుంది.

అసలు అతనికి ఆ ఫాక్టరీ పెట్టడానికి బాంకులెలా అప్పులిచ్చాయో! బహుశా ఎప్పుడూ దివాలా తీసే సంస్థలకే అప్పులిచ్చే అలవాటు చొప్పున శ్యామల్రావ్ కి కూడా ఇచ్చి ఉంటారని అనుకున్నాం. శ్యామల్రావ్ మాత్రం మేమేమన్నా చిరునవ్వుతో సహిస్తున్నాడు “అంతా ఆ పరమాత్ముని దయ? ఈ బిజినెస్ లో నన్ను నీట ముంచినా, పాల ముంచినా అంతా వాడిష్టం. ఆ పరమాత్ముడే మొన్న కలలో కలబడి ‘ఒరే శ్యామల్రావూ! హెల్మెట్స్ లేక జనమంతా స్కూటర్ యాక్సిడెంట్స్ లో పోతున్నారు. వాళ్ళ కోసం హెల్మెట్స్ తయారు చేసి ఆదుకో’ అన్నాడు! అందుకే దేవుడిమీద భారం వేసి మొదలు పెట్టాను” అంటూ నవ్వాడు.

“తెలివితక్కువ వెధవ! వీడి కథలు విని మనమంతా హెల్మెట్స్ ఎగబడి కొనుక్కుంటా మనుకుంటునట్లున్నాడు! ” అన్నాడు శాయీరామ్. “చూస్తూండు! కొనేవాడు లేక చివరకు మన కాలనీ పిల్లలంతా ఆడుకోటానికి ఉపయోగిస్తారవి” అన్నాడు రంగారెడ్డి. “మన కాలనీ వాళ్ళంతా ఇప్పుడే కొనుక్కోండి. కన్సెషన్ ధరలో ఇస్తాను” అన్నాడు శ్యామల్రావ్. “శ్యామల్రావ్! నీ వ్యాపారం బయటేవరిమీదయినా ప్రయోగించు! మా దగ్గర కాదు” అన్నాడు గోపాల్రావు పగలబడి నవ్వి. “మీ ఇష్టం! ఆ పరమాత్ముడి ఆదేశం మీద నేను అందరినీ బ్రతిమాలుతున్నాను” అనేసి వెళ్ళిపోయాడు చిరునవ్వుతో. మర్నాడు న్యూస్ పేపర్స్ చూస్తూనే అందరం ఉలిక్కిపడ్డాం “స్కూటరు, మోటార్ సైకిళ్ళు ఉన్నవారంతా ఫలానా తారీఖుకల్లా హెల్మెట్స్ ధరించాలి - అంటూ ప్రభుత్వ ప్రకటన చూసి, అందరం నిశ్చేష్టులమయ్యాం. అప్పటికప్పుడే కాలనీలో స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు ఉన్న వారంతా సమావేశం జరిపాం. “ఇది అన్యాయం! అక్రమం!” అన్నాడు :లేకపోతే ఏమిటి? చాలా దేశాల్లో హెల్మెట్స్ వల్ల హాని కలుగుతోందని, వాటి వాడకాన్ని నిషేధిస్తూంటే మనదేశంలో వాటిని కంపల్సరీ చేయడంలో అంతరార్ధం ఏమిటి?” అన్నాడు రంగారెడ్డి. మేం మాట్లాడుతూండగానే శ్యామల్రావ్ ఇంటిముందు క్యూ ప్రారంభమయింది.

మరికాసేపట్లో ఆ ‘క్యూ’ మా కాలనీలో రోడ్డువరకు శ్యామల్రావ్, వాళ్ళబ్బాయ్ ఇద్దరూ కలిసి హెల్మెట్స్ అమ్మకాలు ప్రారంభించారు ఆనందంగా. మేం ఉక్రోషంగా ప్రభుత్వానికి ఓ అర్జీ తయారుచేశాం. హెల్మెట్స్ వాళ్ళ ఉపయోగమేమీ లేదని చాలా దేశాలు గ్రహించాయ్ గనుక నిబంధనను రద్దు చేయాలనీ అందులో కోరి సంతకాలు చేసి ముఖ్యమంత్రికి పంపించాం. పదిహేను రోజులయినా దానివల్ల ఏమీ ఉపయోగం కనిపించక పోయేసరికి మాలో ఒక్కొక్కరు వెళ్ళి శ్యామల్రావ్ ఇంటిముందు క్యూ కట్టారు. తీరా హెల్మెట్ కొనబోయే సమయానికి దాని ధర నాలుగొందలయిపోయింది శ్యామల్రావ్ దగ్గర. “ఇది అన్యాయం! మొదట్లో నువ్ రెండొందలకేగా ఇస్తానన్నావ్” అన్నాడు గోపాల్రావ్ కోపంగా. “అప్పుడు రిబేటులో అమ్మాను. ఆ గడువయిపోయింది.

