బడ్జెట్ భాగోతం

యర్రం శెట్టి శాయి

మోపెడ్ అమ్మిన తర్వాత కొద్ది రోజుల వరకు శాయిరామ్ ఎవరికీ కనిపించలేదు. కాలనీ మీటింగ్ లు కూడా రెండు వారాలపాటు నిర్వహించకుండా వదిలేశారు. రెండు ఆదివారాలపాటు మమ్మల్ని సుఖంగా నిద్రపోనిచ్చినందుకు మేమెంతో ఆనందించాం గానీ మా ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మూడో ఆదివారం కొంప ముంచుకుపోయినట్లు అందరిళ్ళకూ వెళ్ళి మీటింగుకు తరుముకొచ్చాడు. “ఇప్పుడు మీటింగ్ దేనికట! “కోపం అణుచుకుంటూ శాయిరామ్ ని అడిగాడు. “ఎందుకేమిటి? వచ్చే శనివారమే బడ్జెట్ వస్తోంది.” “అయితే మనకేమిటి హడావుడి?” దానికి శాయీరామ్ జవాబు చెప్పకుండా మిగతా వాళ్ళందర్నీ పిలిచి, నన్నో తెలివి తక్కువ వాడిలా చూపిస్తూ.... “చూశారా! ఎడ్యుకేటెడ్అయినా కూడా ఉదయార్కర్ కు బడ్జెట్ విలువ తెలీదు. మన కాలనీలో ఈ ఒక్క ఉదయార్కరే కాదు ఇంకెంతోమంది అజ్ఞానులున్నారు. అలాంటి వాళ్ళను నిద్ర మేల్కోలపటానికే మనం ఇక్కడ సమావేశం అయ్యాం” అన్నాడు. అందరూ నా వేపు జాలిగా చూశారు. ‘బడ్జెట్ విలువ తెలీదా?’ అన్నట్లు నవ్వారు. నేనిక లాభం లేదని సైలెంటయిపోయాను.

శాయీరామ్ మైక్ ముందు కొంచెం హడావిడి చేశాక రంగారెడ్డి ఉత్సాహంగా మైక్ అందుకున్నాడు. “సోదర సోదరీమణులారా! ఇన్ని సంవత్సరాలుగా మనం ఎప్పుడూ బడ్జెట్ గురించి పట్టించుకోలేదు. అందువల్ల మనం ఎంత నష్టపోతున్నామో, ఎలా నష్టపోతున్నామో మీకెవరికయినా తెలుసా? ఉదయార్కర్ గారూ మీకు తెలుసా?” అడిగాడు నన్ను. “తెలీదు!” అన్నాను మొహమాటం లేకుండా. “గోపాల్రావ్ గారూ, మీకు తెలుసా?” “కొంచెం తెలుసుగానీ – మర్చిపోయాను” అన్నాడు గోపాల్రావ్ తప్పించుకుంటూ. “జనార్ధన్ గారూ మీకు తెలుసా?” “తెలీదు” రంగారెడ్డి విజయ గర్వంగా అందరి వేపూ చూశాడు. “కానీ నాకు తెలుసు!” అన్నాడు చిరునవ్వుతో. అందరం రంగారెడ్డి వంక ఈర్ష్యగా చూశాం మాకు తెలీని విషయాలన్నీ అతనికెలా తెలిశాయా అని. “తెలిస్తే చెప్పు త్వరగా!” అన్నాడు. “నాకు తెల్సిందది కాదు! మీ కెవ్వరికీ ఏమీ తెలీదన్న విషయం నాకు తెలుసు” చిరునవ్వుతో అన్నాడు రంగారెడ్డి. “సంగతేమిటంటే మన కాలనీ శ్యామల్రావ్ గారూ ఏం చేశారనుకున్నారు? కిందటి బడ్జెట్ ముందురోజు గదినిండుగా సబ్బులు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మర్నాడు బడ్జెట్ చూస్తే ఏం జరిగిందనుకున్నారు? ఒకో సబ్బు మీద పావలా చొప్పున టాక్స్ పడింది. అంటే శ్యామల్రావ్ కి ఎంత లాభం కలిగిందో మీరే చుడండి! గది నిండా ఉన్న సబ్బులన్నీ కొంచెం చౌక ధరకు అమ్మితే కొన్నాం. శ్యామల్రావ్ సబ్బులమ్మితే కొన్నాం గానీ – దాని వెనక ఈ కథ ఉందని మాకు తెలీలేదు. తన అన్న కొడుకు సబ్బుల కంపెనీలో రిప్రజెంటేటివ్ అనీ, అంచేత ఓ అయిదు పైసలు తక్కువకు దొరుకుతున్నాయనీ మా అందరికీ అబద్దం చెప్పాడు. అది మేము శుంఠల్లా నమ్మేశాం. కనుక సోదరులారా! రేపు శనివారం వస్తున్న బడ్జెట్ కి ముందే మనం కూడా తెలివిగా కొన్ని వస్తువులు కొనేసి స్టాక్ పెట్టినట్లయితే – మనందరికీ ఎంత లాభమో ఒక్కసారి ఆలోచించండి” అందరూ ఒక్కసారి ఆలోచించేసరికి గుండెలు బాదుకోబుద్దేసింది ఆడాళ్ళలో పెద్ద ఎత్తున కలవరం చెలరేగింది. “ఈ విషయం మనకి తెలీనే తెలీదు పిన్నిగారూ! చూశారా- మన కాలనీలో ఉండడం వల్ల మనకెన్ని విషయాలు తెలుస్తున్నాయో – నేనూ మా రెండు అల్మారాల నిండుగా బట్టల సబ్బులు కొని పెట్టేస్తాను.” “నేను చింతపండు కొంటాను” “మీరేం కొంటారు పార్వతమ్మగారూ” “స్టీలు గిన్నెలు” అందామె. తమలో తాము చర్చించుకోవడం పూర్తయ్యాక జనార్ధన్ మైక్ ముందుకొచ్చాడు “నా ప్రియమైన తెలుగు ప్రజలారా!” అన్నాడు సినిమా ఫక్కీలో! మీకో విషయం చెప్పడం మర్చిపోయాను. జనార్ధన్ ఇటీవల కొంచెం ఎన్టీఆర్ ని అనుకరిస్తూ మాట్లాడటం – హావభావాలు ప్రదర్శించటం చేస్తున్నాడు.

