Saradaga Kasepu-3

సరదాగా కాసేపు -3

-కన్నోజ్ లక్ష్మీకాంతం

కొంతమందికి జోకులు వేయడం రాదు.పోనీ రిసీవ్ చేసుకుంటారా అంటే అది లేదు.మా ఆచారికి జోక్ చెబితే అర్థంకాక తనకున్న బట్టతలా గోక్కుంటాడు.ఈలోగా అందరూ నవ్వాక అప్పుడు వెలుగుతుందతనికి.

జోకనేది నర్మగర్భంగా వున్నా వెంటనే అర్థం చేసుకుని నవ్వితేనే చెప్పిన వాడిక్కూడా మజా అనిపిస్తుంది.లేకపోతే వీడిముందు నాగురించి ఎందుకు చెప్పావంటూ ఆ జోకేడుస్తుంది పాపం.

“లంచం తీసుకుంటూ దొరికిపోతే ఎలాగండీ ? ” అన్నాట్ట ఒకాయన.

“దాన్దేముందండి. వెరీ సింపుల్.లంచమిచ్చి బయట పడాల్సిందే " అన్నాట్ట ఇమీడియట్. సుతిల్ బాంబు చిన్నగా వున్నాబాగా పేలుతుంది.

“ఏమండీ...ఆ ఎదురింటాయనను చూశారా!ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లేముందు ఎంచక్కా వాళ్ళావిడకో ముద్దిచ్చి,టాటా చెప్పి వెళుతుంటాడు. మరి మీరున్నారు ఎందుకూ ? ” అంది భార్య. “ఆడిపోసుకుంటావెందుకే అలా చేయడం నాకూ యిష్టమే కానీ...ఆవిడ ఒప్పుకోవాలి గదా " అన్నాట్ట అయోమయంగా. అమాయకంగా అనుకుంటాముగానీ అతితెలివిగా జవాబిస్తారు

కొందరు.నవ్వకుండానే నవ్వించేస్తారు. అదో గొప్పవరం. ఒకాయన జోస్యం చెప్పించుకుంటున్నప్పుడు

" మీ భార్య తొందర్లో మర్డర్ చేయబడుతుంది " అని చెప్పాడు. ఆ సంగతి నాకూ తెలుసండీ...కానీ,నేను పట్టుబడకుండావుంటానా...అనే విషయం చెప్పండి.” అని నాలుక్కరుచుకున్నాడు.

నాణ్యమైన జోకులే సభారంజకంగా వుంటాయి. గానీ నాటు జోకులన్నీ కేవలం ప్రెండ్స్ దగ్గరే...అనే విషయం మరిచిపోకూడదు. ఏ విషయం ఎలా చెప్పినా, ఏ మాట ఎవరితో మాట్లాడుతున్నా ఎదుటి వ్యక్తికీ ఏవగింపు గానీ ఇరిటేషన్ గాని రాకూడదు మరి. మెచ్చేరీతిలో,నచ్చే దోరణిలో వుంటే సమస్యలు చాలా మట్టుకు రావేమోననిపిస్తుంది.

“నువ్వు కాసేపు నోరు మూస్తే నేనేదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను " అన్నాడు భర్త. అంతే...! దానికి అతని భార్య గబుక్కున అతని నోరు మూసేసి " మీరు చెప్పినట్టు చేయడం నా ధర్మం కదండి.” అంది. కొంతమంది ఏం మాట్లాడినా అర్థాన్ని అలవోకగా మార్చేస్తుంటారు.అది వాళ్ళ నైపుణ్యం మరి.

ఏది ఏమైనా,ఏ జోక్ ఎలా చెప్పిన హాస్యం...అపహాస్యం కావద్దని పదే పదే గుర్తు చేసుకుంటూ వుండాలి. అప్పుడే జోక్ చెప్పిన వాళ్ళు, ఆ జోక్ విన్న వాళ్ళు ఇద్దరూ,అందరూ హాయిగా నవ్వుకుంటారు.అది మనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా మనం నవ్వుకుంటాం.