సిల్లీ ఫెలో - 14

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 13

- మల్లిక్

 

"అవును మరి టింగారి టింబిలే పెళ్ళి చేస్కుంటారు...."

"అంటే మీరు కూడా?"

"అవును..... నేను కూడా టింగారి టింబినే. ఒట్టి టింగారి టింబిని కాదు. టింగారి టిస్కి టింబినే... ఎందుకంటే పెళ్ళి చేస్కోవడం వట్టి తెలివితక్కువ పని అని తెలిసి చేస్కున్నాను"

"టింగారి టిస్కి టింబి అంటే ఏంటి సార్?" కుతూహలంగా అడిగాడు బుచ్చిబాబు.

"వద్దు నేను చెప్పను. చెప్తే నా పరువుపోతుంది. ఈ మాత్రం దానికే ఏది పెద్ద ఘనకార్యం చేసినట్లు స్వీట్లు! ఏదీ బాక్సు?"

బుచ్చిబాబు స్వీట్ బాక్సుని అతని ముందుకి చాపాడు.

ఏకాంబరం అందులోంచి మరో స్వీట్ ముక్కని తీస్కుని నోట్లో కుక్కున్నాడు.



"బెబ్బెబ్బుబూ?" నోటినిండా స్వీటుంచుకుని అడిగాడు ఏకాంబరం.

"ఫరవాలేదు. స్వీటు తిన్నాకే అడగండి సార్" వినయంగా అన్నాడు బుచ్చిబాబు.

ఏకాంబరం స్వీటు మింగేసాడు.

"అదే. పెళ్ళెప్పుడు అని అడుగుతున్నా!"

"ఇంకా ముహూర్తం నిర్ణయించలేదు సార్!"

శుభం. వీలైనంత దూరంగా పెట్టుకో." అని ఫైళ్ళలో తల దూర్చేసాడు ఏకాంబరం.

ఆ తర్వాత ఆఫీసులో మిగతా స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచి విషయం చెప్పాడు బుచ్చిబాబు.

వాళ్ళలో 'ఆహా అలాగటోయ్? కంగ్రాట్స్!" అన్నవాళ్ళూ వున్నారు.

"అయ్యోపాపం. అయితే ఇరుక్కుపోతున్నావన్నమాట" అన్న వాళ్ళు కూడా ఉన్నారు.

వాళ్ళ కామెంట్స్ అతను పట్టించుకోలేదు. అతను సంతోషంగానే వున్నాడు.

సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికెళ్ళడానికి బస్టాండ్ కి వెళ్తుండగా వెనుక 'బుచ్చిబాబూ' అని పిలుపు వినిపించింది.

బుచ్చిబాబు ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

వెంకట్రావ్!

నవ్వుతూ ఆగమన్నట్టుగా సైగ చేస్తున్నాడు.

బుచ్చిబాబు ఆగాడు. వెంకట్రావ్ గబగబా అడుగులు వేస్తూ బుచ్చిబాబుని చేరుకున్నాడు.

వెంకట్రావ్ బుచ్చిబాబు ప్రక్క సెక్షన్లో పని చేస్తాడు.

"ఏంటోయ్ బుచ్చిబాబూ, నీకు పెళ్ళి కుదిరిందటగా? మీ సెక్షన్లో అందరికీ స్వీట్లు పంచావన్నమాట. మరి మాకేం లేదా?" అడిగాడు వెంకట్రావు.

బుచ్చిబాబు ఇబ్బందిగా నవ్వాడు.

"బస్టాండుకేగా?.... పద నేను కూడా వస్తాను"

ఇద్దరూ అడుగులు ముందుకు వేసారు.