సిల్లీ ఫెలో - 60

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 60

- మల్లిక్

 

ఏకాంబరం ఆ ఇంటి ముందు ఆగాడు.

"కరెక్ట్. ఇదే ఆ కిల్లారి కిత్తిగాడి ఇల్లు" అనుకున్నాడు మనసులో.

అది నటరాజన్ ఇల్లు.

నటరాజన్ అంటే హెడ్డాఫీసులో పర్సనల్ డిపార్టుమెంటులో స్టాఫ్ కి సంబంధించి ట్రాన్స్ ఫర్ ప్రమోషన్స్ చూసే ఎగ్జిక్యూటివ్. బుచ్చిబాబు ట్రాన్స్ ఫర్ చేయించుకోవడం కోసం తనకిచ్చిన సలహా చాలా వింతగా సిల్లీగా అనిపించింది. ఏకాంబరానికి. ఓ పాత న్యూస్ పేపర్ తీసుకెళ్ళి మినిస్టర్ మిన్నారావుకి చూపించడం. అతను వెంటనే ట్రాన్స్ ఫర్ చేయించడం ఏంటి? అబ్సర్డు! అనుకున్నాడు.

అందుకే నటరాజన్ ని కలసి తన తన ట్రాన్స్ ఫర్ గురించి ప్రయత్నించాలని అనుకున్నాడు. ఇదివరకు తన ట్రాన్స్ ఫర్ గురించి హెడ్డాఫీసులో ప్రయత్నించాడు. గానీ కాలేదు. అందుకే ఈసారి డైరెక్టుగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన నటరాజన్ ని కలసి తన బాధలు చెప్పుకుని ట్రాన్స్ ఫర్ కోసం అడుగుదామని ఆఫీసు నుండి డైరెక్టుగా నటరాజన్ ఇంటికి వచ్చాడు ఏకాంబరం.

కాంపౌండ్ లోంచి లోపలికి వెళ్ళి "ఈ కిల్లారికిత్తిగాడు ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడో లేడో" అనుకుంటూ డోర్ బెల్ నొక్కాడు.

నాలుగు క్షణాల తర్వాత తలుపు వెనకాల నుండి "జన్... నటరాజన్ ఎవరు?" అని వినిపించింది.

"బరం... ఏకాంబరం" అని జవాబు చెప్పాడు ఏకాంబరం నటరాజన్ ఇంట్లో వున్నందుకు సంతోషిస్తూ.

ఆ మాట వింటూనే తలుపులు తెరుచుకున్నాయి.

"ఓ నువ్వాప్పా? రా రా..." అన్నాడు నటరాజన్.

ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.

"ఎన్నసామీ సమాచారం? మీ ఆఫీసు ఎట్లాదా వుంది?" అడిగాడు నటరాజన్.

ఏకాంబరానికి చాలా సంతోషం వేసింది. నటరాజన్ బాగానే రిసీవ్ చేసుకుని మాట్లాడుతున్నాడు.

తన ట్రాన్స్ ఫర్ గురించి రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోవచ్చు. నటరాజన్ కిల్లారికిత్తిగాడేమో అనుకున్నాడు గానీ.. ఫరవాలేదు. అతను డింగాల డిప్పే!

"ఎన్నసామీ? ఆఫీసు ఎట్లాదా వుంది అని అడిగితే సొల్లకుండా పైత్తికారి మాదిరి సూస్తా వుండావే!" అన్నాడు నటరాజన్ తననే గుడ్లప్పచెప్పి చూస్తున్న ఏకాంబరం వంక ఆశ్చర్యంగా చూస్తూ.

తన ఆలోచనల్లో మునిగిపోయిన ఏకాంబరం ఉలిక్కిపడ్డాడు.