అతనలా చేయడానికి కారణం ఏమిటంటే – ఎన్టీఆర్ ఎలాగూ సినిమా ఫీల్డు వదిలేశాడు కాబట్టి ఆ స్థానం అలా ఖాళీగానే ఉంది కాబట్టి సినిమాల్లో ఎన్టీఆర్ వేసే హీరో పాత్రలు తనకు లభించే అవకాశం ఉంటుందని ఎవరో చెప్పారుట. “ముక్కు పచ్చలారని చిన్నారి ముద్దు బిడ్డలారా? తెలుగింటి వెలుగులైన నా ప్రియమైన ఆడపడుచులారా!” ఆ మాటతో ఆడాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. మాకు మతి పోయినట్లయింది. ఒకే ఒక్క డైలాగ్ తో మా కాలనీ ఆడాళ్ళందరి అభిమానం సంపాదించాడే అని. “నేను మన కాలనీ ప్రెసిడెంటు అయిన దగ్గర్నుంచీ అనుక్షణం, క్షణం, క్షణం ప్రతి క్షణం – మీకేం సేవ చేయగలనా అని ఆలోచనలు పునరాలోచనలు చేస్తున్నాను. ఇన్నాళ్ళకి ఇప్పుడా అవకాశం లభించింది.!” మళ్ళీ ఆడాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. “ఈ బడ్జెట్ లో పెరిగే ధరలు సాధారణంగా మనలాంటి మధ్య తరగతి ప్యామిలిస్ అందరికీ శాపం! కానీ ఈ శాపాన్నివరంగా మార్చుకునేందుకు నేను సహాయం చేస్తాను. డిల్లీలో ఫైనాన్స్ మినిస్ట్రీ బడ్జెట్ సెల్ లో మా పిన్ని కొడుకు పని చేస్తున్న విషయం మీకెవరికి బహుశా తెసిసుండదు.