అదీగాక ముడి పదార్థాల ధరలు పెరిగాయ్ ఈ వారం రోజుల్లోనూ” చిరునవ్వుతో చెప్పాడతను. ఆరోజు సాయంత్రమే నాలుగొందలు అప్పు పుట్టక జనార్ధన్ తన మోటార్ సైకిల్ అమ్మేశాడు. పాత స్కూటర్లున్న మా కాలనీ వాళ్ళు హెల్మెట్స్ కొనడం కంటే స్కూటర్లు అమ్మటమే మంచిదని నిశ్చయించుకున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే శ్యామల్రావ్ బంజారాహిల్స్ లో ఓ పెద్ద భవనం కొన్నాడన్న వార్త తీసుకొచ్చింది రాజేశ్వరి. దాని పేరు నివాస్” అని పెట్టాడట. హెల్మెట్స్ గొడవ సద్దుమణిగిపోయాక కొద్దిరోజులపాటు కాలనీ ప్రశాంతంగా మారింది. హెల్మెట్ల వల్ల వెనక నుంచి వచ్చే వాహనాల హారన్లు వినిపించక పోవడం, యాక్సిడెంట్లు అవక తప్పటం లేదు. హఠాత్తుగా శ్యామల్రావ్ షెడ్ లో మళ్ళీ సంచలనం ప్రారంభమయింది.

రాత్రింబవళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏం చేస్తున్నాడా అని అందరికీ భయం పట్టుకుంది. రాజేశ్వరి మళ్ళీ పరిశోధనలు ప్రారంభించి సాయంత్రానికి రహస్య వివరాలు సేకరించింది. ప్యాక్టరీలో శరీరాలకు తగిలించుకునే కవచంలాంటి పొడుగాటి షీట్లు తయారవుతున్నాయట! అంతా అయోమయంగా కనిపించి అందరం స్వయంగా వెళ్ళి అవేమిటో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాం. మేం ప్యాక్టరీ దగ్గరకు ఫైబర్గ్లాస్ షీట్స్ అయిదడుగుల పొడుగువి కొన్ని వేలు స్టాక్ చేసి ఉన్నాయ్. “ఎందుకివి?” అనుమానంగా అడిగాం శ్యామల్రావ్ ని. “కేవలం మన స్త్రీలమీద జాలితో ప్రారంభించానివి! మొన్న రాత్రి ఆ పరమాత్ముడు కలలో కనబడి “ఒరేయ్ శ్యామల్రావ్ – చాలామంది ప్రమాదాల్లో దారుణంగా చనిపోతున్నార్రా! వాళ్ళకోసం ఏదయినా రక్షణ పరికరం తయారు చెయ్’ అంటూ ఆదేశించాడు – అంచేత...'' మా గుండెలు గుభేలుమన్నాయ్. “ఏం చేయాలి?” అడిగాడు శాయీరామ్.

“వంట చేసే ముందు ముఖానికి తగిలించుకోవాలి. మెడలో బెల్ట్ పెట్టుకుంటే శరీరమంతా షీట్ కవర్ చేస్తుంది. గ్యాస్ సిలిండర్ పేలినా గాయాలు తగలవ్!” “ఒకోటి ఎంత?” అడిగాడు గోపాల్రావ్. “మన కాలనీ వాళ్ళకయితే వెయ్యి రూపాయలే” ప్రేమగా అన్నాడతను. “బయటోళ్ళకు ఆరొందలకే అమ్ముతావనుకుంటా” అన్నాడు యాదగిరి. “అపచారం యాదగిరీ! ఆ పరమాత్ముడు సహించడు..ఇది వ్యాపారం” “ఇదివరకంటే బ్రతికిపోయావ్ గానీ ఇప్పుడు మాత్రం దెబ్బతింటావ్ శ్యామల్రావ్! బుద్ది ఉన్నవాడెవడూ చస్తే కొనడివి!” అన్నాడు రంగారావ్.

