మై డియర్ రోమియో - 42

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 42

 

స్వప్న కంఠంనేని

 

వాసంతి, హేమంత్ లు చాలా రోజుల తర్వాత ఆ రోజే ఇందిరా పార్కులో కలుసుకున్నారు.
"ఏందీ మధ్య అస్సలు కలుస్తనే లేవ్'' నిష్ఠూరంగా అంది వాసంతి.
"ఎక్కడా? ... ఇంట్లో గోలతో క్షణం తీరికుండటం లేదు'' అన్నాడు హేమంత్.
"ఇంట్లో గోలనా. అదేంది, ఏమైంది?''
"ఏం లేదులే. ఏదో మాట వరసకన్నాను. అంటే పని వత్తిడివల్ల అన్నమాట''
"అట్లయితే సరేగాని మీ ఆయా మైసమ్మని పన్లో నుంచి ఏంటికి తీసేస్తాలేవు?''
"మైసమ్మెవరు?'' అయోమయంగా అన్నాడు హేమంత్.
"అగో. మైసమ్మదెల్వదా?'' అంటూ తను ఫోన్ చేయటం, మైసమ్మకీ, తనకీ మధ్య జరిగిన సంభాషణ ... అంతా చెప్పి చివరగా అంది వాసంతి.
"ఆరోజు మీ చెల్లె గూడ చెప్తుండే. మైసమ్మని నువ్వే పన్లోకెంచి తియ్యనిస్తలేవంట కదా!''
"మైసమ్మెవరా?'' అనుకుంటూ రెండు నిముషాల పాటు ఆలోచించాడు హేమంత్. అప్పుడు తట్టిందతనికి. పగలబడి నవ్వడం మొదలెట్టాడు.
"మా హనీ నిన్ను భలేగా ఫూల్ చేసిందే!'' నవ్వుతూనే అన్నాడు హేమంత్.
"నేనొకటి జెప్తే నువింకొకటంటావ్. మీ హనీ నన్ను ఫూల్ చేసేడేంది? నీకేమన్నా పిచ్చి లేసిందా?'' కోపంగా అంది వాసంతి.
అప్పుడు హేమంత్ హనితే మైసమ్మనని చెప్పి మాట్లాడి ఉంటుందని వివరంగా చెప్పాడు. తర్వాత అన్నాడు "మా చెల్లె నిన్ను హౌలా లెక్క ట్రీట్ జేసిందిలే''
"నువ్వేమన్నా అను గాని నా భాషని వెక్కిరించకు. నాకు తిక్కలేస్తది'' ఉక్రోషంగా అంది వాసంతి.
"ఓ! అయామ్ సారీ. కానీ నేన్నీ భాషను వెక్కిరించడంలేదు తల్లీ. నీతో మాట్లాడి మాట్లాడి నాక్కూడా నీ భాషే వచ్చేస్తోంది. డానికి నేనేం చేయను'' అంటూ నవ్వబోయాడు హేమంత్.
కానీ అప్పటికే వాసంతి మొహం జేవురించి ఉండటాన్ని చూసి నవ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకోసాగాడు.
"వైభవ్ నువ్వు నన్ను దూరంగా ఉంచుతున్నావ్ ఎందుకని? వై డోంట్ యూ అందర స్టాండ్ మీ. ఐ లవ్ యూ వైభవ్. ఐ లవ్ యూ'' వైభవ్ ఫోటోని చూస్తూ రహస్యంగా అనుకుంది హనిత.
ఆ ఫోటోని మీనాయే వైభవ్ ఐడెంటిటీ కార్డ్ నుంచి కొట్టేసి హనితకిచ్చింది.
తర్వాత హనిత లేచి డైరీలో ఇలా రాసుకుంది.
"డియర్ డైరీ!
ప్రేమ గొప్పదా స్నేహం గొప్పదా అని ఎవరైనా నన్నడిగితే స్నేహమే గొప్పదంటాను వైభవ్ తో ప్రేమలో పడ్డాక కూడా ఇలా అంటున్నానేమిటా అని ఆశ్చర్యపోకు. నిజం చెప్పాలంటే ప్రేమలో పడ్డాకే నేను స్నేహం విలువ తెలుసుకున్నాను. ప్రేమ స్నేహాన్ని హర్షిస్తుందో లేదో గాని స్నేహం మాత్రం ప్రేమని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మీనా నాకీ ఫోటో తెచ్చిచ్చిందని ఇలా అంటున్నాననుకోకు. యు నో! వైభవ్ కంటే మీనా అంటేనే నాకెక్కువ ప్రేమ. నన్నూ, వైభవ్ ని కలపాలని మీనా పడుతున్న తాపత్రయం చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఎందుకో తెలుసా? అంత మంచి ఫ్రెండ్ ని దేవుడు నాకిచ్చినందుకు.
ఒకవేళ ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై "హనీ! నీకేం కావాలో కోరుకో!'' అంటే నేనేం కోరుకుంటానో తెలుసా? పోనీ! గెస్ చెయ్. వైభవ్ నీ, నన్నూ కలపమని కోరుకుంటా ననుకుంటున్నావా? ఊహు! నేనేం కోరుకుంటానంటే "వచ్చే జన్మలో కూడా మీనాని నా ఫ్రెండ్ గానే పుట్టించు దేవుడా!'' ని అసలు నేను దేవుణ్ణి రెండు కోరికలు కోరేస్తాను.  మొదటిది ఇందాక నీతో చెప్పినదైతే, రెండోది వచ్చే జన్మలో ఏనుగుని మింగిన మీనాని కాకుండా, వట్టి మీనాని పుట్టించమని. ఆహ్హహ్హాహ్హా!''
నవ్వుకుంటూ లేచి మేడపైకి వెళ్ళింది.