సిల్లీ ఫెలో - 49

Get latest Mallik telugu famous comedy serials, Mallik Telugu Comedy Serial Silly Fellow,  Mallik telugu serial comics and latest jokes online

 

సిల్లీఫెలో - 49

- మల్లిక్

 

"హారి! నువ్వా!" మళ్ళీ వచ్చావ్?! నీ ట్రాన్స్ ఫర్ విషయంలో నేనింక ఏమీ పట్టించుకోనని చెప్పాకదయ్యా. రికమెండేషన్ చెయ్యడానిక్కూడా సరైన పద్దతుండాల! ఓసారి ట్రాన్స్ ఫర్ ఆపు. ఇంకోసారి ట్రాన్స్ ఫర్ చెయ్యి అంటూ రికమండేషన్లు చేస్తే నన్ను హౌలాగాడిననుకుంటారు!" మొహం చిట్లిస్తూ అన్నాడు మినిస్టర్ మిన్నారావ్.

"అదికాదండీ. మీకు ఈ న్యూస్ పేపర్లు చూపిద్దామని తెచ్చా..." అన్నాడు బుచ్చిబాబు.

మినిస్టర్ మిన్నారావ్ మొహం వెలిగింది.

"ఓ ... న్యూస్ పేపర్లో కూడా నా చికెన్ సెంటర్ ఓపెనింగ్ ఫోటోలు పడ్డాయా! నేను నవ్వుతున్నప్పుడు ఫోటోలు తియ్యలేదయ్యా నాయాళ్ళు. ఏదీ ఏదీ యిలాతే" సంబరంగా అంటూ చెయ్యి ముందుకు చాపాడు.

బుచ్చిబాబు తన చేతిలో వున్న న్యూస్ పేపర్లో ఒకదానిని మినిస్టర్ మిన్నారావ్ చేతికి అందించాడు.

అది పాత న్యూస్ పేపర్.

"ఏంటిది.... పాత న్యూస్ పేపర్ లా వుందే.... ఇందులో నేను కిళ్ళీషాపు ఓపెనింగ్ చేసిన ఫోటో ఏదైనా పడిందా?' అడిగాడు మిన్నారావ్.

"కాదు.. పేజీ తిప్పి లోపల చూడండి"

మినిస్టర్ మిన్నారావ్ పేజీ తిప్పి చూశాడు. వెంకటలక్ష్మి కూడా కుతూహలంగా ముందుకు వంగి న్యూస్ పేపర్లోకి తొంగి చూసింది. అక్కడ రాజకీయనాయకుడు రాజేంద్ర దారుణంగా హత్య చేయబడిన న్యూస్ వుంది. అది చూడగానే మినిస్టర్ మిన్నారావ్ మొహంలో రంగులు మారాయ్.

అతని మనసులో ఎన్నో సందేహాలు ... ఒక్క క్షణంలో!

"నువ్వెందుకిక్కడ.. లోపలకెళ్ళి పన్లు చూసుకో..." పెళ్ళాం వైపు తిరిగి విసుగ్గా అన్నాడు మిన్నారావ్.

"పిల్చేది నువ్వే... ఇసుక్కునేది నువ్వే... సంపేత్తున్నావ్ కదా...." విసుక్కుంటూ లోపలికెళ్ళిపోయింది వెంకటలక్ష్మి.

మినిస్టర్ మిన్నారావు బుచ్చిబాబు వంక చూసాడు.

"ఇంతకీ ఈ న్యూస్ పేపర్ నాకెందుకు చూపిస్తున్నావో నాకర్థం కావడం లేదు.!

"మీరు మరిచిపోయారా సార్! నేను పోయినసారి నా ఫ్రెండ్ తో కలసి మీ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇంకెవరమో అనుకుని రాజేంద్ర ఫోటో మాకిచ్చి దాంతో పాటు డబ్బు కూడా ఇచ్చి అతన్ని సఫా చెయ్యమని చెప్పారు" మినిస్టర్ మిన్నారావ్ మొహంలోని ఫీలింగ్స్ ని గమనిస్తూ అన్నాడు బుచ్చిబాబు.

బుచ్చిబాబు ఊహించినట్టుగానే మిన్స్టర్ మిన్నారావ్ మొహం మాడిన పెసరట్టులా అయ్యింది.

"ఆ తర్వాత ఈ పేపర్లో రాజేంద్ర దారుణ హత్యకి సంబంధించిన వార్తని చదివాను" మెల్లగా అన్నాడు బుచ్చిబాబు.

మినిస్టర్ మిన్నారావ్ కి మాట పడిపోయింది. గుడ్లు మిటకరిస్తూ బుచ్చిబాబు వంక చూశాడు.

అవును... తను ఆరోజు జరిగిన విషయం గురించి మర్చిపోయాడు. పొరపాటున రాజేంద్ర ఫోటోని వాళ్ళకి ఇవ్వడం, వాడిని హత్యచేయమని చెప్పడం..

ఎంత పొరపాటైంది? వీడికి ఆ హత్యారహస్యం తెలుసు. ఇంతకీ వీడు ఎందుకొచ్చినట్టు?

ఆ విషయాన్నే అడిగాడు మిన్నారావ్.

"ఇంతకీ నువ్వెందుకు వచ్చావ్?"

"ఏం లేదు సార్... ఆ రోజు జరిగింది తలచుకుంటే మీరే రాజేంద్రని చంపించారని ఎలాంటి సిల్లీఫెలోకైనా అర్థం అవుతుంది. కానీ నేను మాత్రం మీరు చంపించారని అనుకోవడం లేదు" కొన్ని క్షణాలు ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. "ఎందుకైనా మంచిది అని మిమ్మల్ని హెచ్చరించాలని వచ్చాను... ఇదిగో ఈ న్యూస్ పేపర్ చూడండి. రాజేంద్ర హత్య కేసుని సిబిఐ వాళ్ళు టేకప్ చేసినట్లు వేసారు.. అయినా ఆ వార్తని మీరు చూసే వుంటారు. ఏదో మీమీద అభిమానం కొద్దీ మీతో చెప్పి పోదామని వచ్చాను" అంటూ చేతిలోని న్యూస్ పేపర్ ని మిన్నారావ్ కి ఇచ్చాడు.

మిన్నారావ్ న్యూస్ పేపర్లోని వార్తని పాలిపోయిన మొహంతో చదివాడు.

"నేనిక వస్తాను సార్" వెనక్కి తిరిగాడు బుచ్చిబాబు.

"ఆగవోయ్ ఆగు" కంగారుగా అన్నాడు మిన్నారావ్. బుచ్చిబాబు ఎందుకొచ్చాడో అర్థంకాని తింగరోడు కాదు మినిస్టర్ మిన్నారావ్.

బుచ్చిబాబు ఆగాడు.