శ్యామల్రావ్ చిరునవ్వు నవ్వాడు “కేవలం మన దేశ గృహిణుల మీద ప్రారంభించాను – ఆ తరువాత అంతా ఆ పరమాత్ముడి దయ.. అన్నాడు చేయి తిన్నగా ఆకాశంలోకి చూపుతూ. మేం కూడా ఆకాశంలోకి చూశాం కానీ మాకేమీ కనిపించలేదు అక్కడ. ఆ తరువాత కొద్దిరోజులపాటు కవచాల ఉత్పత్తి నిరాటంకంగా కాలనీలో చాలామంది ఇళ్ళల్లో గదులు అద్దెకు తీసుకుని మరీ స్టాక్ చేయసాగాడతను. ఆ స్టాక్ చూస్తుంటే మాకు లోలోపల భయం. మా భయం ఆ మర్నాడే నిజమై కూర్చుంది “గ్యాస్ స్టవ్ లు ఉపయోగించే గృహిణులందరూ నెలఖరులోగా విధిగా ఫైబర్ గ్లాస్ కవచం నిబంధన పాటించకపోయినట్లయితే గ్యాస్ కనెక్షన్లు రద్దు చేయటమే కాకుండా ఆరు నెలలు జైలు శిక్ష, లేదా రెండువేల రూపాయల జరిమానా - రెండునూ విధించబడతాయ్?” అంటూ ప్రభుత్వం నిబంధన వచ్చింది పేపర్లో. దానికిందే శ్యామల్రావ్ ప్రకటన కనిపించింది.

“అతి తక్కువ వెలలో అత్యుత్తమ గ్యాస్ కవచాలు ఇచ్చట లభించును. స్టాకిస్ట్ లు, ఏజంటులు వెంటనే శ్యామల్రావ్ అండ్ సన్స్, హైదరాబాద్ ని సంప్రదించండి” మాకు మతిపోయినట్లు అయింది. మాలాంటి మధ్య తరగతి పక్షులు వెయ్యి రూపాయలు పెట్టి కవచాలు ఎలా కొనగలుగుతాం? మేమంతా గుమిగూడిపోయాం. “ఆ కవచం తొడుక్కుంటే ఇక వంటపని అయినట్లే – అదీ గాక వెయ్యి రూపాయలు ఎక్కడినుండి వస్తాయి అని విరుచుకుపడింది పార్వతీదేవి. ఆడాళ్ళంతా ప్రభుత్వం ఉత్తర్వుకి నిరసనగా పెద్ద ఊరేగింపు లేవదీయాలని నిర్ణయించుకున్నారు. మేమంతా వాళ్ళ ఊరేగింపుకి ఏర్పాట్లు ప్రారంభించాం. పోలీస్ కమీషనర్ అనుమతి కోసం వారం రోజులు తిరిగాక పర్మిషన్ దొరికింది. ఆ తరువాత ఊరేగింపు జరిపే స్త్రీలమీద స్ట్రీట్ గుండాలు దాడి చేయకుండా ప్రొటెక్షన్ కోసం మరోవారం రోజులు తిరిగాం.

