Rating:             Avg Rating:       1461 Ratings (Avg 5.04)

Naa Istham - Mee kashtam

నా ఇష్టం – మీ కష్టం అదో నిశీధి రాత్రి, గుంటూరు మెడికల్ కాలేజీ మెన్స్ హాస్టల్ - న్యూ బ్లాక్ రూం నెంబర్ 36. బయట వర్షం హోరు. లోపల కుర్రతనం జోరు. ఆ బలహీన క్షణంలో కలం జారాను. మొదటి సారిగా. 1980 నాటి మాట. దాని ఫలితం "రెండు జడలు - మూడు ముళ్ళు - నాలుగు కళ్ళు" అనే కధ కాలేజీ మ్యాగజైన్ లో అచ్చయ్యింది (అంతే కాదు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది అని చెప్పుకోను. ఎందుకంటే Modesty మా ఇంటి పేరు) అప్పటి నుంచి మళ్ళీ ఎన్నో బలహీన క్షణాలు ఎదురైనా నిభాయించుకున్నాను. నిగ్రహించుకున్నాను. కానీ చివరాఖరుకి నా క్లాస్ మేట్ భార్గవి ప్రోద్బలంతో, శ్రే రమణ గారి ప్రేరణతో మరోసారి రాయక తప్పడం లేదు. “అసలు నువ్వెవడివయ్యా? ఎవడు పడ్తే వాడు రాస్తుంటే చదవడానికి మాకేం పనీపాటా లేదనుకున్నావా??” అని మీరందరూ నా సెర్వికల్ స్పైన్ (సారీ అప్పుడప్పుడూ మెడికల్ టర్మ్స్ దొర్లక తప్పదు) పట్టుకుని దులుపుతారని తెలుసు. అందుకే ఈ ఉపోద్ఘాతం అనబడే ముష్టిఘాతం. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు గురవా రెడ్డి. తెగ మోటుగా ఉందని, నా కుర్రతనంలో యద్దనపూడి నవలలు చదివి నాకు నేనే చాలా స్టయిల్ గా ఎన్నో పేర్లు పెట్టుకున్నాను. రాజశేఖర్, రవి, వగైరా వగైరా. పెరుగుతున్న రోజుల్లో బాడీ, లెగ్స్ సమపాళ్ళ పెరుగుదలలోతేడా వచ్చి కాళ్ళు మునక్కాడల్లా ఎదిగినపుడు గిట్టని పోట్టివాళ్ళు పెట్టిన పేరు 2:1 (అంటే రెండు వంతులు కాళ్ళు - ఒక వంతు బాడీ అన్నమాట). మెడికల్ కాలేజీలో నారో ఫ్యాంట్స్ వేసినప్పుడు మళ్ళీ గిట్టనివాళ్ళు పెట్టిన పేరు 'గొట్టం గురవా రెడ్డి'. కాలేజీలో అమ్మాయిలు ఏమేమి పేర్లు పెట్టారో నాకూ నిజంగా తెలీదు (ఒకవేళ తెలిసినా మీ అందరితో పంచుకోవాలని రూలేం లేదు) చివరగా నా శ్రీమతి పెట్టిన పేరు - 'గురివి' (ఇది 'కొరివి' అన్న మాటకు భావంలో, రాగంలో, శబ్దంలో దగ్గరగా ఉంటే నేనేం చేయను?). ఇక నా స్టయిల్ - మహా తొందర మనిషిని. చిన్నప్పటి నుంచి అంతే. ఎంత తొందరంటే మా అమ్మ గుంటూరులో పురిటి నొప్పులతో హాస్పిటల్ కి వెళ్ళేదాకా కూడా ఆగలేకపోయాను. రిక్షాలో పుట్టేశాను. (దీన్నే మెడికల్ టెర్మినాలజీలో ప్రిసిప్టేట్ లేబర్ అంటారన్న సంగతి అప్పుడు నాకూ తెలీదు) నేను పుట్టిన క్షణంలో కరెంట్ పోయి గాడాందకారం అనీ, రిక్షాటైర్ పంక్చర్ అయిందనీ, భోరున వర్షం అనీ నేను చేప్తే మీరు 'పోదూ మరీ అతిశయోక్తి' అంటారని తెలుసు. కానీ నిజం.

