సిల్లీ ఫెలో - 59

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 59

- మల్లిక్

 

"ఎనిమిది గంటలకల్లా మీ ఇంటికి క్యారియర్ తీసుకుని వస్తానోయ్" అన్నాడు ప్రక్కసీట్లోనే కూర్చుని ఉన్న మోహన్.

"అబ్బే! ఎందుకురా నీకనవసరంగా శ్రమ! ఏదో రాత్రే ఈ ఊరు వచ్చాం కాబట్టి ఉదయం కాఫీ, భోజనం ఏర్పాట్లు చేశావ్ బాగానే వుంది. ఇహ ఇక్కడి నుండైనా ఏర్పాట్లు మేం చూసుకోకపోతే చాలా సిల్లీగా వుంటుంది" అన్నాడు బుచ్చిబాబు.

"ఫరవాలేదులేవోయ్. ఈ ఒక్కపూటకి మాకేం శ్రమలేదులే! రేపటి నుండి మీ అరేంజ్ మెంట్స్ మీరు చూసుకోండి."

"అబ్బే.. వద్దు, నేను ఇప్పుడు ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ కొనుకుని వెళ్తున్నా! ఈ పూట కూడా మీకు శ్రమ కలిగిస్తే సీత కోప్పడుతుంది" అన్నాడు బుచ్చిబాబు.

"అబ్బో.... పెళ్ళాం చెప్పుచేతుల్లో బాగానే వున్నావన్నమాట!" అన్నాడు మోహన్ పకపకా నవ్వుతూ.

సీత నా పెళ్ళాంకాదు బాబోయ్ అని బుచ్చిబాబుకి గట్టిగా అరవాలనిపించింది.

తను చెప్పడం కన్నా మెల్లిగా వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు అనుకున్నాడు బుచ్చిబాబు.


*           *           *

బుచ్చిబాబు ఇంటికి తెచ్చిన సామాన్లు చూసి సీత నెత్తిమీద చేతులు ఉంచుకుని "హారి భగవంతుడా" అంది బాధగా.

బుచ్చిబాబు తెల్లమొహం వేసుకుని చూశాడు.

"ఏం? సరుకులు చాల్లేదా?" మెల్లగా అడిగాడు బుచ్చిబాబు.

"బాగానే వున్నాయి గానీ నీకు ఏవేవి ఎంతెంత కావాలో కూడా తెలీదా?" అడిగింది సీత.

"ఏం? ఇప్పుడేమైందని?"

"బియ్యం రెండు కేజీలు తెచ్చావు. చక్కెరేమో పదికేజీలు తెచ్చావు. పసుపు కిలోనా? లవంగాలు పావుకిలో, కందిపప్పు చటకా? ఆవాలు కిలో ఎందుకూ? ఇలా ఎవరయినా తెస్తారా?"

"పోనీ ఏవేవి ఎంతెంత కావాలో నువ్వో లిస్టు రాసి ఇవ్వాల్సింది.

"నాకేం తెలుసు నువ్వు మరీ ఏమీ తెలీని సన్నాసివని?"

"నేను సన్నాసినా? ఊర్కే సిల్లీగా వాగకు" కోపంగా అన్నాడు బుచ్చిబాబు.

"ఏంటి అరుస్తున్నావు? నేనేం నీ పెళ్ళాన్ని కాదు" మొహం చిట్లించి అంది సీత.

అవును కదూ?

బుచ్చిబాబు నాలుక కొరుక్కున్నాడు.

"సారీ సీతా! ఇన్నాళ్ళూ నాన్న తెచ్చిపెడితే, అమ్మవండిపెడుతే తిన్నాను కదా! అందుకే నాకేమీ తెలీదు."

"ఈ కూరగాయలు కూడా అలాగే తెచ్చావు. ఓ రెండు బంగాళాదుంపలు, అర్థపావు వంకాయలు, కిలో పచ్చిమిరపకాయలు, అరకిలో అల్లం..." నెత్తికొట్టుకుంటూ చెప్పసాగింది సీత.

"అబ్బో! సంసారం చెయ్యడానికి సిల్లీగా చాలా సంగతులు తెలిసుండాలన్న మాట?" అనుకున్నాడు బుచ్చిబాబు.