“హైదరాబాద్ లో గూండాలు పోలీసుల మాటేక్కడ వింటారు – మీరు మరీనూ! వేరే ఏర్పాట్లు చేయండి!” అంది పార్వతీదేవి. “వేరే ఏర్పాట్లేమిటి” ఆశ్చర్యంగా అడిగాం మేం. “మనకు రక్షణగా కిరాయి గూండాలను ఏర్పాటు చేయండి! వాళ్ళను ఏర్పాటుచేస్తే గానీ మాకు వీధిలో ఊరేగడానికి ధైర్యం చాలదు. మిగతా ఆడాళ్ళంతా ఆమెను బలపరచడంతో మా కాలనీ వెనక పెద్ద బంగాళాలో ఉన్న శంకర్ దాదా గారింటికి చేరుకున్నాం మెంబర్స్ అందరం. అరగంటసేపు బయట కూర్చున్నాక శంకర్ దాదా బయటికొచ్చాడు. మమ్మల్ని చూసి ఆనందంగా కరచాలనం చేశాడు “మమ్మల్ని తభీయత్ కుష్ అవుతుంది భాయ్! ఎలక్షన్లో నాకు మీరు చేసిన ‘మదద్’ మరిచిపోనీకి కాదు” అన్నాడు ప్రేమగా. అందరం అతని ప్రేమకు పులకించి పొయ్యాం. “ఏం తాగుతారు? గుడంబనా, కల్లా? రెండూ స్టాకున్నయ్ ఇంట్లో” అడిగాడు ఆప్యాయంగా. “అబ్బే – మేమవి తాగం! అలవాటు లేదు” అన్నాడు రంగారెడ్డి. అతను మమ్మల్ని చూసి జాలి పడ్డాడు “అలవాటు చేసుకోవాలి భాయ్! ఆరోగ్యం మంచి గుంటది – నేను జూడు ఎట్లున్ననో! నాలుగు బాటిల్స్ ప్రెష్ కల్లు తాగుతా! రాత్రి పడుకునేటప్పుడు నాలుగు బాటిల్స్ గుడుంబా గానీ దుబార గానీ కొడత, అంతే! ఆ కొ తాగను!” అన్నాడు గర్వంగా. “అవును మంచి అలవాటు!” అన్నాడు శాయీరామ్ మెచ్చుకోలుగా. “ఏం సంగతి సారూ – ఇటోచ్చిన్రు!” అడిగాడతను. “మరేం లేదు శంకర్ భాయ్! మా కాలనీలో ఆడాళ్ళందరూ కల్సి సెక్రటేరియేట్ కి జులుస్ తియ్యాలనుకుంటున్రు! మరి లేడీస్ జులుస్ హైదరాబాద్ ల నీకు తెలియందేమున్నది? ఎన్నో కిరికిరిలవుతాయ్” చెప్పాడు యాదగిరి.

శంకర్ దాదా పగలబడి నవ్వాడు “అప్! కాలేజి పోరిలు జులుస్ తీసినప్పుడు మా శిష్యులే వాళ్ళను మంచిగ మజాక్ ఉడాయించిన్రు చెడ్డచెడ్డ పనులు చేసి సతాయించిన్రు ఆళ్ళు” మా అందరికీ వళ్ళు మండిపోయింది వాడి శిష్యుల మీద! కానీ ఇప్పుడు మా అభిప్రాయాలు చెప్పటం క్షేమకరం కాదు గనుక ఏమీ అనలేదు. అయిదు నిముషాల తర్వాత శంకర్ దాదా నవ్వటం ఆపాడు. “భాయ్ – మా లేడీస్ జులుస్ మీద గూండాలెవరూ రువాబ్ చేయకుండా నువ్ జరా మద్దత్ జేయాలి భాయ్” అన్నాడు రంగారెడ్డి. శంకర్ దాదా రంగారెడ్డి భుజంమీద ప్రేమగా కొట్టాడు “అరె మీ కాలనోళ్ళు జెప్తే కాదంటాను వయ్యా? బరాబర్ మద్దత్ జేస్త! ఏం కిరికిర కాకుండా జూస్త! కాని యాదుంచుకొండ్రి! వచ్చే ఎలక్షన్ల.....” అందరం ఏక కంఠముతో “శంకర్ దాదా జిందాబాద్! మా కాలనీ ఓట్లన్నీ మీకేనన్నా! ఆ విషయంలో ఫికర్ చేయకు” అని, అక్కడినుండి బయటికోచ్చాం. “కల్లు తాక్కుండానే పోతున్రు! ఇంటికొచ్చిన చుట్టాల్ని కల్లు తాపకుండా ఇంతవరకూ పంపనేలేదు – “నొచ్చుకుంటూ అన్నాడతను.

మర్నాడు శంకర్ దాదా తాలూకు శిష్యుల సహాయంతో లేడీస్ ఊరేగింపు జరిపాం. మెమొరాండం చీఫ్ సెక్రటరీకి అందజేసి తిరిగి ఇళ్ళకు చేరుకున్నాం! ఆ తరువాత వారం రోజులవరకు పేపర్లో ఏ ప్రకటనా రాకపోయేసరికి శ్యామల్రావ్ ఇంటిముందు క్యూలో నిలబడ్డాం. మిగతావాళ్ళు గ్యాస్ స్టవ్ లు అతి చవగ్గా అమ్మి పారేశారు. మరో నెలరోజులు అంతా ప్రశ్నాంతంగానే ఉంది. కానీ శ్యామల్రావ్ ఎప్పుడేం చేస్తాడో నన్న భయం మాత్రం పోలేదు. హఠాత్తుగా ఓరోజు శ్యామల్రావ్ ఫ్యాక్టరీలో సంచలనం ప్రారంభమయింది.

