సిల్లీ ఫెలో - 89

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 89

- మల్లిక్

 

"అదే... మీరేమయినా మెస్సేజ్ చెప్తారనీ..." అన్నాడు.

"మేం ఆలోచిస్తున్యాం అని సెప్పిన్యా కదా! మేం ఏక్యాంబర్యంతో తర్వాత మాట్లాడత్యాం!"

"అలాగా? అయితే నేను వెళ్లిపోవచ్చు కద్సార్?" అడిగాడు బుచ్చిబాబు.

"హు... జరూర్!" అన్నాడు అగర్ వాల్ ఫైళ్ళలో తలదూర్చేస్తూ.


*          *          *

ఎలాగూ ఏకాంబరం ఆఫీసుకు తీరుబడిగా రమ్మన్నాడు కదా అని బుచ్చిబాబు ఇంటి వైపు బయలుదేరాడు. ఇంట్లో కాఫీ తాగి కాస్సేపు సీతతో కబుర్లేసి రిలాక్స్ అవుదామని అనుకున్నాడు. ఇల్లు అంతదూరంలో ఉండగానే వీధి తలుపులు తెరిచి ఉండడం గమనించాడు బుచ్చిబాబు. అబ్బ. సీతకెందుకింత అజాగ్రత్త? వీధి తలుపులు తెరుచుకుని ఎందుకుంది? ఇంటిలో ఎవడైనా దూరితే? అనుకున్నాడు బుచ్చిబాబు.

ఇంటి దగ్గరకొచ్చాక లోపలినుండి ఓ మగగొంతు వినిపించింది బుచ్చి బాబుకి. సీతకి ఈ ఊళ్ళో తెలిసినవాళ్ళెవరున్నారబ్బా! అందులో మగవాళ్ళు. బుచ్చిబాబులో మగవాడికుండే ఆందోళన... కొద్ది క్షణాలు!

లోపలికి వెళ్ళిన బుచ్చిబాబు కంటికి సోఫాలో ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుతున్న మోహన్, సీత కనిపించారు. మోహన్ ని చూసి బుచ్చిబాబు రిలాక్స్ అయ్యాడు గానీ అంతలోనే ఆ టైంలో అతనక్కడ వున్నందుకు కన్ ఫ్యూజ్ కూడా అయ్యాడు.

"అదేంటీ? నువ్వాఫీసుకు వెళ్ళలేదా?" అడిగింది సీత బుచ్చిబాబుని చూస్తూనే.

"వెళ్ళాను!" అన్నాడు బుచ్చిబాబు.

"వెళ్ళావా?" ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు మోహన్. "నువ్వు ఆఫీసుకు రాలేదనుకున్నా... హఠాత్తుగా ఆఫీసుకెందుకు రాలేదా... నీకు ఒంట్లోగానీ బాగోలేదేమోనని చూసి పోదామని వచ్చా! కానీ సీతగారు నువ్వు ఆఫీసుకు వెళ్ళావని చెప్పారు"

"నేను ఆఫీసుకే వెళ్ళాను. కానీ అగర్ వాల్ కంపెనీకి వెళ్ళి ఏదో కవర్ అందజేసి రమ్మని బాస్ నన్ను పంపించాడు. ఆ విషయం నీకు తెలీదేమో కదా!" చెప్పాడు బుచ్చిబాబు.

"అవునవును.. తెలీదు!" తొట్రుపాటు పడుతూ అన్నాడు మోహన్.

"ఎలాగూ దార్లోనే కదా... అక్కడ ఆఫీసులో క్యాంటిన్ కాఫీ త్రాగలేక చస్తున్నా... ఇంటి దగ్గర చిక్కని కాఫీ త్రాగి వెళ్దామని వచ్చా! సీతా... మా ఇద్దరికీ వేడి వేడికాఫీ పట్రా...." అన్నాడు బుచ్చిబాబు.

రెండు నిమిషాల్లో సీత ఇద్దరికీ కప్పుల్లో కాఫీ తెచ్చి పెట్టింది.

"నీకో?" అడిగాడు బుచ్చిబాబు.

"వద్దు... ఇందాకే త్రాగాను" అంది సీత.

"ఫరవాలేదు సీతగారు ... నాకు కంపెనీ ఇవ్వడం కోసం త్రాగండి!" అన్నాడు మోహన్ చనువుగా.

"మీకు బుచ్చిబాబు కంపెనీ ఇస్తున్నాడుగా" అంది సీత ఎక్స్ ప్రెషన్లెస్ ఫేస్ తో.

"పోనీ నాకు కాకపోతే మా ఇద్దరికీ కలిపి కంపెనీ ఇవ్వండి"

"అబ్బో...వద్దండీ. కాస్సేపయ్యాక నేను భోంచెయ్యాలి"

"కొద్దిగానేనండి.... ఒక ఖాళీ కప్పు తెచ్చుకోండి"

"సీతా! కాస్త తాగొచ్చు కదా?" ఆ డిస్కషన్ ప్రొలాంగ్ చేయడం ఇష్టంలేక కాస్త విసుగ్గా అన్నాడు బుచ్చిబాబు.

సీత లోపలినుండి ఖాళీ కప్పు తెచ్చుకుంది అయిష్టంగానే.

"ఇలాతే!" చెయ్యి చాపుతూ అన్నాడు బుచ్చిబాబు.

సీత కప్పుని బుచ్చిబాబుకి అందిచేంతలో మోహన్ ఆమె చేతిలోంచి చటుక్కున లాక్కున్నాడు.

"మీరిద్దరూ ఎప్పుడూ ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుంటూనే వుంటారు... కాస్త మాలాంటి వాళ్ళకి కూడా ఆ అవకాశం ఇవ్వూ" అన్నాడు మోహన్ బుచ్చిబాబుతో.

అతని అతిచనువు ఆ ఇద్దరికీ నచ్చలేదు. ముఖ్యంగా బుచ్చిబాబుకి.