 

నిన్నటి వరకు నాకూ తెలీదనుకోండి. అది వేరే విషయం. వాడితో ఫోన్లో మాట్లాడాను. బడ్జెట్ ప్రజెంట్ చేయడానికి ఓరోజు ముందు – అంటే శుక్రవారం సాయంత్రం మనకు ఏయే వస్తువుల ధరలు పెరగనున్నది రహస్యంగా ఫోన్ లో ఇన్ఫర్మేషన్ అందిస్తానని ప్రామిస్ చేశాడు. మనకా ఇన్ ఫర్మేషన్ అందగానే మనమంతా ఆ వస్తువులు మన ఆర్ధిక శక్తి కొద్దికొని స్టాక్ చేసి పారేస్తే మనము వాడుకోవచ్చు – ఇంకా లాభానికి బయట అమ్ముకోవచ్చు కూడా” అందరూ తప్పట్లు కొట్టారు. ఈసారి మగాళ్ళందరూ కూడా తప్పట్లు కొట్టడం నాకూ ఆశ్చర్యం కలిగింది. శుక్రవారం వరకు కాలనీ వాళ్ళందరూ చాలా హడావుడిగా రోజులు గడిపారు. చాలా మంది బ్యాంకుల్లో దాచుకున్న డబ్బంతా విత్ డ్రా చేసి రడీగా పెట్టుకున్నారు. బ్యాంక్ బాలెన్స్ లేనివాళ్ళు నగలు బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకున్నారు. కొంతమంది బంధువుల నుండి అప్పులు తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం వచ్చేసింది. గోపాల్రావ్, శాయీరామ్, రంగారెడ్డి, యాదగిరి, నేను, జనార్ధన్ కలిసి మాకు తెలిసిన ఓ ఫోన్ వున్న ఓనర్ ఇంటికెళ్ళి కూర్చున్నాము.

 

సాయంత్రం ఏడుగంటల తర్వాత డిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. జనార్ధన్ ఫోన్ అందుకున్నాడు. ఓ చేతిలో పెన్ను మరో చేతిలో అప్పుడే కొత్తగా కొన్న నోట్ పుస్తకం పట్టుకున్నాడు గోపాల్రావ్. “రాసుకో” అన్నాడు జనార్ధన్ హడావుడిగా. “టూత్ పేస్ట్ లు” గోపాల్రావ్ చకచక రాసేశాడు. “నెక్స్ట్ టేబిల్ ఫాన్లు ఆ తరువాత సబ్బులు – వనస్పతి...” అయిదు నిమిషాలపాటు లిస్ట్ చదివాడు. అందరం ఆలోచనలో పడ్డాం. అప్పటికప్పుడు లిస్ట్ కాపీలు తయారయాయ్. “ఇంక ఆలస్యం ఎందుకు పదండి” అన్నాడు శాయీరామ్. అందరం వెంటనే మార్కెట్ కి పరుగెత్తాం. నేను మాత్రం వీలయినంత టూత్ పేస్ట్ స్టాక్ మ ఇంట్లో నింపేయాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి పదిగంటల వరకు మా కాలనీలోకి రిక్షాలో రకరకాల వస్తువులు చేరుతూనే ఉన్నాయ్. మిగతా రాత్రి కూడా ఎవ్వరికి నిద్ర పట్టినట్లు లేదు. అందరిళ్లల్లోంచీ చాలా ఎగ్జయిటింగ్ గా మాటలు వినబడుతూనే ఉన్నాయ్. తెల్లారిపోయింది అందరం ఆఫీస్ కి శెలవు పెట్టి మధ్యాహ్నం నుంచీ రేడియో దగ్గరే కూర్చున్నాం. సాయంత్రమయ్యేసరికి బడ్జెట్ వివరాలు ఒక్కటొక్కటే బయటికొస్తుంటే అందరి గుండెల్లోనూ ఆందోళన మొదలయింది.