అందరం కలిసి భయం భయంగా ఫ్యాక్టరీ కెళ్ళాం. మోకాళ్ళవరకూ వచ్చే ప్లాస్టిక్ బూట్లు కొన్నివేలు తయారయిపోయాయ్ అప్పటికే! సైజులవారీగా పాక్ చేస్తున్నారు వర్కర్స్ మాకు కోపం, బాధ రెండూ కలుగుతున్నాయ్. “వీటి ఖరీదెంత?” అడిగాడు శాయీరామ్ దిగులుగా. “ఎంతోనా రెండొందలు” అన్నాడు శ్యామల్రావ్ “మధ్యతరగతి ప్రజలు, అట్టడుగున ఉన్న బలహీన వర్గాలవారు మాత్రం వీటిని కొనుక్కోలేరు, అంతేకాదు వాయిదాల పద్దతిన కూడా ఇస్తాం” అన్నాడతను. “ఇంతకూ అసలెందుకివి?” అడిగాడు రంగారెడ్డి నీరసంగా. “ఎందుకేమిటి? మీకు తెలీదా? మనదేశంలో ప్రతి సంవత్సరం వేలకొద్ది జనం కుక్కలు కరవడం వల్ల చనిపోతున్నారు. హెల్మెట్స్ లేక ప్రమాదాల్లో చనిపోయే జనంకంటే కుక్కకాటు వాళ్ళ చనిపోయే జనమే ఎక్కువట! అందుకని ప్రజల మేలు కోరి......” మేమింక వినదల్చుకోలేదు. మాకు తెలుసు! శ్యామల్రావ్, ఇంకా అలాంటివాళ్ళు తయారుచేసే పరికరాలేవయినా సరే ఎలాగూ ప్రజలు కొనుక్కు తీరాలి. అలా కొనేట్లు ప్రభుత్వం రూల్స్ పాస్ చేయించగలరు వాళ్ళు. ముందే అందరం వాయిదాల పద్ధతిలో ఆ బూట్లు తలో నాలుగు జతలూ కొని ఇంట్లో పట్టుకున్నాం! అ తరువాత వారం రోజులకే ప్రకటన వచ్చింది. “కుక్కకాటుకి ప్రజలు విపరీతంగా చనిపోతుండడం వాళ్ళ ప్లాస్టిక్ బూట్లు ధరించాలని నిర్భంధం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బలహీన వర్గాల వారందరికి ప్రభుత్వం బాంక్ లోన్స్ ఇచ్చే సౌకర్యం కల్పిస్తుంది. వచ్చేనెల మొదటి తారీఖు నుంచే అమలులోకి వస్తుంది.

ఆరోజు నుంచి ఆ ప్లాస్టిక్ బూట్లు ధరించకుండా వీధుల్లో కొచ్చేవారిని అరెస్ట్ చేసేందుకు, అయిదువేల రూపాయల జరిమానా విధించి సంవత్సరం జైలు శిక్ష వేసేందుకు పోలీసులకు అధికారాలుంటాయి” ఆ తరువాత జనం ప్లాస్టిక్ బూట్లు అమ్మే షాపుల ముందు రెండు రోజులపాటు క్యూల్లో నిలబడి బూట్లు కొనుక్కోవటం గమనించాం. ఎందుకంటే మేం ఆ క్యూల్లో రోజుల తరబడి గడిపే గొడవ లేకుండా ముందే కొనుక్కున్నాం గనుక! ఆ గొడవంతా సద్దుమనిగేసరికి సమయం గడిచిపోయినాయ్. శ్యామల్రావ్ బంజారాహిల్స్ లో ఇంకో బిల్డింగ్ కొన్నట్లు మాకు మళ్ళీ రాజేశ్వరి తాలుకూ రహస్య నివేదన అందింది.

