Mee Vanthu Vastundi

మీ వంతూ వస్తుంది

************************

అదొక గవర్నమెంటాఫీస్.

ఆఫీసర్ చాముండేశ్వరరావు పెద్దాఫీసరు.క్యాబిన్ లోంచి చెమటలు కక్కుకుంటూ బయటకు వచ్చాడు.

“ఉస్ స్ స్...”అని చొక్కా కాలర్ దగ్గర పట్టుకుని ఆడిస్తూ కుర్చీలో కూర్చున్నాడు.

అతని కింద పంజేసే క్లర్కులు సీతారాం,ఆత్మారాం ఇద్దరు ఆశ్చర్యంగా చాముండేశ్వరరావు వంక చూశారు.

“అదేంటి సార్..మీ తల అలా ఉంది "సీతారాం అడిగాడు.

“ఎలా ?”తల తడుముకుంటూ విస్తుబోతూ అడిగాడు చాముండేశ్వరరావు.

“ఇందాక పెద్దాఫీసరు క్యాబిన్ లోకి వెళ్ళకముందు మీ తల బొప్పాసి కాయలా ఉంది "చెప్పాడు ఆత్మారాం.

“మరిప్పుడు..?”కంగారుగా అడిగాడు చాముండేశ్వరరావు. “పండిన పనసకాయాలా అయ్యింది "చెప్పాడు సీతారాం.

“నిజంగానా?”బిక్కమొహం వేశాడు అతను.

“నిజం సార్!ఇద్దరూ ముక్తకంఠంతో అన్నారు.

చాముండేశ్వరరావుకు ఏమి అర్థంకాలేదు.

“మీతల సైజు పెరగడానికి కారణం ఏంటి సార్ ?ఆ రహస్యం మాకూ చెప్పరూ ?” అడిగాడు ఇద్దరూ.

“ఏం రహస్యమో నా బొంద..పెద్దాఫీసరు తిట్టడం.నాకు తల వాయడం అలవాటేగా?”నిట్టూరుస్తూ అన్నాడు చాముండేశ్వరరావు.

సీతారాం,ఆత్మారాం ఆ వైపుకు తిరిగి నవ్వుకున్నారు.

“ఎందుకు సార్ తలవాచేలా హహ...తిట్టాడు ?”అడిగాడు సీతారాం.

“అవున్సార్...హి హి..ఎందుకు సార్..సార్..”అడిగాడు ఆత్మారాం.

ఇద్దరు వస్తున్నా నవ్వుని ఆపుకోవాలని ప్రయత్నం చేశారు.

“ఎందుకేమిటి.డిపార్టుమెంట్లో బోల్డంత వర్కు పెండింగ్ ఉండిపోయింది.వర్కు పెండింగ్ ఉంటే మిమ్మల్నెవరు ఏమి అనరుగా.మాకే డైరక్టుగా పెద్దాఫీసరుతో కనెక్షన్ ఉంటుంది కాబట్టి మమ్ముల్నే చివాట్లేస్తారు.నాయన్నాయన్నాయనా..కాస్త పెండింగ్ వర్కు పూర్తీ చేయండి బాబులూ.లేకపోతే పనసకాయలా ఉన్న నా తల తంబూరా గుమ్మడికాయంత అవుతుంది.”ఇద్దరి గడ్డాలు పట్టుకుని బ్రతిమాలాడు చాముండేశ్వరరావు.

ఆత్మారాం,సీతారాం ఒకరి ముఖాలు ఒకరు రెండు క్షణాల పాటు చూసుకుని ఘేల్లుమని నవ్వారు.

“ఏమిటి..పని చెయ్యాలా?హి హి హి పని చెయ్యాలా "వచ్చే నవ్వుని ఆపుకుంటూ అడిగాడు సీతారాం.

“అందులో పెండింగ్ పని...మమ్ముల్నే చెయ్యమంటున్నారా...హ హ హ...?”అన్నాడు తను కూడా నవ్వును ఆపుకుంటూ ఆత్మారాం.

చాముండేశ్వరరావు బిక్క చచ్చిపొయాడు.

“లేకపోతే ఏంటిసార్ !ఈ వేళ ఏ వారం ?”

“శుక్రవారం "అన్నాడు చాముండేశ్వరరావు.

“శుక్రవారం నాడు కొత్త సినిమాలు రిలీజవుతాయాని మీకు తెల్సు కదా ?”అన్నారు ఇద్దరు.

“అర్రె...ఆ సంగతే మర్చిపోయానోయ్ "అన్నాడు నాలుక కొరుక్కుంటూ చాముండేశ్వరరావు.

“మరి మేం వెళ్లామా సార్ "అన్నాడు సీతారాం.