జనార్ధన్ ఫోన్ లో వచ్చిన లిస్ట్ లోని వస్తువుల ధరలే మాత్రం పెరగలేదు. అందరి ముఖాలు పాలిపోయాయ్, కొంతమంది ఆడంగులు గట్టిగా ఎవర్నో తిట్టడం, శాపనార్థాలు పెట్టటం స్పష్టంగా వినిపిస్తూనే ఉంది. మాఆవిడ దిగులుగా వచ్చింది టి.వి. దగ్గర్నుంచీ. ఇప్పుడా రెండు వేల రూపాయల టూత్ పేస్ట్ ఏమిటి చేయడం?” అంది గాబరాగా. అప్పుడే జనార్ధన్ భార్య వచ్చింది మా ఇంటికి “వాళ్ళ పిన్ని కొడుకు మాటలు నమ్మవద్దని మొత్తుకుంటూనే ఉన్నాం అక్కయ్యగారూ! వింటేనా? ఇరవై టేబుల్ ఫాన్లు కొనుక్కొచ్చి ఇంట్లో పడేశారు. ఓ గదంతా నిండిపోయాయవి. ఇల్లు ఇరుకయింది. ఇప్పుడా ఫాన్లు ఏం చేయ్యాలి?” ఏడుపు ఆపుకుంటూ అందామె. మరికాసేపటికి యాదగిరి వచ్చాడు “క్యా పరేషాని హై యార్! జనార్ధనన్న మాట భరోసా మీది కెళ్ళి సబ్బులు కొనిపెట్టినా ! నా భార్యేం చేసిందో ఇన్నావూ? నీయవ్వ – నాకెరుక లేకుండా చింతపండు వందకిలోలు తెచ్చి స్టాక్ పెట్టింది! బడ్జెట్లో చింతపండు ధర ఏనాడయినా పెరుగుతాదివయ్యా?” ఆ రాత్రికల్లా మరెన్నో ఆసక్తికరమైన వివరాలందాయ్. చాలామంది కాలనీ ఆడాళ్ళ కూరగాయలు కూడా కొనేసి స్టాక్ పెట్టారుట. జనార్ధన్ ఎవరికీ కనిపించలేదు. ఎంతోమంది అతనింటికి వెళ్ళినా ఇంట్లో కనిపించలేదుట! ఎక్కడికెళ్ళాడో ఎవరికీ తెలీదన్నారు. మిగతా రాత్రంతా కూడా ఇంట్లో స్టాక్ ఏం చేసుకోవాలో తెలీక దిగులుతో ఎవ్వరూ నిద్రపోలేదు. మర్నాడు ఉదయం శాయీరామ్ పరుగుతో వచ్చాడు “చూశావా గురూ! ఉప్పు ధర తెగ పెరిగిపోయింది! మనం అదయినా స్టాక్ పెట్టి ఉంటే ఎంత బావుండేది?” అన్నాడు విచారంగా. “ఉప్పు ధర పెరుగుతుందని ఎవరనుకున్నారు?” అన్నాన్నేను విరక్తిగా! “మనం కొన్న స్టాక్ నంతా సాయంత్రం తీసుకెళ్ళి మళ్ళీ షాపుల వాళ్ళకి ఇస్తే తీసుకుంటారెమో!” అన్నాడు రంగారెడ్డి. సాయంత్రం అందరం బయల్దేరి మార్కెట్ చేరుకున్నాం. మా కథ అంతా విని షాపు వాడు చిరునవ్వు నవ్వాడు.

<!--nextpage-->

ఏం ఫర్వాలేదు సార్! స్టాకంతా తీసుకొచ్చి నాకిచ్చేయండి! సగం ధర ఇచ్చేస్తాను” శాయీరామ్ అదిరిపోయాడు “సగం ధరకా?” “అవున్సార్! ఎంతో కాలం నుంచి తెలిసినవారు కదా! అందుకని మీకు సగం ధర ఇచ్చేస్తాను” “అంటే మిగతా వాళ్లకు అదికూడా ఇవ్వవా?” “మిగతావాళ్ళ దగ్గర అసలు కొనను సార్” “కానీ మరీ సగంధర అంటే మాకు సగానికి సగం నష్టంరాదూ?” “బిజినెస్ అన్నాక అంతే సార్! ఒకోసారి ఇలాగే నష్టం వస్తూంటుంది!” జాలిగా అన్నాడు. “కానీమాది, ........బిజినెస్ కాదు కదా.....” “నష్టం వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు గురూజీ! ఇదే బడ్జెట్ లో ఆ వస్తువు ధర పెరిగిందనుకోండి! మీరు బిజినెస్ చేయరా?” అందరం ఇళ్ళకు తిరిగి వచ్చాం! అర్జంటుగా అప్పటికప్పుడే కాలనీ మీటింగ్ ఏర్పాటు చేశాడు శాయీరామ్. ఆడా మగా అందరూ వాడిపోయిన ముఖాలతో కూర్చున్నాం “సోదరసోదరీమణులారా! అనుకోకుండా అందరం దెబ్బతిన్నాం! ఇప్పుడీ భయంకర పరిస్థితి నుంచి ఎలా బయట పడాలా అనే విషయం ఆలోచించాలి మనం” అన్నాడు రంగారెడ్డి. “నష్టానికి అమ్మేద్దాం!” అన్నాడు గోపాల్రావ్. అందరూ ‘వద్దూ’ అని కేక వేశారు.