కొద్ది రోజుల తరువాత శ్యామల్రావ్ ప్యాక్టరీ లో మళ్ళా సంచలనం కనిపించింది. వెంటనే అందరం కలిసి ప్యాక్టరీకి చేరుకున్నాం. ఈసారి కళ్ళజోళ్ళు తయారు చేస్తూ కనిపించారు వర్కర్స్. “ఇవెంత?” అడిగాడు రంగారెడ్డి జేబులో నుంచి పర్స్ తీస్తూ. “వందరూపాయలు! ఇంట్లో అందరికీ తలో సెట్ కొనుక్కోండి!” అన్నాడు శ్యామల్రావ్. అందరం వాయిదాల పద్ధతిలో తలా నాలుగు సెట్లు కొనుక్కుని ఇంటికి చేరుకున్నాం. అయితే వాటినేం చేయాలో, ఆ కళ్ళజోడు ఎందుకో ఎవరికీ తెలీదు – శ్యామల్రావ్ ని అడగటం కూడా అనవసరమనిపించింది. ఎందుకంటే ఎలాగూ ఆ కళ్ళజోళ్ళు ధరించటాన్ని నిర్భంధం చేస్తూ ప్రభుత్వ ప్రకటన త్వరలో వస్తుందని అందరికీ తెలుసు. అందులో ఎలాగూ ఉంటాయ్. అనుకున్నట్లే కొద్దిరోజుల్లో టి.వి. ఉన్నవారందరికీ అలాంటి ప్రత్యేకమైన కళ్ళజోళ్ళ అవసరం కలుగుతుందట! టి.వి. చూసేటప్పుడు ఎవరయినా ఆ కళ్ళజోడు పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేసేటట్లయితే ప్రభుత్వం వారికి జరిమానాలు విదిస్తుందట, ఈ ఉత్తర్వులని అందరూ అమలుపరుస్తారు. పెట్టుకుందీ, లేనిది చూడటానికి పోలీస్ లు హఠాత్తుగా ఇళ్ళల్లో జొరబడి తనిఖీ చేస్తారు మామూలుగా ఆ ఉత్తర్వుకింద శ్యామల్రావ్ ప్రకటన కనిపిస్తుంది. టి.వి. ప్రేక్షకులకు మా కాలనీలో వాళ్ళ ఆర్ధిక పరిస్థితి దుర్భరంగా తయారయింది.

శ్యామల్రావ్ కి వాయిదాల డబ్బు కట్టేసరికి మిగతా వస్తువులకు డబ్బు చాలటం లేదు. ఒకరినొకరు అప్పులడగడం ఎక్కువయిపోయింది. దానికి తోడు రోడ్డుమీదకు వెళ్ళాలంటే ప్లాస్టిక్ బూట్లు, చేతికి గ్లోవ్స్, హెల్మెట్స్ తో పోవాలంటే ప్రాణం మీద కొస్తోంది. ఇంట్లోని ఆడాళ్ళ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది – ఆ కవచంతో వంట చేయటం! ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో పోలీసు ప్లయింగ్ స్క్వాడ్ రావటం, మేం ఆ ఎక్విప్ మెంట్ సరిగ్గా ఉపయోగిస్తున్నామో లేదో చూడటం, అరెస్టు చేయడం, జామీను మీద వదలటం, అక్కడికక్కడే జరిమానా వసూలు చేయటం జరిగిపోతున్నాయ్. అందరికీ పోలీసుల బాధ ఎక్కువయిపోయింది. జరిమానాలు కట్టలేక కొంతమంది అండర్ గ్రౌండ్స్ లో కెళ్ళిపోవటం మామూలు విషయమయిపోయింది.

ఈ గొడవల్తో మేము సతమతమవుతుంటే హఠాత్తుగా శ్యామల్రావ్ ఫ్యాక్టరీ లో మళ్ళీ హడావిడి ప్రారంభమయింది. అందరికీ దడ ప్రారంభమయినది. కొంత మందికి ఫీట్స్ వచ్చాయ్. రంగారెడ్డి పాలిపోయిన ముఖంతో మా ఇంటికొచ్చాడు “ఈసారి ఏం తయారు చేస్తున్నాడో చూద్దామా? అన్న గొంతుతో. “మిగతా వాళ్ళంతా ఏరీ?” దిగిలుగా అడిగాను. “ఈ విషయం తెలియగానే అందరికీ జ్వరం వచ్చింది. యాదగిరిని హాస్పిటల్లో ఎడ్మిట్ చేశారు” “సరే పద” అన్నాడు.