“అప్పుడే "

“అప్పుడే కాక ?మార్నింగ్ షో పదకొండు గంటలకే స్టార్ట్ అవుతుంది కదా "అన్నాడు ఆత్మారాం.

“మీరు వచ్చి అరగంటైనా కాలేదు.అప్పుడే ఆఫీసొదిలి వెళ్లి పోతానంటే ఎలాగయ్యా ?పోనీ మ్యాట్నీకి వెళ్ళకూడదూ "అన్నాడు చేతులు నలుపుకుంటూ.

“అమ్మబాబోయ్..అందాక ఆగలేము సార్...మేము ఇప్పుడే వెళ్తాం.పదరా సీతారాం "అన్నాడు ఆత్మారాం.

“పోనీ మార్నింగ్ షో అయ్యాక వస్తారా ?ప్లీజ్ రారూ...మంచోళ్ళు కదా?రారూ...”అన్నాడు చాముండేశ్వరరావు ఇద్దరి బుగ్గల మీదా చిటికెలు వేస్తూ.

“మేము వస్తే మాత్రం మీకేంటి సార్ ప్రయోజనం?అన్నాడు ఆత్మారాం.

“ఏదో కొంతైనా పని జరుగుతుంది కదా !”అన్నాడు చాముండేశ్వరరావు.

“పనా...జరగడమా!”అని ఇద్దరూ మళ్ళీ ఘెల్లున నవ్వారు.

“ఏం ?”బిక్క మొహం వేశాడు చాముండేశ్వరరావు.

సీతారాం,ఆత్మారాం మళ్ళీ మొహమొహాలు చూసుకుని ఘెల్లున నవ్వారు.

“ఆఫీసుకొచ్చినా టేబులు మీద తలెట్టుకుని నిద్రపోవడమేగా "అన్నారు ఇద్దరూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.

ఇంతలో ఫ్యూన్ వీరప్ప అక్కడికి వచ్చాడు.

“అయ్యా ఆత్మారాం గారూ !ఆ ఆదివారం కాళ్లేత్తి టేబులు మీద పెట్టి నిద్దరోడానికి ఆఫీసుకు రమ్మని మీకు చెప్పమన్నారు పెద్దాఫీసరు గారు "అన్నాడు వీరప్ప.

“ఏంటి..నన్ను డ్యూటీకి రమ్మంటున్నారా?అలాగే కానీ ప్రతిసారి కాళ్ళేత్తి నిద్రపోవాలంటే బోరు కొడుతుంది.ఈ ఆదివారం వార్తా పత్రికలూ,నవలలూ తెచ్చుకుని చదువుకుంటానని పెద్దాఫీసరు గార్తో చెప్పు "విసుక్కుంటూ అన్నాడు ఆత్మారాం.

“ఏమోనండి బాబూ..ఆయన నిద్దరోమన్నారు.అదే మీకు చెప్పాను.మీరు కథలు చదువుకుంటానంటే ఆ విషయం స్వయంగా మీరే ఆయనతో మాట్లాడండి.లేకపోతే ఆయన నన్ను తిడతారు "చెప్పి వెళ్ళిపోయాడు వీరప్ప.

ఆత్మారాం పెద్దాఫీసరు గదివైపు రెండు అడుగులు వేశాడు. సీతారాం చటుక్కున అతని చేయి పట్టుకున్నాడు.

“ఇప్పడాయన దగ్గరికి ఎందుకు ?వెళ్తే ఇ పట్టాన వదలరు.పెండింగ్ వర్కు గురించీ,అర్జంటు ఫైళ్ళ గురంచి అడుగుతాడు.సినిమాకి టైమైపోయింది.మనం సినిమా నుంచి వచ్చాక చెపుదువుగాని...” అన్నాడు సీతారాం.

“సరేలే..”అన్నాడు ఆత్మారాం. చాముండేశ్వరరావు నొసలు మీద అరచేత్తో కొట్టుకుంటూ "అలాగే అంతకంటే ఏం భాగ్యం ?”అన్నాడు సంబరంగా.

ఇద్దరూ గుమ్మం వైపు రెండు అడుగులు వేశారో లేదో వాళ్లకి ఇద్దరు పార్టీలు తగిలారు.

వాళ్ళని చూస్తూనే సీతారాం,ఆత్మారాం ముఖాలు వికసించాయి. గబగబా వచ్చి వాళ్ళ వాళ్ళ సీట్లో కూర్చున్నారు. మొదటీ పార్టీ ఆత్మారాం దగ్గరికి వచ్చాడు.

“హిహిహి...”అన్నాడు.

“మీ నవ్వులు చూసి మేం అయిసయి పోయాం "అన్నాడు ఆత్మారాం.

