సిల్లీ ఫెలో - 83

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 83

- మల్లిక్

 

ఆ మురికివాడలో చాలా హడావిడిగా ఉంది. ఎన్నోకార్లూ, జీపులూ ఉదయం నుండి అటూ ఇటూ బుర్రుబుర్రుమని తిరుగుతూ వున్నాయ్. ఫోటోగ్రాఫర్లు, పత్రికా విలేఖరులూ కూడా హడావిడిగా తిరుగుతున్నారు. మామూలుగా అయితే ఆ మురికివాడని ఎవరూ పట్టించుకోడు. కానీ ఆరోజు ఆ వాడకి ప్రత్యేకమైన రోజు.

ఎందుకంటే.... ఆ రోజు అక్కడ పందులపెంపకం ఫారం ఒకదానికి ప్రారంభోత్సవం జరుగుతూ వుంది. ప్రారంభించేది ఎవరో కాదు. ది గ్రేట్ మినిస్టర్ మిన్నారావ్. అప్పటికి రెండు గంటల్నుండి అందరూ మినిస్టర్ మిన్నారావ్ గురించి ఎదురుచూస్తున్నారు. ఆ ఫారం ఓనర్ ఎల్లయ్యకి ఒహటే టెన్షన్ వుంది. అసలు మిన్నారావ్ వస్తాడా రాడా అని.

ఎల్లయ్య తండ్రి మల్లయ్య గొణిగాడు. "ఓరెధవా.... నామాట ఇన్నావా? ఈ మిస్టర్లూ, ఆళ్ళూ ఎందుకురా... ఈ పందుల్ని సిన్నపట్నుండీ కన్నతల్లిలా పెంచాను ఆటి ఫారం నాతోటి ఓపెనింగ్స్ సేయింసరా అంటే ఇన్లేదు..."

"నూవూర్కో ఎహె! నీకేటి తెల్దు! ఇలా మినిస్టర్ లతో ఓపెనింగ్స్ సేయిస్తే ఎంతో పబ్లిసిటీ అవుద్ది! అసలు ఈ మిన్నారావ్ బాబు ఒకడు తెరగా దొరికాడు కాబట్టి ఇలా పందుల ఫారాన్ని ఓపెనింగ్స్ సేయిత్తున్నాంగానీ లేకపోతే మినిస్టర్లతో ఇలాంటివన్నీ మనం ఓపెనింగ్స్ సేయింసగలమా" తండ్రి మీద విసుకున్నాడు ఎల్లయ్య.

తండ్రిని అలా విసుకున్నా మనసులో మిన్నారావుని బండబూతులు తిట్టుకున్నాడు టైమైనా ఇంకా రానందుకు. మరో అయిదు నిమిషాల్లో రెండు జీపులూ, అయిదు కార్లూ రివ్వున వచ్చి అక్కడాగాయ్, వాటిల్లో ఒక కారులోంచి మినిస్టర్ మిన్నారావ్ దిగాడు. ఎల్లయ్య, మరికొంతమంది మినిస్టర్స్ మిన్నారావ్ కి పరుగున ఎదురెళ్ళి అతడ్ని పూలమాలలతో ముంచెత్తి వేసారు.

"ఓరి ఓరి ఓరి! నేను మినిటర్ని అయినప్పుడు కూడా ఇన్నిదండలు ఎవరూ వెయ్యలేదు కదయ్యా. మీ పందులు పదేసి పిల్లల్ని పెట్టా" సంబరపడిపోతూ అన్నాడు మినిస్టర్ మిన్నారా. "నేను లేటుగా గానీ రాలేదు కదా?" అని అడిగాడు మెడలో దండలు సర్దుకుంటూ.

"లేదయ్యా సరిగ్గా సమయానికి వచ్చారు" అన్నాడు ఎల్లయ్య వినయంగా.

"నేను సమయానికి వచ్చాను కదా అని మీరు ఆలీసెం సెయ్యమాకండి. ఏదీ.. ఓ కత్తెరిటు పారెయ్యండి రిబ్బన్ లటుక్కున కత్తిరించి ఓపెనింగ్స్ సేసి పారేస్తా... నాకవతల బోల్డన్ని అర్జంటు పనులున్నాయ్. గవర్నమెంటుని నడపడమా మజాకానా?" హడావిడి పడిపోతూ అన్నాడు మిన్నారావ్.