ఇద్దరం ప్యాక్టరీకెళ్ళాం – ఏనుగు తలకాయల్లా – పొడుగ్గా తొండాల్లాంటి గొట్టాలతో ఉన్నాయా పరికరాలు. “ఏమిటివి ?” అడిగాం శ్యామల్రావ్ ని. “యాంటీ పొల్యూషన్ ఎక్విప్ మెంట్. మనదేశంలో ఎన్ని వేలమంది చెడుగాలి పీల్చి రకరకాల జబ్బులకు గురి అవుతున్నారో మీకూ తెలియాలి. భోపాల్ ట్రాజెడీ సంగతేమిటి? వేలమంది ప్యాక్టరీ నుంచి వెలువడే విషవాయువు వల్ల ఎగిరిపోయారు? ఎందుకిలా జరిగింది? ఆక్సిజన్ కిట్స్ ప్రతి పౌరుడికి అందుబాటులో ఉండాలి. ‘కేవలం ప్రజల మేలు కోరి – ముఖ్యంగా చుట్టూ పరిశ్రమలున్న హైదరాబాద్ లాంటి నగరంలో” ఇంకా చాలు – నువ్వేం చెప్పనక్కరలేదు – ధరెంత?” అడిగాడు రంగారెడ్డి. “అయిదువేలు” రంగారెడ్డి ఠక్కున కింద పడిపోయాడు.

శ్యామల్రావ్, నేనూ పరుగుతో వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి అతని మోఖంమీద జల్లాం. లేచి కూర్చుని “నేనేం కొంటున్నాను?” అనడిగాడు రంగారెడ్డి. “ఆక్సిజన్ కిట్” అన్నాడు శ్యామల్రావ్. ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చాం, అప్పటికప్పుడే పెద్ద ఎత్తున కాలనీ సమావేశం జరిగింది. హెల్మెట్స్ ధరించటం వల్ల యాక్సిడెంట్స్ అయినవాళ్ళు.. కవచం వేసుకుని వంట చేసేటప్పుడూ దానివల్లే కిందపడి కాళ్ళు ఫ్రాక్చర్ అయిన ఆడవాళ్ళూ.. ప్లాస్టిక్ బూట్లు కట్టుకున్న పిల్లలు – అందరూ బాండేజీలతో సమావేశానికి హాజరయ్యారు. శాయీరామ్ మైక్ దగరికొచ్చాడు ఆనందంగా “సోదరులారా! ఏంతో కాలం తర్వాత మనమిక్కడ సమావేశ మయినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. 1984 లో కూడా.....” అంటూ ప్రారభించాడు. కాని అందరూ అతనిని దిగమని కేకలేసేసరికి చిన్న బుచ్చుకుని పక్కకు తప్పుకున్నాడు.

రంగారెడ్డి మైక్ దగ్గర కొచ్చాడు “సోదర సోదరీమణులారా! శ్యామల్రావ్, మరికొంత మంది అతనిలాంటి స్వార్ధపరులు కలిసి ఎన్నివిధాల బాధిస్తున్నారో మీరంతా చూశారు. వాళ్లకు ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో ఉన్న కొంతమంది వత్తాసు ఇవ్వటం వల్ల ఇలా దారుణమైన స్థితికొచ్చాం. మనమందరం ఇలాగే నిశ్శబ్దంగా ఉంటే మనందర్నీ ఈ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వం కలిసి అనాధల్లా మార్చివేసేరోజులు ఎంతో దూరంలో లేవని మనవి చేస్తున్నాను” అంతా చప్పట్లు మార్మోగిపోయాయ్. “కనుక – మనమందరం ఇవాల్టి నుంచి సెక్రటేరియట్ ముందు ధర్నా ప్రారంభించాలని మన కమిటీ నిర్ణయించింది” అంతా చప్పట్లు ఈలలు మోగాయ్.

అప్పటికప్పుడే అందరం పెద్ద ఊరేగింపుగా బయల్దేరాం. ఊరేగింపు అనుమతి తీసుకోక పోవడం వల్ల సెక్రటేరియట్ దగ్గరకు రాగానే పోలీసులు అడ్డువచ్చి గోడలా నిలబడ్డారు. అందరికీ పోలీసుల మీద కోపం పెరిగిపోతోంది. “ఇంక్వీలాబ్ – జిందాబాద్” అని అరుస్తూ పోలీసులను తోసుకుని ముందుకు పరుగెత్తబోయాము..