“తెలిసండి హి హి "అన్నాడు అతను.

“మరి తెచ్చావా ?”

“లేదండీ...పనయ్యాక ఇస్తాను " ఆత్మారాం ఆశ్చర్యంగా అతనివంక చూశాడు.

“నువ్వెప్పుడు గవర్నమెంట్ ఆఫీసుకు రాలేదా ?” అతను అమాయకంగా తల అడ్డంగా ఊపాడు.

“ఇదే మొదటిసారా ?” అవునన్నట్లు తల నిలువుగా ఊపాడు.

“అదీ సంగతి...ముందే డబ్బు లివ్వకుండా పనేలా జరుగుతుందయ్యా...”

“పనవ్వంగానే డబ్బులిస్తానండి.ప్లీజ్ సార్ "మీరు ఫైలు పుటప్ చేసి మాకు ఫావర్ బుల్ గా రాసి చాముండేశ్వరరావుకు ఇవ్వండి.ఆయన రికమెండ్ చేస్తూ సంతకం పెట్టి పెద్దాఫీసరు గార్కీ పంపిస్తారు.పెద్దాఫీసర్ గారు 'యస్'అంటారు.మీవల్లే ఆగిపోయింది "బ్రతిమాలాడు అతను.

“పెద్దాఫీసరు గారు 'యస్ 'అనడానికి డబ్బులిచ్చావా ?”ఆత్మారాం అడిగాడు. “ఇచ్చానండి...”వినయంగా తలూపాడు అతను.

“మరి చాముండేశ్వరరావు గార్కి ?”

“ఆయనకీ ఇచ్చానండీ "

“వాళ్ళిద్దరూ గొప్పోళ్ళు మేమే ఎందుకు పనికి రానోళ్ళం అవునా ?”

“ఎంత మాటండి ?అలాగని నేనన్నానా సార్..”

“అలాగని వేరేగా అనాలా !వాళ్లకేమో ముందే డబ్బులిచ్చేస్తావ్ మమ్ముల్నేమో పనయ్యేదాకా ఆగమంటావు ?మేమేమన్నా బిచ్చగాళ్ళలా కనిపిస్తున్నామా ?సీరియస్ గా అడిగాడు ఆత్మారాం.

“అమ్మమ్మా..ఎంతమాట?ఈవేళ డబ్బులు తీసుకురాలేదండీ.రేపు తప్పకుండా తెచ్చిస్తాను "

“అయితే రేపే రండి "

“రేపు,ఎల్లుండి ఆఫీసుకు సెలవు కదండీ "అన్నాడతను.

“మరి రేపు తెచ్చిస్తానని ఎలా చెప్పారు?మీతో కుదిరే బేరం కాదుగానీ,మీరు డబ్బులు తెచ్చినప్పుడే రండి.వస్తా...”అంటూ సీట్లో నుండి చివాలున లేచాడు ఆత్మారాం.

అదే సమయంలో సీతారాం ముందు కూర్చుని వున్న పార్టీ నవ్వుతూ లేచాడు.

“పదవోయ్ సినిమాకి వెళ్దాం.వీళ్ళతో మనకి బేరం కుదరదు "అన్నాడు ఆత్మారం సీతారాంతో.

“నాకు బేరం కుదిరింది..”సీతారాం ముసి ముసి నవ్వులు నవ్వుతూ సమాధానం చెప్పాడు.

“అయితే నువ్వు సినిమాకు రావా ?”అడిగాడు ఆత్మారాం.

“రాను నేను పంజేసుకుంటా...నువ్వెళ్ళు "అన్నాడు సీతారాం. ఆత్మారాం ఒక్కడే సినిమాకి వెళ్లాడు.

హాలు దగ్గర అదే ఆఫీసుకు చెందిన వేరే డిపార్టుమెంటు వాళ్ళు చాలామంది వున్నారు.వాళ్లందరూ ఆత్మారాంని చూసి సంతోషంగా చెయ్యూపారు.

“ఓ మీరంతా కూడా సినిమాకి వచ్చేసారే ?అన్నాడు ఆత్మారాం.

“ఆ...మాకు బెరాలేమీ తగల్లేదు "అన్నారు వాళ్ళు.

కొన్ని సంవత్సరాలు గడిచాయి.

సీతారాంకి,ఆత్మారాంకి ప్రమోషనులు వచ్చి ఆఫీసర్లు అయ్యారు.

ఇప్పుడు వాళ్లకింద పనిచేసే క్లర్కులు అటెండేన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేసి సినిమాలకి చెక్కేస్తున్నారు.

సీతారాం,ఆత్మారాం తలకాయ్ లు కొట్టుకుంటూ సీట్లలోనే కూర్చుంటున్నారు.