 

“ఆ జనార్ధన్ పని పడతాను! మా ఇల్లంతా సర్వనాశనం చేశాడు” అన్నాడు వెంకట్రావ్ కోపంగా. “ఎందుకు? ఏం జరిగింది?” అడిగాడు శాయీరామ్. “నేను రెండు క్వింటాళ్ళ వంకాయలు కొన్నాను” నిసార్ గాడు జనంలోనుంచి లేచి మైక్ దగ్గరకొచ్చాడు “మీక్కావాలీ – తొ- నేను ఒక్క ఐడియా చెప్తుయ్!” అన్నాడు చిరునవ్వుతో. “చెప్పరా నాయనా! త్వరగా అఘోరించు” అరిచాడు రంగారెడ్డి. “బాస్టర్ సిస్టమ్ మంచిగా ఉంటాయ్! బాస్టర్ సిస్టమ్ బోలేతో మీకీ సమజ్ అవుతుయ్ నా?” మాకు అర్ధమయింది. డబ్బు చలామణి లేని కాలంలో వాడే వాళ్ళది . వస్తువు బదులు వస్తువు మార్చుకోవడం. “ఒండర్ ఫుల్ ఐడియా” అన్నాడు యాదగిరి. అందరం నిసార్ ని కౌగిలించుకున్నాం! “ఇంతమంచి ఐడియా నీకెట్ల వచ్చిందన్నా?” అడిగాడు యాదగిరి. “నేను వెయ్యిరూపాయల్ బ్లేడ్ స్టాక్ ఇంట్లో పెట్టినయ్! అదీ చూస్తే ఐడియా వచ్చినయ్” అప్పటికప్పుడే బాస్టర్ సిస్టమ్ అమలు పరచడం ప్రారంభమయింది. నా దగరున్న టూత్ పేస్ట్ లు కాలనీలో అందరికీ తలా కొన్ని అంటగట్టేశాను. మహా అయితే రెండొందలు నష్టంవచ్చి ఉంటుందంతే. అలాగే శాయీరామ్ కాఫీ పొడి పాకెట్లు అందరికీ పంచాడు. నిసార్ గాడి దగ్గరున్న బ్లేడ్ స్టాక్ అందరం పంచుకున్నాం. వెంకట్రావ్ కొన్న వంకాయలు ఆ రాత్రే అందరూ చచ్చినట్లు సయించకపోయినా వండుకు తిన్నారు. పనిలో పని అని యాదగిరి భార్య చింతపండు అందరకు పంచేసింది. ఎటొచ్చి గొడవంతా ఎక్కడోచ్చిందంటే డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి దగ్గర. ఆమె న్యూస్ ప్రింట్ ధర పెరుగుతుందన్న నమ్మకంతో బోలెడు న్యూస్ ప్రింట్స్ కొని పెట్టేసింది. అది ఎవ్వరూ పంచుకోవడానికి ఇష్టపడలేదు. “అసలు ఆ పనికిమాలిన న్యూస్ ప్రింట్ ఎందుకు కొన్నట్లు?” చిరాగ్గా అడిగాడు రంగారెడ్డి. “ధరలు పెరిగితే పబ్లిషర్లంతా న్యూస్ ప్రింట్ కోసం’క్యూ’ కట్టి నేనడిగిన రేటిచ్చికొనుక్కెళ్ళతారని అనుకున్నాను....” అందామె కన్నీళ్ళతో. “అయినా అంత ఆశ ఉండకూడదు మరీనూ?” అన్నాడు గోపాల్రావ్. “నేను డబ్బు కోసం ఆశ పడలేదు.