పోలీసులు దాని కోసమే ఎదురు చూస్తున్నట్టు లాఠీ చార్జి మొదలు పెట్టారు. విజిల్స్, పరుగులు, కేకలతో ఆ ప్రాంతమంతా నానా గొడవగా తయారయింది. నా నెత్తిమీద ఒక లాఠీ బలంగా తగిలింది. దబ్బుమని కింద పడిపోయా. మెలకువ వచ్చేసరికి చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ ల మీదన్నాం. “కంగ్రాచ్యులేషన్స్, ప్రభుత్వ ప్రతినిధులు మీతో మాట్లాడడానికి వప్పుకున్నారు” అన్నాడు పోలీస్ అధికారి నాతో. మర్నాడు సంభాషణలు ప్రారంభమయ్యాయి. చీఫ్ సెక్రటరీ, ఇద్దరూ మంత్రులు, పోలీస్ అధికారులు నలుగురు సంభాషణల్లో పాల్గొన్నారు. కాలనీ తరపున నేనూ, గోపాల్రావ్, జనార్ధన్, రంగారెడ్డి, శాయీరామ్, యాదగిరి, పార్వతీదేవి, రాజేశ్వరీ వెళ్ళాం. “ఇవన్నీ మీ క్షేమం కోరే చేశాం” అన్నారు మంత్రిగారు. “మా క్షేమం కోరి చేయాల్సింది ఇలా ఉత్తర్వులు జారీ చేయటం కాదు” అన్నాడు రంగారెడ్డి ఆవేశంగా. “మరేం చేయాలి?” అడిగాడు మంత్రిగారు.“మోటార్ సైకిల్, స్కూటర్ ప్రమాదాల నుండి రక్షించాలంటే రోడ్లు వెడల్పు చేయాలి! అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అంతేగాని హెల్మెట్స్ పెట్టినంత మాత్రాన ప్రమాదాలు, చావులు తగ్గవు” “అయ్ డోంట్ ఎగ్రీ” అన్నాడు ఓ పోలీస్ అధికారి. “అలాగే గ్యాస్ స్టవ్ మీద వంట చేసే వారికీ ప్రమాదం జరక్కుండా గ్యాస్ సిలిండర్ పరంగా మార్పులు తేవాలి గాని కవచాలు వేసుకోమని నిర్భందిచటం మూర్ఖత్వం” అన్నాడు శాయీరామ్. “మేం వప్పుకోం” అన్నాడు చీఫ్ సెక్రటరీ. “కుక్కలు కరిచి జనం చచ్చిపోతున్నారని పొడుగాటి బూట్లు వేసుకోమనటం సబబు కాదు! మునిసిపల్ కార్పోరేషన్ వాళ్ళు రోడ్లమీద కుక్కలు తిరక్కుండా చర్యలు తీసుకోవాల్సింది పోయి, ప్రజలతో బూట్లు కొనిపించటం మీనింగ్ లెస్” అన్నాడు గోపాల్రావ్. ''మీ ఆర్గ్యుమెంట్ మీనింగ్ లెస్” అన్నాడు మరో మంత్రి. “ఫాక్టరీల నుండి ప్రాణానికి హాని కలిగించే వాయువులు వెలువడతాయి గనుక నగరాలకు దూరంగా, జనం లేని చోట కట్టే ఏర్పాట్లు చేయాలిగానీ మమ్మల్ని అయిదువేలు పెట్టి ఆక్సిజన్ కిట్స్ కొనుక్కోమంటే ఎలా?” “ప్యాక్టరీలను అంత ఖరీదు పెట్టి షిప్ట్ చేయడం సాధ్యం కాదు గనుక ఇది కూడా యూస్ లెస్” అన్నాడు మరో పోలీస్ అధికారి. “అయితే – మేం మా ఆందోళన విరమించటం లేదు – ఇంకా ధర్నాలు, ఊరేగింపులు కొనసాగిస్తాం” అన్నాడు రంగారెడ్డి. “మీ ఇష్టం! ఏమయినా చేసుకోండి! కానీ ఇకనుంచీ మేం గట్టిగా ప్రవర్తించాల్సి వస్తుంది జాగ్రత్త” అన్నాడు పోలీస్ అధికారి. టాక్స్ ఫెయిలయిపోయాయ్.

మమ్మల్నందరినీ అరెస్ట్ చేసి నాలుగు రోజులు జైల్లో ఉంచారు. నాలుగు రోజులు ఇంట్లో మగాడు లేకపోతే కుటుంబాలు ఏమయిపోతాయో మాకు తెలుసు గనుక ఆందోళన విరమించుకున్నట్లు కాగితాల మీద సంతకాలు చేసి ఇళ్ళకు చేరుకున్నాం.