సిల్లీ ఫెలో - 79

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 79

- మల్లిక్

 

తెల్లారింది.

బుచ్చిబాబు కళ్ళు తెరిచి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ గడియారం వంక చూశాడు.

ఏడు గంటలయింది.

అమ్మో అనుకుంటూ మంచం మీద నుండి లేచాడు. ఆరోజు అతను ఆఫీసుకు వెళ్ళాలి. సీత ఎప్పుడు లేచిందో ఏమోగాని ఆ గదిలోలేదు. బుచ్చిబాబు గదిలోంచి బయటకి వచ్చాడు. సీత హాల్లో కూర్చుని న్యూస్ పేపర్ చదువుతూ వుంది.

"నువ్వెప్పుడు లేచావ్ సీతా?" అడిగాడు బుచ్చిబాబు.

"చాలా సేపయింది..." తల త్రిప్పకుండా పేపర్లోకి చూస్తూనే సమాధానం చెప్పింది సీత.

"మొహం కడుక్కున్నావా?"

"ఊ..."

బుచ్చిబాబు గబగబా పళ్ళు తోముకుని సీత ప్రక్కన కూర్చున్నాడు. ఆమె అప్పటికే న్యూస్ పేపరు చదివేసింది. ఆ పేపరుని అందుకుంటూ "కాపీ... అన్నాడు బుచ్చిబాబు.

"కాఫీ అంటే పరుగెత్తుకువస్తుందా?... కాఫీ పెట్టాలికదా?" అంది సీత.

"హబ్బో... హబ్బో! ఏం సిల్లీజోకు?... మరి తీసుకురా" అన్నాడు బుచ్చిబాబు.

"ఆహా!... ఏం దర్జా!!... ఏం? నువ్వేమయినా నా మొగుడివా ఆర్డర్లు వేస్తున్నావు?" కూల్ గా అంది సీత.

బుచ్చిబాబు చేతిలోని న్యూస్ పేపరు జారి క్రిందపడింది. అతను కళ్ళు పెద్దవి చేసి వెర్రిమొహం వేసుకుని సీతవంక చూశాడు. ఆమె కొట్టిన డైలాగు కొంత అర్థంకానట్టు ఎంతో అర్థం అయిపోయినట్టూ అనిపించింది.

"మనం పెళ్ళి చేసుకోలేదనీ, మనం భార్యాభర్తలము కాదనీ పాపం తమరు మర్చిపోయినట్టున్నారు!" సీత గొంతులో వ్యంగ్యం!! "హమ్మ రాధా!... ఎంత దెబ్బ కొట్టావే తల్లీ!" అనుకున్నాడు బుచ్చిబాబు.

"అయితే ఇప్పుడేమంటావ్?" బింకంగా అన్నాడు బుచ్చిబాబు.

"నేను నీకు పెళ్ళాన్ని కానుకాబట్టి నీకు సేవలు చేసే అవసరం నాకు లేదు. మనం స్నేహితులం... అంతే కదూ?"

బుచ్చిబాబు వెర్రిమొహం వేసుకుని బుర్రకాయ్ ఊపాడు.

"కాబట్టి ఇంటిపనులు మనిద్దరం హాయిగా కలిసి చేసుకోవాలి... వంతులవారీగా, ఇన్నాళ్ళూ నేను చేశాను. ఈవాల్టినుండి నువ్వు చెయ్యాలి! ఇంటి పనీ, వంటపనీ ఒకవారం నీది, ఒకవారం నాది..."

సీతం మొహంలో విజయగర్వం.


బుచ్చిబాబు ఊహించని ఈ పరిణామానికి దెబ్బతిన్నాడు. అతని మొహం పాలిపోయింది.

"ఏం... నేను చెప్పింది కరక్టుకాదా?" అడిగింది సీత.

కరెక్ట్ కాదని ఎలా అనగలడు?

"కరెక్టేననుకో.. నసుగుతూ ఏదో అనబోయాడు బుచ్చిబాబు.

సీత వెంటనే అందుకుంటూ అది "వెరీగుడ్. అందుకే వంటగది గట్టు మీద పాల ప్యాకెట్లున్నాయ్... కట్ చేసి గిన్నెలోపోసి, పాలు మరగబెట్టి, కాఫీ పెట్టుకురా... కాఫీ తాగిన తర్వాత వంట మొదలుచేద్దువుగాని...

బుచ్చిబాబు పూర్తిగా అర్థం అయ్యింది... అని తనను దెబ్బ తియ్యడానికి ఆ రాధ ఇచ్చిన సలహానే అని. ఏది ఏమైనా వాళ్ళు మంచి పాయింటునే లాగారు. అయినా సరే తను ఓడిపోకూడదు. తనది చాలా ఆదర్శం!... దానికోసం ఇలాంటి చిన్న చిన్న కష్టాలకు ఓర్చుకోవాలి!! బుచ్చిబాబు లేని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుని వంటగదివైపు అడుగులు వేశాడు.


*          *        *