 

న్యూస్ ప్రింట్ మామూలు ధరకే ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా నా డిటెక్టివ్ నవలలు పబ్లిష్ చేయమని కోరదామనుకున్నాను” అందామె అసలు విషయం బయట పెడుతూ. చివరకు శాయీరామ్ ఓ ఐడియా ఇచ్చాడు “ఎలాగూ ప్రతి కుటుంబంలో ఓ కథా రచయిత(త్రి) గానీ, గేయ రచయిత(త్రి) గానీ, నవలా రచయిత (త్రి)గానీ, కార్టూనిస్ట్ గానీ ఉండక తప్పదు కదా. కనుక ఎవరి రచనలు వాళ్ళు రాజేశ్వరీ న్యూస్ ప్రింట్ కొనుక్కుని అచ్చు వేసుకుంటే పది కాలాలపాటు వాళ్ల రచనలు నిలిచిపోతా య్” ఆ మాట చెప్పాడో లేదో రాజేశ్వరి న్యూస్ ప్రింట్ అంతా ఖర్చయిపోయింది. బాస్టర్ సిస్టమ్ అమలు చేయడం వల్ల కాలనీలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయ్. ఆ పధ్ధతి ద్వారా నేను కొనాల్సివచ్చిన సిగరెట్లు, బీడీలు –అలవాటు లేకపోయినా తాగక తప్పటం లేదు. శాయీరామ్ అందరికీ తలో బాటిల్ విస్కీ ఇచ్చాడు అది మగవాళ్ళకి బాగానే ఉంది. అయితే చాలామంది ఆడాళ్ళు దాన్ని వెంటనే పారబోసేశారని తెలిసింది.

 

జనార్ధన్ ఒక్కడికే చాలా ఎక్కువ నష్టం వచ్చింది. కాలనీ మొత్తంలో టేబుల్ ఫాన్లన్నీ అలానే ఉండిపోయాయ్. ఎవ్వరూ తీసుకోలేదు. మర్నాడు మా ఆవిడ కూరగాయలమ్మాయి దగ్గర తోటకూర కొంటుంటే ఒక్కటే పావలా అనటం వినిపించింది నాకు. “అదేమిటి – నిన్నేగా పావలాకి నాలుగు కట్టలిచ్చావ్!” అడిగిందామె ఆశ్చర్యంగా. “బడ్జెట్ వచ్చింది గదమ్మా” ఆనందంగా చెప్పింది కూరగాయలమ్మాయి. బడ్జెట్ కూ తోటకూరకూ సంబంధం ఏమిటో నా కర్థం కాలేదు. నేను ఇంకు బాటిల్ కొందామని మా కాలనీ దగ్గర్లోనే ఉన్న షాపుకెళ్ళాను. “ఆర్రుపాయలు సార్” అన్నాడు షాపతను చిరునవ్వుతో ఇంక్ బాటిల్ ఇస్తూ. “అదేమిటి? మొన్నటి వరకు నాలుగు రుపాయలేగా?” “బడ్జెట్ కద్సార్. ధర పెరిగింది” “కానీ బడ్జెట్ లో ఇంక్ ధర పెరగలేదుగా?” “బడ్జెట్ ఎఫెక్ట్ కి కొన్ని ధరలు పెరుగుతాయ్” “ఎఫెక్ట్ అంటే?” “డిఫెక్ట్ సార్ – మీకు తెలీదా?” తెలీదంటే బావుండదని ఇంటికొచ్చేశాను. ఆ పక్కనే హోటల్ ఆసామి గట్టిగా అరుస్తున్నాడు “బడ్జెట్ గురించి పెరిగినాయివయ్యా రేట్లు. రేట్లు ఎందుకు పెరిగినాయంటే ఏమన్నమాట?” అప్పుడేమా కాలనీ ముందు జనార్ధన్ రిక్షా దిగాడు. అతనితోపాటు ఓ మీసాల పెద్ద మనిషి కూడా వచ్చాడు.