ఎల్లయ్య మినిస్టర్ మిన్నారావ్ ని ఓ పెద్ద పాక దగ్గరికి తీసుకెళ్ళాడు. జనం అంతా వాళ్ళని ఫాలో అయ్యారు. "ఇదే బాబయ్యా పందులఫారం" అంటూ ఎల్లయ్య మిన్నారావ్ చేతికి కత్తెర ఇచ్చాడు.

"ఓర్నీ! ఇదేంటి మామూలు కత్తెర ఇచ్చావ్. ఇది నా చంకలో ఎంట్రికలు కత్తిరించుకోడానికి కూడా పనికిరాడు. ఇట్టాంటి ఓపెనింగ్స్ కి నా కందరూ వెండి బంగారు కత్తెర్లు ఇస్తారు తెల్సా?" ఎల్లయ్య చెవిలో అన్నాడు మిన్నారావ్.

గుడిసెల్లో వుండేవాళ్ళం. మేం ఎండి, బంగారు కత్తెర్లు యాడివ్వగలం సామీ... ఈసారి సర్దుకో బాబయ్యా! తమరి సేతుల మీదుగా ఈ ఫారం వృద్ధి సెందితే మరో ఫారం పెట్టి దాని ఓపెనింగ్ సేయించేప్పుడు ఎండి కత్తెర ఇస్తానయ్యా!" అన్నాడు ఎల్లయ్య సణుగుతూ.

"సరె.... సరె... ఈ రాత్రి ఇంటికి మంచి పందిమాంసం పంపించు. ఆ పనైనా చెయ్యి" మొహం చిట్లిస్తూ అన్నాడు మిన్నారావ్.

"అట్టాగేనయ్యా.... మీరిక ఓపెనింగ్స్ సేసెయ్యండయ్యా!"

కెమెరాలు క్లిక్ క్లిక్ మంటూండగా మినిస్టర్ మిన్నారావ్ చిరునవ్వులు చిందిస్తూ రిబ్బన్ కత్తిరించాడు.

ఆ తరువాత ఆ పాకలోకి గభాలున పరిగెత్తి ఓ పంది పిల్లను అమాంతం ఎత్తుకుని దానిని ముద్దులతో ముంచెత్తాడు. "హర్రె! ఫోటోలో తియ్యరేందయ్యా" అన్నాడు ఫోటోగ్రాఫర్సు వంక చికాకుగా చూస్తూ.

ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తుండగా మిన్నారావ్ పందిపిల్లలను మరోసారి ముద్దుల్లో ముంచెత్తాడు. ఆ తరువాత అక్కడున్న జనాన్ని ఉద్దేశించి ఓ చిన్న ప్రసంగం చేసాడు మిన్నారావ్.

"ప్రియమైన సోదర సోదరీమణులారా.... నేను చెప్పొచ్చేదేంటంటే ఈనాడు పందులకు మనుషులకంటే ఎక్కువ ఇలువ వుందని నేడు నేను పందుల ఫారాన్ని ఓపెనింగ్స్ చెయ్యడమే చెపుతుంది. మా ప్రభుత్వానికి పందులంటే చాలా అభిమానం అందుకే మా పార్టీ యమ్మేల్యేలూ, మంత్రులూ పందుల్లా ప్రవర్తిస్తున్నారు. దీనిని మన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి నేను సవినయంగా మనవి చేసేదేంటంటే ప్రభుత్వం పందులు పెంచడానికి విరివిగా రుణాలు ఇవ్వాలని సంకల్పించింది. ఇలాంటి పందుల ఫారాలు ఇంకా పెట్టాలని, వాటిని ఓపెనింగ్స్ నేనే చేయాలని నా ఆశ! 

అందరూ చప్పట్లు కొట్టారు.

"నాది మరో చిన్న మనవి! నేనీనాడు ఇలా పందుల ఫారాన్ని ఓపెనింగ్ చేసానంటే దాని ఎనకమాల పెద్ద కోరిక ఉంది. అదేంటంటే వచ్చే ఎన్నికల్లో పందుల్ని పెంచేవారంతా మా పార్టీకే ఓటెయ్యాల! జైహింద్"

అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు.