సిల్లీ ఫెలో - 81

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 81

- మల్లిక్

 

ఆఫీసుకు లేటుగా వచ్చాననీ వ్యంగ్యం!... అనుకున్నాడు.

"కూర్చోమంటుంటే ..." అన్నాడు ఏకాంబరం చాలా చనువుగా.

మోహన్ కూర్చోబోయాడు.

"నువ్వు కాదు.. నువ్వు నిలబడే వుండు. మా బుచ్చి కూర్చుంటాడు!"

అబ్బే.. వద్దుసార్! ... సారీ సర్!! అసలు ఆలస్యం ఎందుకయ్యిందంటే... నేను వంట చేసేసరికి .. బుచ్చిబాబు నసుగుతూ చెప్పబోయాడు.

"సర్లేవయ్యా.. ఆలస్యం అయితే అయింది. ఆఫీసులో ప్రతి కిల్లారికిత్తిగాడూ ఆలస్యంగా వస్తున్నాడు. నువ్వొక్కడివి ఆలస్యంగా వచ్చినంత మాత్రాన కొంపలేం మునిగిపోవులే..." గబగబా నవ్వేస్తూ అన్నాడు ఏకాంబరం.

మోహన్ కి అంతా అయోమయంగా ఉంది. తమని జాయినయ్యిన క్షణం నుండీ చిత్ర విచిత్రమైన తిట్లతో దులిపేస్తున్న ఏకాంబరం బుచ్చిబాబుతో యెంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు?!... ఏంటీ వీళ్ళిద్దరికీ కనెక్షన్?...

మోహన్ ఆలోచిస్తున్నాడు.

"ఇతను హైదరాబాద్ లో నా క్రిందే పనిచేసేవాడు.. చాలా మంచి వర్కర్... పెద్ద డింగాళ డిప్పి!..." మోహన్ తో అన్నాడు ఏకాంబరం.

మోహన్ నాలిక్కొరుకున్నాడు.

అన్నట్టు వీళ్ళిద్దరూ హైదరాబాద్ బ్రాంచి నుండేగా వచ్చింది?... ఆ విషయమే మర్చిపోయాను! అనుకున్నాడు.

"మంచి వర్కర్ అని పొగుడుతూనే డింగాల డిప్పి అని తిడ్తున్నారేంటి సార్!..." అమాయకంగా అడిగాడు మోహన్.

"అందుకే నీలాంటి వాళ్ళని గుర్రాల బుర్రి అంటారు! డింగాల డిప్పి అంటే తిట్టు కాదు.. పొగడ్త! నీకింకా కొత్త కదా... ముందు ముందు నీకే అర్థం అవుతుంది!" మోహన్ తో అని బుచ్చిబాబు వైపు తిరిగాడు ఏకాంబరం.

"అవునోయ్.. ఇందాక నువ్వేంటి వంటా గింటా అంటున్నావ్? ఇంకా ఎన్నాళ్ళిలా అవస్థ పడతావ్? త్వరగా పెళ్ళి చేసుకో. బెండకాయ ముదిరినా, లింగు లిటికాయ్ ముదిరినా పనికి రాడంటారు..."

"హి హి హి... అదేనండీ మరి!" అన్నాడు బుచ్చిబాబు ఏమనాలో తెలీక నవ్వేస్తూ.

మోహన్ బుచ్చిబాబు వంక ఆశ్చర్యంగా చూశాడు.

"నువ్విహ వెళ్ళవోయ్... మేం కాస్త పర్సనల్ మాట్లాడుకోవాలి. సాయంత్రంలోగా నేను చెప్పిన పనంతా పూర్తి చేసి యింటికెళ్ళాలి!" అన్నాడు ఏకాంబరం మోహన్ తో.

మోహన్ క్యాబిన్ లోంచి బయటకి వెళ్ళిపోయాడు.