 

“నా దగ్గరున్న ఫాన్లు ఈయన కొంటానన్నారు గురూ! అందుకని తీసుకొచ్చాను” అన్నాడు ఆనందంగా. నేనూ రంగారెడ్డి, యాదగిరి కలిసి జనార్ధన్ ఇంటికెళ్ళాం. ఆ పెద్ద మనిషి ఫాన్లన్నీ చూశాడు “ఎంతకమ్ముతావ్?” అడిగాడు మీసాలు దువ్వుకుంటూ. “నేను ఒకోటి నాలుగు వందలకు కొన్నాను. మీరు మూడొందల పాతిక ఇస్తే చాలు” అన్నాడు జనార్ధన్ దీనంగా. మీసాల పెద్దమనిషి గట్టిగా నవ్వాడు. తన జేబులోంచి అయిడెంటి కార్డ్ తీసి చూపిస్తూ “మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను” అన్నాడు జనార్ధన్ భుజం తడుతూ. అందరం అదిరిపడ్డాం! అతను మఫ్టీలో ఉన్న పోలీస్ ఇన్స్ పెక్టర్. “ఆ..... అరెస్టు ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు జనార్ధన్. “ఎందుకేమిటి? బడ్జెట్ ముందురోజు ప్రజావసర వస్తువులను ఎక్కువ ధరకు అమ్ముకోవడం కోసం స్టాక్ చేసినందుకు! దీనినే హోర్డింగ్ అంటారు” అన్నాడతను. “కానీ.... కానీ.... ఇరవై ఫాన్లు కొన్నంత మాత్రాన హోర్డింగ్ ఎలా అవుతుంది?” అడిగాడు శాయీరామ్. “అవునండీ! రేపు బడ్జెట్ అనగా పెట్రోల్ బంక్ వాళ్ళు పెట్రోల్ అమ్మకాలు ఆపేయడం, టి.వి, రేడియో, ఇంకా ఇతర పెద్ద పెద్దకంపెనీల వాళ్ళు తమ స్టాక్ ని రిలీజ్ చేయకపోవటం – ఇవన్నీ హోర్డింగ్ కాదా?” ఆవేశంగా అడిగాడు రంగారెడ్డి. “వాళ్ళు కొటీశ్వర్లు కాబట్టి వాళ్ళ జోలికెళ్ళటానికి మీకు దమ్ముల్లేవు” అన్నాడు గోపాల్రావ్. ఇన్స్ పెక్టర్ మళ్ళీ మీసాలు దువ్వుకుంటూ చిరునవ్వు నవ్వాడు “ఆ చిన్న పిల్లల ప్రశ్నలన్నీ రేపు కోర్టులో జడ్జిగారి నడగండి!” చివరకు అందరం ఇన్స్ పెక్టర్ ని బ్రతిమాలడక తప్పలేదు. “బాబ్బాబు! ఈ రూపాయిలుంచుకోండి! మా వాడిని వదిలేయండి” అన్నాడు శాయీరామ్. ఇన్స్ పెక్టర్ మళ్ళీ మీసాలు దువ్వుకున్నాడు “పాతికా అహహ్హహ్హ- వెధవ రాంగ్ సైడ్ పార్కింగ్ కేస్ పట్టుకుంటే చాలు యాభై దొరుకుతాయ్. ఇంత పెద్ద కేసుకి పాతికా?” “పోనీ యాబై తీసుకోండి.”

 

“అహహ్హహ్హ – సినిమా హాల్లో సిగరెట్ తాగిన కేసుకే డెబ్బయ్ ఇస్తారు ఇంత పెద్ద కేసుకి యాబయ్యా?” “బాబ్బాబు – పిల్లలు, ఫాన్లు గలవాడు. వాడిమీద దయ చూపండి. ఓ వంద తీసుకుని వదిలెయ్యండి” “ఇదే కేసుకి నిన్నయితే వందే తీసుకునే వాడినయ్యా – ఇవాళ కూడా వందే ఇస్తానంటే ఎలా? నూట యాబై ఇవ్వండి” “అదేమిటి? నిన్నటికీ ఇవ్వాల్టికీ యాబై పెంచారా?” “అవునయ్యా – బడ్జెట్ వచ్చింది కదా, మావూళ్ళో ధరలు పెంచారు” “బడ్జెట్ లోఅంటే మరీ బడ్జెట్లో అని కాదు – బడ్జెట్ ఎఫెక్ట్ అంటారు దీనిని....” “ఎఫెక్ట్ అంటే?......” అని అడగబోయి “తెలుసులెండి డిఫెక్ట్” ఆన్నాను నేను. కేసు మాఫీ అయిపొయింది