ప్రసాద్ మాస్టారు

గాంధీ జయంతి రోజు, హాస్పిటల్ కు సెలవు కాబట్టి, ఇంట్లో కూచుని హాయిగా, వరల్డ్ స్పేస్ లో పాటలు వుంటున్నాను. అంతలో ఫోను మోగింది. “కమ్మని సంగీతం మధ్యలో ఈ అపశ్రుతి ఏమిటా? ‘అనుకుంటూ ఫోన్ ఎత్తుకున్నాను, క్షణంలో నా గొంతు, మూడ్ మారిపోయింది. అవతల ఎవరో కాదు. స్వయానా ప్రసాద్ మాష్టారు.

“నవ్యలో నీ కాలమ్ చదువుతున్నాను. బాగుంది. నీతో మాట్లాడుతున్నట్లుంది” అని మాటల్లో అదే సంస్కారం, అదే ఆప్యాయత. ఆనందంతో గంతులు వేసిన మనసు, 35 సంవత్సరాలు వెనక్కి లాక్కెళ్ళింది. అది 1972వ సంవత్సరం. బాపట్లలో ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాను. మా నాన్నగారు అగ్రికల్చరల్ కాలేజీలో లెక్చరర్. ఉద్యోగరీత్యా అమెరికాలో వుండేవారు అప్పుడు.

మనది తెలుగు మీడియమే అయినా, అమెరికాకి తెలుగు బాగుండదని, స్టయిల్ గా ఇంగ్లీషులో ఉత్తరం రాశాను. వినడానికి ఇది చాలా చిన్న విషయం లాగుండొచ్చు కానీ – నా జీవిత గతినే మార్చివేసిన సంఘటనకు పునాది ఇది. అంతే కాదు నాకు గుర్తుండిపోయిన అవమానాల పరంపరలో అగ్ర తాంబూలం జరగాల్సిన ఇన్సల్ట్ జరిగింది కూడా ఈ ఉత్తర వల్లనే, ఇన్సల్ట్ ఏమిటంటే.. నా ఉత్తరంలోని ఇంగ్లీషులో ప్రతి వాక్యానికి సగటున ఐదు తప్పులు సవరించి, వాటిని అండర్ లైన్ చేసి నా పితృదేవుడు నాకు తిరుగు టపాలో పంపారు.

అంతటితో ఆగకుండా, “నీ చెల్లిని చూసి సిగ్గు తెచ్చుకోరా. అది ఎంత బాగా రాసిందో ఇంగ్లీషులో” అని పుండు మీద మంచి గుంటూరు కారం రాశారు. ఈ రాక్షసి చెల్లి, మా బాబాయి కూతురు శైలజ, అది ఎద్ద పుడింగులాగా, ఇప్పుడే రాయాలా ఉత్తరం? అది చిన్నప్పట్నుంచీ ఇంగ్లీష్ మీడియమ్. అది తప్పులు లేకుండా రాయడం గొప్పా? ఏమిటి? అది అలానే తప్పులు లేకుండా తెగ చదివేసి, ‘శైలజా మేడమ్’ పేరుతో కాకినాడలో ఆశ్రమ్ స్కూల్ కి ప్రిన్సిపాల్ అయిపొయింది ప్రస్తుతం.

ఈ ద్వంద్వ అవమానాలు గురించి పడవ తరగతి నుంచి స్నేహితుడైన మోహన మురళికి చెప్పుకొని భోరున ఏడ్చినంత పనిచేశాను. వాడు ‘ఒరేయ్ – మా అన్న ఎమ్మెస్సీ అయిపోయి ఖాళీగా వున్నాడు. నాకు అప్పుడప్పుడు క్లాస్ తీస్తుంటాడు (అందరు అన్నల్లాగే!) నువ్వూ కూడా రా. కాస్త ఇంగ్లీషు నేర్చుకొని, ఆ అవమాన భారం నుంచి బయటపడి చద్దువు కాని” అంటూ వాళ్లింటికి తీసుకెళ్లాడు. ఆ రోజు బాగా గుర్తు. బాపట్లలో ఆంజనేయస్వామి గుడి దగ్గర ఇల్లు. ఆయన నారో ప్యాంట్, హాఫ్ స్లీప్స్ షర్ట్ టక్ చేసుకొని తల మీద ఒక్క వెంట్రుక కూడా లేవకుండా నున్నగా దువ్వుకొని ట్రిమ్ గా వున్నావు. నా గోడంతా విని బాధపడొద్దు. నీ తప్పులు ఎంచిన మీ నాన్నగారి ఇంగ్లీష్ కరెక్ట్ చేసే స్థితికి నిన్ను తీసుకెళతాను” అని ఆయన అన్న ప్రోత్సహింపు హక్కులు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే వున్నాయి.

ఆ తర్వాత రెండేళ్లు ఆయన సాన్నిధ్యంలో నా జీవితమే మారిపోతుంది. ఆయనే ప్రసాద్ మాష్టారు. జన్మనివ్వడమే కాకుండా ఆ జన్మను సార్ధకం చేసుకునే విలువలను నేర్పించిన అమ్మా – నాన్నలకు ఎంత ఋణపడి ఉన్నానో, జీవితానికి గమ్యం, ఆ గమ్యం చేరడానికి కావలసిన వ్యక్తిత్వం అందించిన ప్రసాద్ మాష్టార్ కి అంతే ఋణపడి వున్నాను. మనలో చాలా మందికి, ఈ రకంగా మనసుకు హత్తుకుపోయి, జీవిత గమనాన్నే మార్చే మాష్టార్లు తారసపడ్తుంటారు. ఇలాంటి గురువులు దొరకడం మన పూర్వజన్మ సుకృతం కాదా?