నక్కలు, తోడేళ్ళు అరుపులు కూడా వినబడ్డాయని కొందరు బంధుజనం చెవులు కొరుక్కుంటారు ఇప్పటికీ. అది వేరే సంగతి. నా బాల్యం అంతా బాపట్లలో గడిచింది. నా తల్లిదండ్రులు సత్యనారాయణరెడ్డి, రాజ్యలక్ష్మి. మా నాన్న గారు అగ్రికల్చర్ కాలేజీ, బాపట్లలో Professor. ఇద్దరు తమ్ముళ్ళు. పెద్దోడు హరి దుబాయిలో - చిన్నోడు నరసింహారెడ్డి అమెరికాలో. భార్య భవాని - డాక్టర్, ఇద్దరు పిల్లలు. ఆదర్శ్, కావ్య, ఇద్దరూ Medicine లోనే ఉన్నారు. నేను గుంటూరులో ఎంబిబియస్, తర్వాత పుణెలో ఆర్దోపెడిక్స్ పట్టా పుచ్చుకున్నాను. తర్వాత 10 ఏళ్లు ఇంగ్లాండ్ లో రాణిగారి సేవలో, లేడీ డయానా చనిపోయిన తర్వాత ఇక ఆ దేశంలో గ్లామర్ లేదనిపించి ఇండియాకి తిరుగు రవాణా. ప్రస్తుతం హైదరాబాద్ లో జాయింట్ రిప్లేస్ మెంట్ సర్జన్ గా జీవితం. పేషంట్ల జీవితాల్లో వెలుగు, మోకాళ్ళలో జిగురు నింపాలనే ప్రయత్నంలో భాగంగా Sunshine Hospital ని అంకురార్పణ చేశాను. తిండిపోతు గుణం నిండుగా, మెండుగా ఉన్న మూలాన, “సదుపాయంగా ఉంటుందిలే" అని, Paradise Hotel ప్రక్కనే Hospital పెట్టి బిరియానీ రుచులు ఆస్వాదిస్తూ, మధ్యలో time దొరికిన్నాడు పేషంట్లను చూస్తూ జీవితం "మూడు ఎముకలు - ఆరు జాయింట్లు"గా గడిపేస్తున్నాను.

అరిగిన కీళ్ళు మార్చి, కొత్త కీళ్ళు వేయడం వృత్తి. ఖాళీ టైంలో పాటలు వినడం, పుస్తకాలు చదవడం ప్రవృత్తి. మీరిప్పటి దాకా గొప్ప కవుల్ని, ఇంకా గొప్ప రచయితల్నీ చదివుంటారు. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటంటే - ఏవీ లేకపోవడమే. నేను మీలో ఒకడ్ని. మీలా ఒకడ్ని. కాబట్టి నా భావాలు, మాటలు మీకూ ఎక్కడో విన్నట్లే ఉంటుంది. ఇక నేను ప్రతివారం మీ అందరితో ముచ్చటిస్తాను. దేని గురించి? అని అడగద్దు. ఒకటని కాదు ఏది తోచితే దాని గురించి. ఎప్పుడూ రోగాలూ, రొష్టులు గురించి మాట్లాడను. భయపడొద్దు నా భావాలూ, అనుభవాలూ, మీతో పంచుకుందామని ప్రయత్నం. దీనికో శైలీ, శిల్పం లేవు. కథా కమామీషు అంతకంటే లేవు. సింపుల్ గా చెప్పాలంటే ఓ ఇద్దరు స్నేహితులు కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నట్లు. శ్రీ శ్రీ గారన్నట్లు ఏ విషయం అయినా సరే... కుక్కపిల్ల నుంచి అగ్గిపుల్ల దాకా. 'చెప్పే వాడికి వినే వాడు లోకువ' అన్న నానుడి వినే ఉంటారు. దానర్ధం వినే వాడు తెలివి తక్కువ వాడు అని కాదు. చెప్పే వాడికి మాత్రం ఏమాత్రం అడ్డు ఆపూ లేవని. నాక్కూడా శ్రీ రమణ గారు అలాంటి లైసెన్స్ ఇచ్చేశారు. ఇక నా ఇష్టం, మీ కష్టం.