Navvule-Navvulu 16

నవ్వులే నవ్వులు - 16

***************************************************************

సేల్స్ మెన్

“మా కంపనీలో సేల్స్ మెన్ ఉద్యోగం కావాలని అంటున్నావు కదా!నీకు అనుభవం ఉందా?” అడిగాడు సేల్స్ మేనేజర్.

“ ఉందిసార్!పక్కింట్లో టి.వీ.ని అమ్మేశాను.మా ఆవిడ నగలు అమ్మేశాను.దొరికిన ప్రతి సెల్ ఫోన్ అమ్మేశాను.ఉద్యోగం ఇస్తారా సార్ !” ఉషారుగా చెప్పాడు సేల్స్ మెన్.

***************************************************************

మతిమరుపు భార్య

“ డాక్టర్...మా ఆవిడ ప్రసవించిందా ?” అడిగాడు సుందరం.

“ ఇంకా లేదండి " చెప్పాడు డాక్టర్.

“ దానికి అసలే మతిమరుపు.కాస్త ప్రసవించమని అప్పుడప్పుడు గుర్తు చేస్తుండండి డాక్టర్ " నవ్వుతూ అన్నాడు సుందరం.

“ఆఁ...” ఆశ్చర్యంగా నోరు తెరిచాడు డాక్టర్.

***************************************************************

డైమండ్ నెక్లెస్

“ నిన్ను చూస్తుంటే నా కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి ఉషా !” ఆనందంగా అన్నాడు అభిరామ్.

“ అంత అందం నాలో ఎక్కడుంది అభిరామ్ ? ” అంది ఉషా.

“ నీ మెడలోని డైమండ్ నెక్లెస్ రూపంలో వుంది ఉషా.” అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు అభిరామ్.

***************************************************************

నాకు పది దాటాయి కదా!

“ మీ చుట్టాలింట్లో పెళ్లి విందుకు పిలిచారన్నావ్...మరి ఎందుకు వెళ్ళలేదు ?” అడిగాడు చింటు.

“ నేను వెళ్ళడానికి వీల్లేదురా...” అన్నాడు బంటి.

“ అదేంటి "

“ అదికాదురా...శుభలేఖ మీద..విందు ఏడునుంచి పది వరకు అని రాసి వుందిరా...మరి నాకు పది దాటాయిగా...” అమాయకంగా చెప్పాడు బంటి.

***************************************************************

నీకో సగం -నాకు సగం

“ రాజ్యం, భోజనం వడ్డించవే.ఆఫీసుకు టైం అవుతున్నది " కంగారు పడుతూ అన్నాడు భర్త.

“ రైస్ సగమే ఉడికిందండి " అంది భార్య రాజ్యం.

“ అయితే ఉడికిన ఆ సగం నాకు పెట్టి, మిగిలిన సగం నువ్వు ఉడికించుకుని తాపీగా తిను " అన్నాడు భర్త.

“ ఆఁ..” ఆశ్చర్యంగా నోరు తెరిచింది భార్య.

***************************************************************