ఈ రోజు మనం ఇన్ని మెట్లు ఎక్కి, మనకంటూ ఓ స్థానం సంపాదించామంటే, ప్రతి ఒక్కరి వెనుక ఎక్కడో, ఎప్పుడో, ఓ అమృతగురుహస్తం వుండే వుంటుంది. ఫలాపేక్ష లేకుండా వేలు పట్టుకుని నడక నేర్పించి, తప్పటడుగులు వేస్తుంటే బెత్తం జాడించి ఎంత మందికో జీవన గతిని నిర్దేశించిన ఈ మహానుభావులు, దైవాంశ సంభూతులు. ఇద్దరితో మొదలయిన ‘ప్రసాద్ మాష్టారికం’ రెండేళ్లలో మూడు వందల విద్యార్థులు దాటిపోయింది. బాపట్లలో మాష్టారి దగ్గర చేరాలంటే రికమెండేషన్ కావాల్సి వచ్చేది. ఆయన దగ్గర సీట్ సంపాదించడం స్టేటస్ సింబల్ అయిపొయింది. టెర్రస్ మీద క్లాసులు, ఉదయం నాలుగింటికే మొదలయ్యేవి. కొంతమంది మాష్టారింట్లోనే పడుకుండిపోయేవారు. చదువే కాదు. బోల్డన్ని కబుర్లు కూడా. సిన్మాల గురించి, పాటల గురించి, సాహిత్యం గురించి, క్రికెట్ క్లబ్ ఒకటి మొదలుపెట్టాం కూడా, కారమ్ బోర్డు పోటీలు జరిగేవి. మాష్టారు “ఆ రజనీకర మోహన బింబం” పాడుతూ వుంటే. తన్మయత్వంలో మునిగి పోయేవాళ్లం. మా అందరి జీవితాలూ ఆ రెండు సంవత్సరాలు, ఆయన చుట్టే అల్లుకుపోయాయి. చాలా మందిమి, ఇళ్లకు భోజనానికి, స్నానానికి మాత్రమే వెళ్లేవాళ్లం. మిగతా కాలమంతా ఇక్కడే.

ఎన్ని తీపి జ్ఞాపకాలో, ఎన్ని సత్ సాంగత్యాలో, ఓ పసిపాపలా, పకపకా నవ్వే, మంచి స్నేహితుడు మస్తాన్ వలి దొరికింది ఇక్కడే కదా. ఇక నా ఇంగ్లీష్ సంగతికొస్తే, మాష్టారు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసేవారు. ముందు హిందు పేపర్ ఎడిటోరియల్ చదివించే వాళ్లు. తర్వాత జేమ్స్ హాడ్లీ చేజ్ నవల్స్ పరిచయం చేశారు. అవే నా మొదటి ఆంగ్ల సాహిత్య అస్వాదనలు. చేజ్ నవలలు చాలా మంది చదివే వుంటారు. ఎవరైనా చదవకపోతే చదవండి. అద్భుతంగా వుండేవి.

డిటెక్టివ్ సాహిత్యం. “A World in my pocket’ ప్రతి పేజీ ఇంకా గుర్తే, మధ్యలో ఎస్సే రైటింగ్ ప్రాక్టీసు. ఫ్రెండ్ షిప్ మీద ఓ సారి, బాగానే రాశాననుకున్నాను. కరెక్ట్ చేసి అందరికీ పేపర్లు ఇచ్చారు. నాది రాలేదు. టెన్షన్ పడుతుండగా, మాష్టారు ణా ఎస్సేని బెస్ట్ ఎస్సేగా ప్రకటించి నా బాషని, భావ ప్రకటనని ఎంత మేచ్చుకున్నారంటే – తెగ సిగ్గుపదిపోయాను. ఆ వ్యాసం, ఆ అభినందన నా గుండెల్లో ఇంకా పదిలం. కొన్ని వాక్యాలు ఇంకా గుర్తే, F.R.I.E.N.D. అంటే Fellow Ready In Every Need and Deed అని రాశాను. నా సొంతం కాదు ఎక్కడో చదివింది. అల మలుపు తిరిగిన నా ఆంగ్ల ప్రస్థానం. మాష్టారి దయవల్ల ఇంటర్మీడియెట్ లో యూనివర్శిటీ ఫస్ట్ స్థితికి ఎదిగింది. ఆ తర్వాత మా నాన్న అమెరికాలో ఆయన స్నేహితులకి, నాతో లెటర్స్ రాయించుకునే వారు. నిజెం..సత్తెప్రేమాణంగా... ప్రస్తుతం ప్రసాద్ మాష్టారు విజయనగరంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బోల్డంత మందికి శిక్షణ ఇస్తుంటారు. మధ్యలో టైం తీసుకొని వైజాగ్ వెళ్లి సిండికేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసోస్తుంటారు. మాష్టారికి అన్ని విధాలా సరిపోయే శ్రీమతి దొరికింది. ఇద్దరు కూతుళ్లు. స్పందన, వందన. (మాష్టారు మీరు వందేళ్లుండాలి. ఇంకా ఎన్నో వందల మంది జీవితాల్లో వెలుగు నింపాలి). (ప్రసాద్ మాష్టారు లాంటి మహానుభావులు మరెంత మందో, వారందరికీ నా నమస్సుమాంజలి).